2144* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

సొంత ఊరి ఆనంద ఆరోగ్యాల దృష్టితో 2144* వ నాటి శ్రమదానం.

 

ఈ మార్చి మాసపు తొమ్మిదవ దినాన – మబ్బులు క్రమ్మిన వేకువ 4.20 సమయానికి బందరు రహదారిలో గల ATM కేంద్రం దగ్గర కనిపించిన 14 – 15 మంది స్వచ్ఛ కార్యకర్తలే కాదు – కొద్ది నిముషాల అంతరంతో 17 మంది చేరి, వాళ్ళ బలం 32 మందిగా తేలి, 6.20 దాక – 50/60 పని గంటలలో – సడలని పట్టుదలతో జరిగిన ముఖ్య వీధి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధనా ప్రయత్నం ఫలించింది. ఐతే శుభ్రపడిన ప్రదేశం మాత్రం సుమారు వందగజాలే.

 

“మరి ఇందరు స్వచ్ఛవీరులు రెండేసి గంటలు పొడిచేసింది ఇదేనా?” అని ఎవరూ సందేహించవద్దు. అక్కడ నెల కొన్నవి రెండు దేవాలయాలు, రెండు కూరల దుకాణాలు, మూడు – నాలుగు సంచార టిఫిన్ బళ్ళు, 15 – 20 వ్యాపార దుకాణాలు వగైరా. చల్లపల్లి జనాభాలో చాల మందికి స్వచ్ఛ – శుభ్రతా స్పృహలోపిస్తే, వ్యాపారులకు బాధ్యత పట్టకపోతే – గ్రామ పాలక వ్యవస్థ కొన్ని కారణాలతో చురుకుగా మారకపోతే – ఈ వంద గజాల్లోనే 1000 గజాలకు సరిపడా దుమ్ము - ఇసుక – ప్లాస్టిక్ చెత్త, కొబ్బరి బొండాల మిగుళ్లు, తిను బండారాల వ్యర్ధాలు, కూరల వ్యర్ధాలు... పేరుకుపోవా?

 

ఈ పాతిక – ముప్పై మందిలో కొందరికి మోకాళ్ళు, నడుములు, చేతులు, గూళ్ళు నొప్పులు రాకపోలేదు – ఐనా ఆ ఉత్సాహంలో, పట్టుదలలో, ఒక మంచి పని కోసం అప్పటికప్పుడు పుట్టుకొచ్చే చైతన్యంలో, ఐకమత్యం – సమిష్టి తత్త్వాల ఊపులో ఆ నొప్పుల్ని మరీ గౌరవించి, ఎవ్వరూ ప్రక్కకుపోయి కూర్చోలేదు! (వాళ్ళకి ఈ పని, నొప్పులు క్రొత్త ఐతే గదా!)

 

నిన్న సాయంత్రం దాక ఈ ATM కేంద్రం, గుడుల, షాపుల ముందు ఎంతగా మట్టి ఇసుకలు అంగుళాల మందంలో పేరుకుపోయి గట్టిపడినవో కొందరు గ్రామస్తులైనా చూసే ఉంటారు, కొందరు దుకాణాదారులైతే దాన్ని అసహ్యించుకొని కూడ – రేపో మాపో స్వచ్ఛ కార్యకర్తలు వస్తారులే  - చూసుకొంటారులే అనుకొన్నారని తెలిసింది. ఇక ఇప్పుడు 7.00 తరువాత గ్రామస్తులంతా దయచేసి ఈ 100 గజాల స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాలను తప్పనిసరిగా చూడాలనిమనవి!

