2151* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

వినూత్న స్వచ్ఛసుందర ఉద్యమపధంలో ఇంకొక నాడు (2151*).

 

వర్తమాన గురువారం (18.03.2021) నాటి గ్రామ మెరుగుదల కృషికి కలిసివచ్చిన కార్యకర్తలు 26 మందే గాని, మూడు రోడ్లలో మూడు విధాలుగా కనుల విందుగా రూపొందిన ప్రదేశాలు మాత్రం గ్రామస్తులు చూడవలసినవే! రెండు రకాల వాట్సాప్ ఛాయా చిత్రాలూ – అంటే 4.19 కి మూడు చోట్ల ఎలా ఉన్నవీ, 6.20 తరువాత వాటి తలరాతలెలా మారిపోయినవో పరిశీలించండి. ఈ మూడు ప్రాంతాల గ్రామస్తులు సైతం రోడ్ల మీదో – డ్రైనులోనో వ్యర్ధాలను విసిరే వాళ్ళుంటే – కార్యకర్తల నేటి శ్రమదానంతో పరిశుభ్రమైన తమతమ వీధుల్ని గమనించి – దయచేసి ఒక్కమారు ఆలోచించి, ఇక ముందు అట్టి అనాగరిక చర్యలకు పాల్పడకుందురు గాక! ఆరేడేళ్ళ స్వచ్ఛ సైనికుల నిరంతర ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయకుందురు గాక!

(ఇంతగా అభ్యర్ధన లెందుకంటే – సాగర్ టాకీసు ఎదుట కార్యకర్తల శ్రమతో స్వచ్ఛ – శుభ్రమైన చోటు కాస్తా ఒక పూట గడవక ముందే ప్లాస్టిక్ సంచులు మూటలు ప్రత్యక్షమై అసహ్యంగా మారింది)

 

నేటి త్రిభంగుల స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణల సంగతేమిటంటే :

 

- చాలా నెలల తరువాత ఆరుగురు (అందులో ఒకరు స్థానికురాలు) కార్యకర్తల దృష్టి షాబుల్ వీధి పైన పడింది! వీధి చిన్నదే గాని, అసలే ఇరుకు – దానికి తోడు కొందరి ఆక్రమణలు! ఇద్దరు మహిళల – నలుగురు పురుషు కార్యకర్తల 2.10 నిముషాల తీవ్ర కృషితో ఆ బాట ఇప్పుడెలా మారిందో వీక్షించండి! డ్రైనులోని, దాని గట్ల మీది ప్లాస్టిక్ సంచులూ, సీసాలు, వీలు చూసుకొని పెరుగుతున్న పనికిరాని మొక్కలు, ఈ ఇరుకు దారికి ఉపమార్గంలోని అడ్డదిడ్డాలు, దుమ్ము – ధూళి అన్ని లెక్కలూ సరైపోయాయి!

 

- మరో ఆరేడుగురు బృందం బందరు బాట ఉత్తరాన డ్రైన్ల నుండి లాగిన బహుళ వ్యర్ధాలు, ఊడ్చి, పోగులు చేసిన దుమ్ము – ఇసుక – మట్టి – గులకల మిశ్రాలు వారి స్వేదపూర్వక శ్రమజనిత వ్యర్ధ సంపదలు! రక్షక భట వీధిలో కొంత మేర ఈ రోజున ఈ కార్యకర్తల కృషి ఫలించి, శుభ్రపడినది. దుమ్ము కొట్టుకుపోయిన అక్కడి చెట్ల అవాంఛిత కొమ్మలు కూడ తప్పుకొన్నాయి!              

 

- సంత వీధిలో ముఖ్యంగా నీళ్ళ టాంకుల దగ్గర నిన్ననే గదా – సుందరీకర్తలు తమ పనితనం చూపింది! ఆ దగ్గర్లోనే ఈ‌ రోజు ఇంకొక గుంట ఏర్పడి – అది కాస్తా అందగింపుల బృందం కంటబడి – తెల్లవారే సమయానికి (వాళ్లెంతగా శ్రమించి – చెమట చిందించిందీ ప్రక్కన పెడితే -) రంగురాళ్ళు పీకి, ఇసుక సేకరించి సర్ది, రంగురాళ్ళు వంతుగా పేర్చడంతో తన తొలి అందాన్ని మళ్ళీ పొందింది!

 

సదరు నీళ్ళ టాంకుల పర్యవేక్షక ఉద్యోగి కాబోలు – అక్కడికి రావడం, స్వచ్ఛ – సుందర కార్యకర్తల నిస్వార్ధ కృషి చూడడం, అతడు సైతం ఒక పలుగు పుచ్చుకొని గంట సేపు వారితో కలిసి పనిచేయడం చూస్తుండగానే జరిగిపోయినవి! (ఇలా మరింత మంది గ్రామస్తులు వచ్చి చూసి, తాత్కాలిక కార్యకర్తలుగా మారితే – అది గ్రామ శుభ్రతకు శుభ సూచకం!)

 

- ఈ గురువారం నాటి మరొక శ్రమదాన విశేషం బైపాస్ మార్గం నుండి సినిమా ప్రదర్శనశాల మలుపుల్లో జరిగింది. రెస్క్యూ టీమ్ అనబడే రాటుదేలిన గట్టి కార్యకర్తలు గత కరోనా సమయ వర్షాలకు ఆ మలుపుల్లో పడిన గుంటల లెక్క తేల్చేశారు! గులకరాళ్ళు, రాతి ముక్కలు వంటి – అప్పటికప్పుడు సేకరించిన వ్యర్ధాలతోనే ఆ ఏడెనిమిది అడుగుల పల్లం పూడి – ఇప్పుడు వాహన ప్రయాణికులు వందలాది మందికది సౌకర్యవంతమైపోయింది!

 

ఇన్ని రకాల తమ స్వచ్చంద శ్రమదానాన్ని, తత్ఫలితాన్ని సమీక్షించుకొనేందుకు, మరింతగా తమ మెరుగుదల కృషిని విస్తరించుకొనేందుకు 6.35 కి జరిగిన దైనందిన శ్రమదాన సమీక్షా సమావేశంలో పూనుకొని, జనాబ్ మహ్మద్ జానీ ప్రకటించిన స్వగ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలకు ముమ్మారు దీటుగా ప్రతిస్పందించి కార్యకర్తలు  ఇంటి దారి పట్టారు.

 

రేపటి  సమష్టి శ్రమదానం కోసం ఈ బందరు రహదారిలోనే మనం వేకువ 4.30 ప్రాంతంలో కలుసుకొందాం.

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 17

 

ఇది సంస్తవ నీయ మార్గ – మిది శ్రమ సౌందర్య ఫలిత

మిది వీధుల తలమానిక – మిప్పుడిచట నడచుటయే

అంతస్తుకు చిహ్నంగా – ఆనందపుటంచులుగా

భావించే స్థితికి ప్రజలు వచ్చారట నిజంగా!

              

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

18.03.2021.