2150* వ రోజు ....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్ఛ సుందరోద్యమ గ్రామంలో మైలు రాయిగా - 2150* వ నాడు.

 

సంఖ్యాపరమైన ఒక చిన్న ప్రత్యేకత కల్గిన (2150) ఈ బుధవారం – 2021 మార్చి పదిహేడవ నాడు వేకువ 4.21 సమయంలో బారు తీరి సంత బజారు మొదట్లో కనిపిస్తున్న 14 మంది సంసిద్ధతను వాట్సాప్ మాధ్యమ చిత్రంలో చూడవచ్చు. వీరు కాక మరి కొద్ది నిముషాల్లో సకుటుంబంగా గ్రామ సర్పంచితో సహా వచ్చిన 17 మంది – వెరసి 30 మందికి పైగా – స్వగ్రామ స్వచ్ఛ – సుందర  బాధ్యతలను ఆరేడేళ్లుగా మోస్తున్న కార్యకర్తలు. వీళ్ళందరి భల్లూకం పట్టు శుభ్ర – సుందరీకరణతో సకల కశ్మల నికృష్టమైన సంత బజారును – ఈరోజు రాలేని స్వచ్ఛ కార్యకర్తలు సామాజిక మాధ్యమంలోను – గ్రామస్తులు కష్టమనుకోకుండ స్వయంగా వెళ్ళి – చూడవచ్చు! ఏ కొంచెం వీలైనా సొంత ఊరు గురించి ఆలోచించి – రేపటి నుండి చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఎవరైనా పాల్గొనవచ్చు!

 

సోమవారం నాటి సంత, ఆరోజు మినహా ప్రతి నిత్యం వందలమంది వచ్చిపోయే రైతు బజారు కారణంగా – ఈ వీధి వీధంతా చూసే వాళ్ళ కింత అసహ్యంగాను, అక్కడి మురుగులతో – క్రుళ్లిన కూరలు – ఆకులతో స్వచ్ఛ – సుందర చల్లపల్లి ని ఇంతగా కించపరిస్తూను, గ్రామేతరులు చూసి ఎగతాళి చేసేంత కశ్మల భీభత్సంగానూ ఉండాల్సిందేనా? క్రమశిక్షణకు మారుపేరైన రక్షకభట నివాసాల గేటులు అంతగా మురికి పేరుకుపోతే – ఏడేళ్ళ “స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి ఏ అర్ధం చెప్పుకోవాలి? గ్రామ స్వచ్ఛత – పరిశుభ్రత – తన్మూలంగా ప్రజల స్వస్తత పౌరులందరి ఉమ్మడి బాధ్యతే కదా? (ఏదో దారినపోయే వాహనదారుడొకరూ, స్థానికులిద్దరూ మాత్రం కొంత చెత్తను – అదీ ప్లాస్టిక్ సంచుల్లో – అప్పటికప్పుడు తెచ్చి ట్రస్టు వాహనంలో వేయడమే బాధ్యత అనుకొందాం!)

 

స్వచ్ఛ సైనికుల ఈనాటి కర్తవ్య నిర్వహణను పరిశీలిస్తే :

 

- మొత్తంగా వీళ్ళ ధాటికి బందరు దారి నుండి బైపాస్ మార్గం దాకా ఎప్పుడూ క్రిక్కిరిసి ఉండే, ఫలాహార – భోజనశాలల – వివిధ దుకాణాల నుండి ఉత్పన్నమయే సుమారు అరకిలోమీటరు వీధి నుండి ఒక ట్రక్కు దురర్ధక – నిరర్ధక వ్యర్ధాల సేకరణ – వాటిలో ఎన్నెన్ని చెప్పలేని కశ్మలాలో! ఇంకో అర ట్రక్కు దుమ్ము – ఇసుక – ధూళి మిశ్రమం!

 

- విడిగా చూస్తే, 20 మందికి చేతులు నొప్పి పెట్టేంతగా చీపుళ్లతో పట్టి పట్టి – అందులో ఒకాయనడైఐతే రెండు చీపుళ్ళతోనూ – ఊడ్చి – ఊడ్చి పోగులు పెట్టడమే రెండు గంటల పాటు పని!

 

- ఒకరు ట్రక్కులో, మరొకరు డ్రైవరుగా, ఇద్దరు డిప్పలకెత్తి మోస్తూ – మొత్తం నలుగురి ముఠా ఆ పొగుల్ని ట్రాక్టర్ లో నింపడం!

 

- ఇక గ్రామ సుందరీకర్తలైతే ఊపిరి సలపనంత బాధ్యత! నీళ్ళ టాంకుల గేటు ముందర – ఎందుకో చెదరి, చిందర వందరై, కుంగి గుంటలైన రంగు రాళ్ళను తీసి, సర్దడమే ఒక గంటకు పైగా వాళ్ళ ప్రధాన కర్తవ్యమైపోయింది.

 

సంత, రైతు బజార్ల లోపల, ఎదుట దాతలెన్ని లక్షలు వెచ్చించి, కార్యకర్తలెంతగా శ్రమించి, ఎన్ని నెలలు పాటుబడితే ఇంతగా స్వచ్ఛ – శుభ్రతలు సమకూరాయో – రంగు రాళ్ళను మురికి చేసే – బెత్తెడు మందాన ఆకులు, క్రుళ్లిన కూరలు – పండ్లను నిర్లక్ష్యంగా వదిలేసే బేహారులకు, తమ పని గడిస్తే చాలనుకొనే వినియోగదారులకూ, పౌరులని పిలువదగని కొందరు గ్రామస్తులకూ ఎప్పటికి తెలిసి వచ్చేను! ప్రతి ఉదయమూ 30 – 40 మంది ఏడేళ్లుగా ఎంత ప్రయత్నిస్తుంటే ఈ చల్లపల్లి ఈ మాత్రం కనుల విందుగా కనిపిస్తున్నదో సోదర గ్రామస్తులంతా ఎప్పటికి తీవ్రంగా పట్టించుకొంటారో! ఈ స్వచ్చంద శ్రమ దాతలు మాత్రం ఏ చేకూ – చింతా చెందక – డాక్టరు డి. ఆర్.కె. గారు తరచుగా చెపుతున్నట్లు – ప్రతి రోజూ ఒక శ్రమదాన పండుగ గానే భావిస్తారు!

 

నేటి గ్రామ కర్తవ్య నిర్వహణ ముగిసి – 6.40 కి జరిగే సమీక్షా సమావేశంలో తాతినేని (మొక్కల) రమణ స్థిరంగా ప్రకటించిన గ్రామ స్వచ్ఛ –పరిశుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను 30 మందీ ముమ్మారు ప్రతిధ్వనించి – నేటి పవిత్ర కర్తవ్యం ముగిసింది.

 

రేపటి మిగిలిన బాధ్యతల కోసం వేకువ 4.20/4.30 కి మనం తప్పక కలువ దగిన చోటు కూడ పోలీసు స్టేషన్ మలుపు (బందరు మార్గం) దగ్గరే!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 16

 

ఈ మార్గంలో నడుకలు ఇప్పడిందరికి ఫ్యాషన్

ప్రతి యొక్కరి కలల రాచబాటగ ఒక సెన్సేషన్

ఇది ఇంతటితో ఆగక ఎంతెంతో స్ఫూర్తి నింపి

ఎన్నెన్నో గ్రామాలకు ఇదొక డెస్టినేషన్!   

           

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

17.03.2021.