 

ఉదయం 5.30 వేళ దాటాక ఈరోజు ATM కేంద్రాల దగ్గర కార్యకర్తల దీక్ష, శ్రమ, ఉత్సాహం, మొత్తంగా ఆదర్శవంతమైన ఆ శ్రమైక జీవన సౌందర్యం చూసి తీరవలసిందే! 4.20 సమయానికి అక్కడ ఎన్నెన్ని కశ్మలాలు, అక్రమాలు కనిపిస్తున్నదీ, స్వచ్ఛ కార్యకర్తల పరాక్రమంతో మన గ్రామంలోని ఈ భాగం ఇప్పుడెంత స్వచ్ఛ – మనోహరంగా ఉన్నదో జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం వాట్సాప్ లోని చిత్రాలు, శ్రవణ చిత్రాలు (వీడియోలు) చూస్తే తెలుస్తుంది. దుమ్ము డిప్పలు మోస్తూ ట్రక్కు వద్దకు పరిగెత్తే వయస్సు మళ్లిన కార్యకర్తల్నీ, మధ్యలో బరువు డిప్పని భుజం మార్చుకొంటున్న డాక్టరమ్మనీ, ఊడుస్తున్న దుమ్ము ధూళిలో కనీ – కనిపించని గ్రామ సర్పంచమ్మనీ, నాల్గు చక్రాల అంగడి బళ్ళ క్రిందకి వంగి, అక్కడి కశ్మల దరిద్రాలను బైటకు లాగుతున్న గృహిణుల్నీ, తానే స్వయంగా కొన్న పెద్ద బ్రష్ తో వంగి రంగు రాళ్ళ మట్టిని తుడుస్తున్న ఒక సుందరీకర్తనీ... నేను మరే ఊళ్ళనూ చూడలేక పోవచ్చు!

 

యధావిధిగానే 6.40 కి కాఫీ – స్వచ్ఛ కబుర్లు, డాక్టరు గారి ఆశ్చర్యానంద భరిత సమీక్ష, ఒకటి – రెండు రోజుల గైరు హాజరు తరువాత వచ్చి చల్లపల్లి గ్రామ స్వచ్ఛ – శుభ్ర సౌందర్య సంకల్పాన్ని భోగాది వాసు మూడు మార్లు దంచి కొట్టి నినదించడమూ సాఫీగా జరిగిపోయినవి.

 

ఈ నాటి మరొక విశేషం : కాంట్రాక్టర్ నాదెళ్ల వేణు గారు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనడం. మన చారిత్రాత్మక చల్లపల్లి కోట ఉత్తరపు రెండు మలుపుల వద్దనూ, విజయవాడ బాటలో ఇంకొన్ని గుంటలను కొన్నాళ్లుగా చూసి భరించలేని ప్రముఖ డాక్టర్/ స్వచ్ఛ మహిళా కార్యకర్త స్వచ్ఛ సైనికులే ఈ బాటను సౌకర్యవంతంగా పునర్నిర్మించదలచి ఒక అంచనా నిమిత్తం వేణు గారిని సంప్రదించగా – రోడ్ల – భవనాల శాఖ ఇంజనీయర్ మీ ప్రతిపాదనకు ధన్యవాదాలు, మేమే కొద్ది రోజులలో ఆ బాట మరమ్మత్తులు చేస్తాము అని చెప్పారట!    

   

ప్రతి ఏడూ ఒక ఆనవాయితీగా – మహా శివరాత్రి పర్వం ముందు పెదకళ్లేపల్లి దారిలోని మేకల డొంక నుండి శుభ్రపరిచే సంప్రదాయాన్ననుసరించి, రేపటి వేకువ 4.30 కన్న ముందే మనం కలుసుకొని, వందలాది ప్రయాణికుల ఆహ్లాదం కోసం ప్రయత్నిద్దాం!

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 12

 

తరతరాల – రకరకాల దరిద్రతలకు వీడుకోలు

సుమ సుందర – సుస్యందన – సుమనోజ్ఞత మేలికొలుపు

అసలీ కధ రెండు వేల పదమూడుకె మొదలైనది!

స్వచ్ఛ సైన్య నిత్య శ్రమ సాధించిన విజయంబిది!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

09.03.2021.