2146* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

పెదకళ్ళేపల్లి దారిలో 2146* వ నాటి స్వచ్చోద్యమ అవిరళ కృషి.

 

ఈ మహా పర్వదిన ముహూర్తంలో – 23 మంది చల్లపల్లి స్వచ్చోద్యమకర్తలు 4.30 నుండి 6.10 నిముషాల నడుమ తల పెట్టిందీ, పాటు పడిందీ రక్తీ కాదు ముక్తీ కాదు; దక్షిణ కాశి అనబడే పెదకళ్ళేపల్లి శివుని (= శుభ్రప్రదుడు) దర్శించుకొని, ముక్తి నాశించుకొనే వేలాది భక్తుల ప్రయాణ భద్రతనీ, సౌకర్యాన్ని మాత్రమే! ఈ నిరంతర ప్రజాభ్యుదయకర శ్రమదాతల లక్ష్యం స్వగ్రామస్తులకు, యాత్రికులకు మరింత మెరుగైన సౌఖ్యమూ, సౌకర్యామూ! అట్టి సంతృప్తి వెదుకులాటలోనే వీళ్ళీ మార్గంలో గత ఐదారు శివరాత్రులకు ముందూ – తర్వాత వారాల తరబడీ చెమటలు చిందించారు! మరి – వేలాది మంది ముక్తి కోరుకునే భక్తులా – ఈ పాతిక మంది నిష్టా గరిష్ట కార్యకర్తలా – ఎవరు ఎక్కువ ధన్యులు?

 

ఏ 2500 రోజుల నాడో ఈ స్వచ్చంద శ్రమదాతలు ఒక చెక్కు చెదరని ధృఢ నిర్ణయానికి వచ్చి – తదాదిగా లక్షల కొద్దీ పని గంటల శ్రమదాన దీక్షలో ఉన్న క్రమంలో ఈ 11.03.2021 (గురువారం) నాటి రహదారి సేవా విన్యాసాలిలా ఉన్నాయి :

 

- నిన్నటి తమ స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత ప్రాంతం తరువాయిగా – మేకలడొంక వంతెన దక్షిణ దిశలో 100 గజాల నుండి ప్రారంభించి, దారికిరుప్రక్కల ఏ చిన్న ఆకులలములూ, కాగితం ముక్కలూ, ప్లాస్టిక్ సంచులూ, అక్కడక్కడ ఖాళీ మద్యం సీసాలు, నీళ్ళ సీసాలు, వరిగడ్డి పరకలూ వంటి సమస్త కశ్మలాలనూ చీపుళ్లతో శుభ్రపరచడం – ఈ వంతు ఇద్దరు మహిళలది!

 

- కళ్లేపల్లి బాట, దాని అంచులు గాక ముగ్గురు కార్యకర్తలు పొలం వైపు పడిన తాడి మట్టల్నీ, ఎందుకొచ్చాయో తెలియని ముళ్ళ మండల్ని కూడ పోగులు పెట్టడం!

 

- వీళ్ళు గాక, దంతెలతోను కొందరు కత్తులతోను వివిధ పిచ్చి – ముళ్ళ మొక్కల్ని నరికి, లాగి గుట్టలు పెట్టేవారు కొందరైతే – తామే గతంలో నాటి, సంరక్షించి, అందగించిన చెట్ల మీదకి, పూల మొక్కల మీదకి అసహ్యంగా అల్లుకొని, ప్రాకిన ముళ్ళ తీగల్ని నరికి, ఆ చెట్లను, తద్వారా రహదారిని మరింత సుందరంగా మలుస్తున్న స్వచ్ఛ కళాకారులు మరికొందరు!

 

- బాటకు పడమర లోతైన మురుగు కాల్వలో – అసలక్కడ ఆ చీకటిలో, మంచు పొరల్లో, దట్టంగా అల్లుకొన్న – పెరిగిన మోకాలు ఎత్తు తిక్క మొక్కల్లో, రకరకాల తుక్కుల్లో – ఏ జంతువులు – ముళ్ళు – రాళ్ళు ఉంటాయో చూసుకోక, వెరవక దిగి క్షుణ్ణంగా శుభ్ర – సుందరీకరిస్తున్న నలుగురైదుగురు కత్తి వీరులకు చల్లపల్లి, శివరామపురాల తరపున, భక్త యాత్రికుల తరపున నా అభివందనాలు!

 

నేను మొదటే చెప్పినట్లు - ఈ కార్యకర్తల్లో సొంత ముక్తి కంటే ముందు గ్రామ మెరుగుదలను, ఆ వరుసలో ఊరిలో ఎక్కడ శుభ్రత, పచ్చదనం, సౌకర్యం, సౌందర్యం - లోపించిందో వెతికి వెతికి తమకు చాతనైనంతగా ఆలోటును సరిజేసే బాధ్యులుండటమే - వేలాది దినాలుగా ఇలాంటి దీక్షతో సరైన ఆలోచనాపరులకు ఆదర్శంగా నిలుస్తుండడమే అతి పెద్ద విశేషం!

 

స్వచ్ఛ కార్యకర్తల్లో కొందరు భక్తవరులకు కళ్ళేపల్లి పుణ్యక్షేత్రంలో పులిహోర పంపిణీ చేసి (ఇందువల్లనే నేటి మన కార్యకర్తల సంఖ్య తగ్గింది!) వచ్చి – ఇక్కడి కార్యకర్తలకు కూడ పుష్కలంగా రుచి చూపించి, 6.15 సమయంలో అందలి ఒక (BSNL) కార్యకర్త సావకాశంగా గ్రామ – రహదారి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను పలికి, నేటి మన శ్రమదాన వేడుక ముగింపుకు వచ్చింది. ఇంతవరకు మనకోసం మనం ట్రస్టుకు 2,35,000/- భూరి విరాళం సమర్పించిన కంఠంనేని రామబ్రహ్మంను అందరూ అభినందించారు.

 

రేపటి వేకువ 4.30 కు ముందుగానే మనం మరొక మారు కలుసుకోవలసినదీ, రహదారి బాధ్యతలు చూసుకోవలసినదీ – పెదకళ్ళేపల్లి దారిలోని మేకలడొంక దగ్గరే!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 14

 

చూడ గలుగ వారికి గద – ఈ అందం తెలిసి వచ్చు

గ్రహింపగలుగు నైజమున్న శ్రమ – చెమటల విలువ తెలియు

గంగులపాలెం బాటను కర్మ వీరు లెంతమంది

సాధించిన – పూజించిన సత్యమెవరు తేల్చగలరు?

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

11.03.2021.