2148* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్చోద్యమ చల్లపల్లిలో 2148* వ నాటి శ్రమదాన మహనీయత.

 

శివరాత్రి పర్వదినానంతర శనివారం (13.03.2021) నాటి వేకువ జామున జరిగిన గ్రామ మెరుగుదల శ్రమదానంలో కలిసి వచ్చిన వారు ఊరి జనాభాలో వెయ్యి మందికి ఒకరు! అది చల్లపల్లి పంచాయతి పరిధిలోని మేకల డొంక – కొత్తూరుల నడిమి రహదారి – గత మూడు దినాలుగా శ్రమదానవేదికైన కళ్ళేపల్లి మార్గమే! ఇందుకు గాను స్వచ్ఛ కార్యకర్తలు ఎంచుకొన్న సమయం – 4.22 – 6.10 నడుమ. తమ ఊరి సంక్షేమానికి ప్రయత్నించిన వాళ్ళెందరు – ఎన్నాళ్ళు పాటుబడ్డారు – ఏ వీధిని, ఏ మురుగు కాల్వను, ఏ శ్మశానాన్ని, ఏ ప్రధాన వీధిని ఎంతగా శుభ్ర సుందరీకరించారు – ఏ రోడ్ల గుంటల్ని సరిజేసి, పార్కును సంస్కరించి తక్కిన ప్రజలలో స్ఫూర్తి నింపారు... వంటి గణాంకాలకన్న, అసలు వీళ్ళ తాత్త్విక పునాదులేవి? ఎంత చిత్త శుద్ధితో పనిచేశారు – ఆర్ధిక ప్రయోజనము, కీర్తికాంక్ష, ప్రచార దుగ్ధ లేవీ లేకుండ – అసలిది సేవే కాక తమ పవిత్ర బాధ్యతగా భావించి నిష్కామకర్మగా ముందుకు పోతున్నారా...? వంటి ప్రశ్నలే సమంజసమనుకొందాం.  

వాళ్ల కృషికి వెన్నెముకగా నిలుస్తున్న ‘మనకోసం మనం’ ట్రస్టుకు ఈ స్వచ్ఛ – సుందర కార్యకర్తలకు, వారి ద్వారా చల్లపల్లి పంచాయితీకి ఎన్నెన్ని పురస్కారాలు ఎందుకు లభించాయో, అనేక గ్రామాలకు, సామాజిక సేవలకు చల్లపల్లి స్వచ్ఛ సైన్యం ఎలా ఆదర్శంగా నిలుస్తున్నదో కూడ గమనించాలి.

 

ఇవాళ్టి 24 మంది కార్యకర్తల స్వచ్చంద కృషి వివరాల కొస్తే –

 

- నిన్నటి తరువాయి చోటనే ఆగి, పరిశుభ్రతా చర్యల్లో పురోగమించే క్రమంలో పది మంది కార్యకర్తల పదునుకత్తులకు బాట తూర్పు అంచు చాల పని కల్పించింది. ఈ ఏటి ఎడతెగని వర్షాల నడుమ తాడి చెట్ల పండ్ల గింజలు పడి మొలకెత్తి పెరిగి, దారినాక్రమిస్తున్న చాల మొక్కల్ని నరికేశారు. అక్కడి ఇతర ముళ్ళ – పిచ్చి – మొక్కలు కూడ వీళ్ళ కత్తులకు బలైపోయినవి. ఈ వ్యర్ధాలను, ఎండుటాకుల్ని, ఎండు వరిగడ్డి పరకల్ని, ఇతర తుక్కుల్ని ఇద్దరేమో దంతెలతో లాగి, ప్రోగులు పెట్టారు.

 

- చీపుళ్ళ మహిళా కార్యకర్తలు తారు రోడ్డును, దాని రెండు అంచుల్ని క్షుణ్ణంగా ఊడ్చారు.

 

- బాటకు పడమర డ్రైను కూడ అన్ని రకాల దిక్కు మాలిన కశ్మలాలలో ఏమీ తీసిపోలేదు. అందులో నీరిప్పుడు ఇంకిపోయి, పనికిరాని మొక్కలు పెరిగి, పై నుండి తాడి మట్టలు, కొన్ని చోట్ల ఎవరో విసిరిన త్రాగేసిన మద్యం సీసాలు, వాడేసిన కొబ్బరి బొండాలు అక్కడ ఎన్ని వ్యర్ధాలు కావాలన్నా దొరుకుతాయి! ఈ రోజు ఆరేడుగురు కార్యకర్తలకు వాటితో కావలసినంత పని!

 

- పైన కరెంటు, కేబుల్ తీగలకంటుకొన్న కొన్ని చెట్ల కొమ్మల్ని ఇద్దరు సుందరీకర్తలు నెమ్మది గాను, నైపుణ్యంతోను కత్తిరించారు.

 

          ఇలా ఈ కధ ఒక నాటిది కాదు; ఈ రహదార్ల కాలుష్యాల వ్యధ తాత్కాలికమూ కాదు! చల్లపల్లి, పెదప్రోలు పంచాయతీ పాలక వర్గాలు తీసుకోవలసిన శ్రద్ధ, పూనుకోవలసిన పరిశుభ్రతా సాధన!

 

6.30 సమయంలో నేటి కార్యకర్తల కఠోర శ్రమ మూలంగా స్వచ్ఛ సుందరీకృత రహదారి భాగాన్ని ఫొటోలు తీసి ఆనందించి, శ్రమదాన విభవాన్ని అభినందించిన డాక్టరు దాసరి రామకృష్ణ ప్రసాదు గారు ఈ సాయంత్రం 6.30 నుండి గుంటూరులో జరిగే అభినందన/ పురస్కారస్వీకారానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. బొమ్మిశెట్టి ఆత్మపరబ్రహ్మ సార్దక నామధేయుడు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య  సాధనా సంకల్ప నినాదాలతో నేటి కృషి పరి సమాప్తి!

 

రామానగరం వాస్తవ్యులు యార్లగడ్డ పుష్ప సుందరావతి గారు 2019 శివరాత్రి సమయంలో ఇచ్చిన 5,015/- రూపాయలను గాక మళ్ళీ నిన్న 2,000/- రూపాయలను మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీ కి అందజేశారు. వీరి సామాజిక బాధ్యతకు, గ్రామ ప్రయోజనం పట్ల ఉన్న నిబద్ధతకు కార్యకర్తలందరి తరపున ధన్యవాదాలు.

రేపటి గ్రామ మెరుగుదల కృషి కోసం మనం వేకువనే కలువదగిన ప్రదేశం శివరామపురం రహదారిలోని పంటకాలువ  వైపే!

 

అదే ధన్యత – అదే మాన్యత

 

దుష్ట సంతతి భ్రష్ట సంస్కృతి దుందుభులు మ్రోగించినప్పుడు

జడలు విప్పిన కశ్మలో ధృతి జగము నిండా రంకెలేస్తే

దమ్ము చూపి సమాజ బాధ్యత తలను దాల్చిన, పూర్తి చేసిన

స్వచ్ఛ వీరుల అడుగు జాడలు ననుసరిస్తే అంజలిస్తే.....!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

13.03.2021.