2154* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!


స్వచ్చోద్యమ సుందర చల్లపల్లి నిర్మాతల 2154* వ నాటి ఉత్సాహం. 

అలవాటుపడిన – అచ్చివచ్చిన బ్రహ్మ ముహూర్తంలో ఈ (21.03.21) నాటి శ్రమదాన వీరులు 4.19 కే బందరు జాతీయ మార్గంలో నూతనా విష్కృత వస్త్ర దుకాణం (ట్విల్స్) దగ్గరకు చేరుకొన్నారు. ఈ ఆదివారపు శ్రమ సమీక్షా సమావేశం ముగిసే సరికి 7.00 దాటింది. 48 మంది (అందులో ముగ్గురు అతిధులు) చేసిన కాయకష్టం తూర్పు రామమందిరం మొదలు కళానర్సింగ్ హోమ్ పర్యంతం విస్తరించి ఇప్పుడీ సువిశాల రహదారి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాలు నయన మనోహరంగా కనిపిస్తున్నవి. గతంలో నెలల తరబడీ శ్రమించి, చేతి చమురు కూడ దండిగా వదలిన కార్యకర్తల కృషి ఫలితం ఇది! మన పెద్దలు “సత్యమేవ జయతే” అని సూక్తీకరించారు గాని, చల్లపల్లి స్వచ్చోద్యమ కారులు సుదీర్ఘకాలంగా “(నిస్వార్ధ) శ్రమయేవ పూజ్యతే” అని కొత్త సూక్తిని ఆచరణలో ఋజువు చేస్తున్నారు!

- తమ శ్రమదానం సఫలం చేసేందుకు వీరిలో కొందరు చీపుర్లు ధరించారు; పిచ్చి – ముళ్ళ మొక్కల మీద కత్తులతో దాడి చేశారు; నల్లని తారు బాట మీద అంటి, గట్టి పడిన దుమ్ము – ఇసుక మిశ్రమాలను వదలించడంలో గోకుడు పారల్ని ప్రయోగించారు ; రోడ్డు మార్జిన్ల గడ్డిని రైల్వే పారలతో చెక్కారు; కొందరేమో ఇన్ని వ్యర్ధాలను దంతెలతో లాగి గుట్టలు పెట్టారు; డిప్పలతో ఆ గుట్టల్ని ఎత్తి ట్రాక్టర్ లోకి, దుమ్ము – మట్టి – ఇసుకల గుట్టలైతే టాటా – ఏస్ చిన్న ట్రాక్కులోకి ఎత్తిందేమో నలుగురు!

- ఇక సుందరీకరణ విభాగం వారు సుదూరంగా సంత వీధిలో ఉన్న అందవిహీనతల పరిష్కారంలోనే ఐదవ నాడు కూడ గడిపారు! గ్రామ వీధుల సౌందర్యాలలో ఏలోపమున్నా వాళ్ల దృష్టిని దాటిపోదు మరి! (అదీ గాక – ఈ బృందంలో ఒకాయనైతే మరీ పర్ఫెక్షనిస్టు!) 

ఇలా గ్రామంలో పొంతనలేని రెండు ముఖ్య వీధుల్లో కశ్మలాల మీద, అందహీనత మీద పోరు ముగిసింది గాని, చెత్త కేంద్రానికి సదరు వ్యర్ధాల తరలింపు మాత్రం కుదరక రేపటికి వాయిదా పడింది. 

ఈ నాటి గ్రామ స్వచ్చోద్యమ కృషి సమీక్ష విషయానికొస్తే అది రోజుటి కన్న భిన్నంగాను, సుదీర్ఘంగాను, జీవన వేదసారంగాను జరిగింది. గంధం బృందావన ప్రకటిత “స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలతో మొదలై, గోపాళం శివన్నారాయణ ప్రవచిత ఆదర్శ మానవ జీవన సరళితోను, చెణుకులతోను ముగిసింది. సమాజంలోని “నందుల – పందుల” సిద్ధాంతంతో బాటు, ఈ విభిన్న వైద్యుడు చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు “వీధుల మురికితో బాటు మనుషుల ఆలోచనల మురికిని వదలగొట్టే విశ్లేషణ కూడ అందరూ ఆసక్తిగా విన్నారు.

ఇది “స్వచ్ఛ కార్యకర్తల సమావేశమా, స్వచ్ఛ డాక్టర్ల సమావేశమా?” అనుకొనేంతగా – ఆరుగురు వైద్యుల సంఖ్యాధిపత్యం కనిపించింది. చల్లపల్లి గ్రామ ప్రముఖ వైద్యురాలు సబ్బినేని రాజ్యలక్ష్మి గారు ఇలా రోడ్డు సభకు వచ్చి, కొన్నాళ్ళు గతంలో తాను కూడ శ్రమదానం, అర్ధదానం చేయడాన్ని గుర్తు తెచ్చుకొని, కార్యకర్తల్ని మెచ్చుకొని ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీకి లక్ష రూపాయల చెక్కును విరాళమిచ్చారు. గోపాళం కోమలి గారి 5 వేల విరాళం కూడ అందరూ చప్పట్లతో స్వాగతించారు. 

తదుపరి మంగళవారం (23.03.2021) నాటి వీధి పారిశుద్ధ్య ప్రయత్నం కోసం కళాశాల – స్టేట్ బ్యాంకుల చోట మనం మళ్ళీ కలుసుకొందాం! 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – (భక్తులకొక విన్నపం) - 20

పదేపదే ఇచట నడిచి పరమ తృప్తి పొందాలని 
తమ పెరడును, వీధి నిట్లు అందగించుకోవాలని... 
అనిపిస్తే – ప్రయత్నిస్తే స్వాగతించ వచ్చు గాని 
భక్తితొ పూలు కోయు పని మాత్రం చేయొద్దని.... 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్, 
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
21.03.2021.

 

సబ్బినేని రాజ్యలక్ష్మి గారు
గోపాళం కోమలి గారు