2159* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వగ్రామ హిత శ్రమదానంలో  2159* వ రోజు విశేషాలు.

 

ఈ శనివారం(27.03.2021) నాటి స్వచ్చ సుందరోద్యమం కూడ N.H.16- బందరు జాతీయ మార్గంలోని రిజిస్ట్రారు కార్యాలయ ప్రాంతమే. ప్రారంభ శుభ సమయం 4.23, ముగింపు 6.15. నిన్నటి కన్న కార్యకర్తల సంఖ్య కొంచెం పెరిగి 32 గా ఉన్నది. నాలుగైదు నాళ్లలో కాలుష్యం మచ్చ లేనట్లు శుభ్ర పరుద్దామను కొన్నారు గాని, అది కాస్తా 10 దినాలు పట్టి, నేటితో ముగిసినట్లే. 

కశ్మలాల మీద, అందవిహీనతల మీద ఈ స్వచ్చ సైనికులు సుదీర్ఘ కాలంగా చేస్తున్నట్లే నేడు సైతం వీర విహారం చేశారు. వాట్సాప్ లో  కనిపిస్తున్న శుభ్ర-సుందరీకృత మునసబు వీధిని తొలుత గమనించండి- డ్రైను ను కూడ పరిశీలించండి. ఈ స్వచ్చత- మనోజ్ఞత నలుగురైదుగురు మొత్తం 10 గంటల పైగా శ్రమించి, చెమట చిందించిన దాని ఫలితం మరి! చూస్తున్న వాళ్ళకే ఇంతగా మనసు నిండిపోతుంటే-నిస్వార్థంగా ఆ స్వచ్చ-శుభ్రతలు సాధించిన వాళ్లకింకెంత ఆత్మ సంతృప్తి మిగులుతుందో కనిపెట్టండి!

బాధ్యతా రహితులైన కొందరు గ్రామస్తులేమో రహదార్ల మీద, మురుగు కాల్వలలోన చెత్త నింపడమే తమ జన్మ హక్కును కొంటారు. ఇదే గ్రామంలో ఒక వందమంది బాధ్యతా చైతన్య శీలురేమో- రోడ్లేమిటి, డ్రైను లేమిటి, ఎక్కడెక్కడి అశుద్ధాలనూ తొలగించేదే తమ అదృష్టమను కొంటారు! ఇవాలిటి ఏడెనిమిది మంది గ్రామ కర్తవ్య పరాయణులు ఈ వేకువ- ఈ బందరు మార్గంలో అలాంటి అదృష్టం చేజిక్కించుకొన్నారు-దారికి రెండు ప్రక్కల మార్జిన్ల వ్యర్థాలు, పచ్చి-ఎండు గడ్డి, ఎందుకూ కొరగాని మొక్కలు, మురుగు కాల్వల్లోని సీసాలు, ప్లాస్టిక్ సంచులు-ఏవీ వీళ్ల నుండి తప్పించుకోలేదు!

 

మూల్పూరి ఉద్యానవనం నుండి, అన్ని కార్యాలయాల, విద్యాలయాల, వైద్యాలయాల, దుకాణాల, టీ-టిఫిన్ సెంటర్ల, కొబ్బరి బొండాల, తిను బండారాల సంచార తోపుడు బళ్ల రకరకాల పనికి మాలిన చెత్తలన్నీ ఏడెనిమిది మంది చీపుళ్ళ ఊడ్పులతో 6.30 తరువాత మళ్ళీ మళ్ళీ చూడదగినంతగా శుభ్ర పడ్డాయి! ఈ స్వచ్చ-శుభ్రతల ఉధృతి శ్రావ్య ఆసుపత్రి దాక విస్తరించింది!

 

ఈ వరుసలోనే ఒకటి రెండు వింత గొలిపే  శ్రమదాన విన్యాసాలను కూడ గమనించాను.

- ఒక సీనియర్ వైద్యురాలు చెత్త బండి మీద కెక్కి, క్రిందవారు అందిస్తున్న దుమ్మును, చెత్తను పట్టుకొని, ట్రక్కులో సర్దుతున్న వైనం.

- అది బద్ధకమో లేక సాహసమో గాని- ఒక స్వచ్చ వీరుడు ట్రక్కు దగ్గరికి వెళ్లకుండ- ఏడెనిమిదడుగుల దవ్వు నుంచే  చెత్త  బుట్టను వాహనం మీదికి విసరుతున్న ఒకానొక భిన్నత్వం.

- తాము కాస్త కురచ కావడంతో- అందని ఎత్తైన కరెంటు స్తంభాల మీద అంటించిన ప్రకటన కాగితాలను తడిపి, కొడవళ్ళతో గోకి, ఆ స్తంభాలను ఇద్దరు మహిళలు అంద ప్రపూర్ణంగా మార్చడం....

 

ఇలా ఒకటేమిటి-సానుకూల పరిశీలనా దృష్టి ఉంటే, కాస్త వర్ణనాసక్తే ఉంటే- ఈ చల్లపల్లి స్వచ్చోద్యమంలో ప్రతి దినమూ ఎన్నో వింతలు కనిపిస్తూనే ఉంటాయి! వేల దినాలుగా చెమటలు క్రక్కుతూ కార్యకర్తలిలా చేస్తూ పోతారు-గ్రామస్తుల్లో కొందరు తమ వంతుగా వీధుల్ని మలిన పరుస్తూనే ఉంటారు. (నా వంటి వాడు సదరు చర్యల్ని ఇలా నమోదు చేస్తూ ఉంటాడు!)

 ఈనాటి ముప్పై ఇద్దరి శ్రమతో వచ్చిన ముఖ్య వీధి పరిశుభ్రతని మనసారా మెచ్చుకొని, డాక్టరు డి.ఆర్.కె. గారు రేపటి మన గ్రామ విధి నిర్వహణ ప్రదేశం, కలుసుకోవలసిన చోటు స్టేట్ బ్యాంకు ఎదుటే అని ప్రకటించారు. డెబ్భై నాలుగో, డెబ్భై ఐదో ఏళ్ల విశ్రాంత హిందీ ఉపాధ్యాయుడు ఉదయ శంకర శాస్త్రి ప్రవచిత-త్రిగుణాత్మక స్వచ్చ-శుభ్ర-సౌందర్య నినాదాలతో నేటి మన కృషి రేపటికి వాయిదా పడింది!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 25

 

కధల రీతి సినిమా వలె కాల్పనికం కాదే ఇది

దేవతలవొ ఋషి వరులవొ దీవనలతొ రాలేదిది

శ్రమనె నమ్మి, చెమట చిందు స్వచ్చోద్యమ బాధ్యులచే

ప్రాప్తించిన నందనమిది సర్వోత్తమ రహదారిది!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

27.03.2021.