2152* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2152* వ నాటి స్వచ్ఛసుందరోద్యమ గ్రామంలో వీధి శుభ్రతలు.

 

ఈ శుక్రవారం (19.03.2021) నాటి ముఖ్య వీధి పారిశుద్ధ్య కృషిలో ప్రదర్శించిన సచైతన్య – సామాజిక – సామూహిక శక్తియుక్తులు 28 మందివి! – వీరిలో మొవ్వ గ్రామ మూలాలు కలిగి, ప్రస్తుత ఉత్తర అమెరికా ప్రవాసి – మండవ శేషగిరిరావు గారు కూడ ఒకరు! ఇందరు కార్యకర్తల నేటి దీక్షకు ఆది 4.18 సమయమైతే, అంతం 6.12. ఈ వేకువ జాములో స్వచ్చంద కార్యకర్తల శ్రమదానానికి ఆతిధ్యమిచ్చి, శుభ్ర – సుందర – మనోహరమైన స్థలాలు –

 

1) బందరు దారిలో షాబుల్ వీధి నుండి రాజ్యలక్ష్మి ఆస్పత్రి మలుపు దాక,

 

2) సంత వీధిలోని చలన చిత్ర ప్రదర్శనశాల దగ్గర.

 

        వేలాది దినాల – లక్షల కొద్దీ గంటల ఈ స్వచ్చంద శ్రమదాన సంఘటనల్ని ఎలా విశ్లేషించాలో అర్ధం కావడం లేదు! పాతికేళ్ళ క్రితం తన గ్రామానికి దూరమై, పాతికవేల కిలోమీటర్ల దూరాన – అమెరికాలో నివసించే వ్యక్తేమో – తన గ్రామం, తన ప్రాంతపు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తపన చెందుతాడు! వేకువనే లేచి మొవ్వ నుండి 14 కిలోమీటర్లు వచ్చి, చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమంతో మమేకమౌతాడు! ఇక్కడి పాతిక వేలమంది  మా గ్రామ సహోదరులు మాత్రం ఇంతటి అపూర్వ, ఆదర్శ శ్రమ వైభవాన్ని చూసి కూడ చూడనట్లే పట్టించుకోరు! పట్టించుకొన్నా – చాలా మంది నిర్లక్ష్యం, అలసత్వం వాళ్ళను వదలనే వదలవు! ఇంత మంచి గ్రామస్తుల్లో కూడ ఇంతగా ద్వైదీ భావం! కర్తవ్య నిర్వహణను వాయిదా వేసుకుంటూపోతున్న బాధ్యతలేమి తనం! ఊళ్ళో చిరకాలంగా జరుగుతున్న ఒక మంచి పనిలో పాల్గొనలేని ఒక బెరుకు, ఒక దౌర్బల్యం!

 

        జాతీయ రహదారిలో నేటి పవీత్రీకృత భాగం పట్టుమని 200 గజాలైనా ఉండదు! 20 మంది రెండేసి గంటల ప్రయత్నమింతేనా అనుకొనేరు! ఎక్కడెక్కడి దుమ్ము – ఇసుకలు, దుకాణాల ముందరి పొడి వ్యర్ధాలు, వానలు తగ్గినా అక్కడక్కడ పెరిగిన గడ్డిదుబ్బులు, కొద్దిపాటి ప్లాస్టిక్ సంచులు, సీసాలను గట్టిగా ఊడ్చి - కోసి,  గుట్టలు చేయడమూ, రాళ్ళమాటున – మురుగు కాల్వ కలుగుల్లో ఉన్న రకరకాల ప్లాస్టిక్ తుక్కుల్ని బైటకు రప్పించి, ఈ అన్ని భ్రష్ట వ్యర్ధాలనూ డిప్పలతో ట్రక్కులకెక్కించి 2 కిలోమీటర్ల దూరాన చెత్త కేంద్రానికి తరలించడం ఏమైనా తక్కువ పనా?  

     

        నిత్యం వందలాది వాహనాల నుండి జారిపడే పొడి వ్యర్ధాలు, వేల మంది జనాభా వల్ల ఉత్పన్నమయ్యే ఇతర వ్యర్ధాలు, కొన్ని దుకాణాలు పుణ్యం కట్టుకొనే రకరకాల చెత్తలకూ పంచాయితీ నుండి 10 – 12 మంది కాక – ఈ పాతిక మంది స్వచ్ఛ సైనికులే కదా సమాధానం చెప్పేది? స్వచ్చంద శ్రమదాతలు యధాప్రకారం నేడు కూడ చీపుళ్ళేకాక, రైల్వే పారలేకాక, గోకుడు పారలకూ, గునపాలకూ పని చెప్పి 3 అంగుళాల మందపు మట్టి పొరల్ని తొలగించి, రహదారిని విశాలంగా – అందంగా మార్చారు.

 

        అక్కడ దూరంగా సంత వీధిలో సుందరీకరణ బృందానికి అదొక 2 గంటల ప్రత్యేక కృషి! నిన్నటి – మొన్నటి గుంటలు కాక, రోడ్డు వార రంగు రాళ్ళ మధ్య మరొక గుంట బైట పడి, దాన్ని సుందరీకరించే బృహత్కార్యంలో వాళ్ళ ఆత్మ సంతృప్తిని వాళ్ళు వెతుకున్నారు! గ్రామ పౌరుల్లో ఎక్కువ మంది సామాజిక బాధ్యతను స్వీకరించేదాక ఈ బృందానికి పనిలోటేమీ ఉండదు!

 

        6.40 కి కాఫీ రసాస్వాదనం పిదప రోజూవారీ గ్రామ మెరుగుదల కృషి  సమీక్షా సమయంలో నేటి గ్రామ స్వచ్ఛ – సుందర సంకల్ప నినాదాల నందుకొన్నది ఈ నడుమ స్వచ్ఛ కృషికి రాజాలని ఉపాధ్యాయిని లంకే సుభాషిణి! అందుకు దీటుగా బదులిచ్చింది మిగిలిన కార్యకర్తలు! ఈ ప్రాంతపు పాఠశాలల విద్యార్ధులలో ఆంగ్ల – గణిత – శాస్త్ర అంశాల అవగాహనకై తాను చేస్తున్న కృషిని వివరించినది మండవ శేషగిరిరావు గారు. కార్యకర్తల నేటి కష్టాన్ని, తద్ద్వారా మెరుగైన వీధుల్ని గుర్తించినదీ, ఫొటోలు తీసుకొని వాట్సాప్ మాధ్యమంలో ప్రదర్శించినదీ, మెచ్చినదీ డాక్టరు దాసరి రామకృష్ణ ప్రసాదు గారు!

 

రేపటి వేకువ మనం కలిసి, శ్రమించి, ఆత్మానందం పొందదగినదీ బందరు దారిలోని సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధి మొదలు! (నేటి కార్యక్రమం ముగిసిన చోట.)

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 18

 

ఈ‌ బాటన నడవకుండ ఈ సొగసులు మెచ్చకుండ

వేభంగుల పుష్ప వర్ణ శోభల నాస్వాదించక

ఆగి – నిలిచి – చూసి చూసి అనుభూతిని అందుకొనక

పరవశాన మునగ కుండ భావుకులసలుండగలర?

      

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

19.03.2021.