2156* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్చోద్యమ ప్రయాణంలో ఇది 2156* వ శుభోదయం.

 

ఇది మార్చి నెలాంతంలో బుధవారం. (24.03.21) ఎందరో మహానుభావుల్లో ఈనాడు గ్రామ వీధి పారిశుద్ధ్య/ సుందరీకరణ బాధ్యతలను మోసిన కార్యకర్తలు 30 మంది. ఇందుకు గాను ఎప్పుడు మేల్కొన్నారో గాని, 4.20 కే 20 మంది NH.16 (బందరు కేంద్ర రహదారి) మీద సంసిద్ధులైపోయారు. అమరావతి రాజభవన ప్రాంతమూ, దాని ఎదుట వైజయంత, గోకులమూ ఇందరు స్వచ్చోద్యమ కారులకు చేతినిండా – రెండవ నాడు కూడ – పని కల్పించాయి.

 

వీరిలో సుమారు సగం మందికి రహదారి దక్షిణ పూల వనంతోనే సరిపోయింది. అందులో క్రమరహితంగా పెరిగిన, ఎండిన -  ఎండని గడ్డి, ఆ పూల తోట అందాన్ని అడ్డుకొంటున్న పిచ్చి మొక్కలు, ఎప్పుడో పూడిన పాదులూ, ఎండు కొమ్మలు, వాటన్నిటికి తోడు కొన్ని ప్లాస్టిక్ సంచులు, కాగితాలు చాలవా – వంచిన నడుం ఎత్తకుండ గంటన్నరకు పైగా పని చేయించడానికి? ఇక అక్కడి మురుగు కాల్వను ముందుకు నడవనీయని ఖాళీ సారా, నీటి ప్లాస్టిక్ సీసాల, టిఫిన్ పొట్లాల, టీ – కాఫీ కప్పుల, సిల్టుల జోలికి – ఏ సంవత్సరానీకోమారో పంచాయతి యంత్రాలు తప్ప – ఇదుగో ఈ కార్యకర్తలు తప్ప ఎవరు పోగలరు? అక్కడ కరెంటు స్తంభాల, ట్రాన్స్ఫార్మర్ల మాటున చేరే కశ్మల దరిద్రాలను అసహ్యించుకొనే పట్టించుకొనే ధైర్యశాలులు కూడ – ఈ స్వచ్ఛ కార్యకర్తలు కాక మరెవ్వరు?/ వాట్సాప్ మాధ్యమ చిత్రంలో ఒక్క మారు వైజయంతం ప్రహరీ గోడ బారునా ఎంతెంత దుమ్ము – ధూళి – ఇసుక వాహనాల నుండి జారి పడి, బిగుసుకుపోయిందో గమనించండి! ఆరేడుగురు ఎన్ని డిప్పలకొద్దీ రద్దును పోగు చేసి, దాన్ని మరో నలుగురు పారలతో డిప్పలకెత్తి, టాటా ఏస్ వాహనంలో కెత్తి, అవసరమైన మరొక గ్రామ వీధిలో రోడ్ల భద్రతకై  సర్ది వచ్చారో ఊహించండి! ఈ కార్యకర్తల ఉద్యోగం ఒక నాటిదా? వేలాది దినాల నిరంతర మెరుగుదల కృషి!

 

వట్టి మాటలు కట్టిపెట్టి, గ్రామస్తుల ఆహ్లాదం కోసం అదే పనిగా శ్రమిస్తున్న సుందరరీకరణ బృందానికి ఈ పూట వైజయంతం పొడవునా శుభ్ర - సుందరీకరణంతోనే సరిపోయినట్లున్నది. వాహనాల దుమ్ము పేరుకొని, గతంలో వీరు నెలల తరబడి చెక్కిన ఆ ప్రాచీన కుఢ్య చిత్రాలు కాస్త కళ తప్పినా, ఆ ఏడెనిమిది మంది శ్రమకూ – అందుమూలంగా వచ్చిన ఫలితానికీ లోటేమీ జరుగలేదు! (అక్కడికీ ఒకామె మనసు ఊరుకోక ఆ దుమ్మును దులిపే పనిలో కనిపించింది!) కోట గోడ లాంటి ఆ ప్రహరీలో దూరి, మొలిచి, ఊర్ధ్వ ముఖంగా పెరిగి పుష్పించిన పచ్చని బిళ్ళ గన్నేరు చెట్టు ప్రకృతి వైచిత్రి కాబోలు! సుందరీకర్తల కృషికి ప్రకృతి సహకారం కాబోలు!

 

ఏ రోజు ఈ స్వచ్చంద శ్రమదానాన్ని పరిశీలించినా నాకొకటే అనిపిస్తుంది. – “ప్రభుత్వాలు ఎన్ని వేలు, లక్షలు ధారపోసినా ఇంతటి విశాలభావం. అంకితతత్త్వం, దీక్ష ఉన్న కార్యకర్తలు దొరుకుతారా? ఇన్ని వేల దినాలు- ఇన్ని లక్షల పని గంటలు నిస్వార్ధంగా సమయ శ్రమదానాలు – చల్లపల్లిలో కాక – ఇంకెక్కడైనా చూడగలమా?”... అని! (దీం దుంపతెగ – ఉన్న ఊరి కోసం ఔదార్యం, శ్రమతత్త్వం, మంచికోసం ఐకమత్యం... ఈ ఒక్క ఊళ్లోనే పోగుబడి, చిక్కబడకపోతే – కనీసం 13 జిల్లాల్లో 13 వేల గ్రామాలను కూడ స్పృశించి రావొచ్చు గదా!)

 

మన స్వచ్ఛ – డాక్టరు (DRK) గారేంటి – ఎవరు మన స్వచ్చంద శ్రమదాతల్ని, వారి చర్యల కారణంగా చూడముచ్చటైన ఈ సువిశాల – శుభ్ర – సుందర రహదారిని చూసినా, ఇలాగే స్పందిస్తారు, ఇంతగానే మెచ్చుకుంటారు, సమీక్షిస్తారు! గతంలో వార్డు మెంబరుగా ఉండి, పాలక వర్గం తరపున మొట్టమొదటగా వీధి పారిశుద్ధ్యంలో పాల్గొని, ఒరవడి దిద్దిన పసుపులేటి ధనలక్ష్మి గారు తడబడకుండ ముమ్మారు నినదించిన గ్రామ శుభ్ర – సుందరీకరణ సంకల్పాన్ని కార్యకర్తలంతా ముక్తకంఠాలతో బలపరిచి, 6.35 కు నేటి శ్రమదాన పర్వం ముగిసింది.

 

నేటి తరువాయిగా మునసబు వీధి నుండి మరికొన్ని మంచి పనులు మనను రేపు వేకువ  4.30 కు ఈ వీధిలోనే కలిసి నిర్వహించేందుకు ఆహ్వానిస్తున్నాయి!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర - 22

 

వివేక రహిత - వినాశకర – విశృంఖల పనుల చోట

సుమనోహర – సుమసుందర – సుశ్యామల పూల తోట!

దేనికి ఇది సూచక మట? దేనికి ఇది చోదక మట?

ఒక వినూత్న పోకడకా? ఒక సమష్టి బాధ్యతకా?

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

24.03.2021.