2158* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

 

స్వచ్ఛ చల్లపల్లి స్వగ్రామ నిర్మాతల 2158* వ నాటి శ్రమ సౌందర్యం.

 

మార్చి నెల 26 (శుక్రవారం) వ రోజు వేకువ 4.17 సమయంలో బందరు రోడ్డులో మునసబు వీధి వద్ద సంఘటితులైన 30 మంది గ్రామ మెరుగుదల కృషీవలురు 6.15 దాక తమ ప్రయత్నాలను కొనసాగించారు. కొన్ని ఇతర పనులు - ప్రధానంగా వీధి మలుపు, కర్మల భవనం, మూల్పూరి ఉద్యానం తమ అంచనా మేరకు పూర్తిగా శుభ్రపరచగలిగారు!

 

స్వచ్ఛ కార్యకర్తలెలాగూ గ్రామ పారిశుద్ధ్య కృషికీ, తన్మూలంగా గ్రామస్తుల ఆహ్లాదానికీ, తద్ద్వారా గ్రామస్తుల స్వస్తతకూ అంకితులైపోయారు. మరి ఊరి జనం మాటలేమిటి? ఇన్ని వేల మంది ఉమ్మడి ప్రయోజనం కోసం వాళ్ళ ప్రమేయమేమిటి? కొందరి నిర్లక్ష్యం, నిర్లిప్తత చూస్తుంటే – “ఏడేళ్ళ స్వచ్చోద్యమం జరుగుతున్నది ఈ ఊళ్ళోనేనా? ఇన్ని వేల దినాల ప్రయత్నం తర్వాత గ్రామస్తుల స్వచ్ఛ స్పృహ కధ మళ్ళీ మొదటి కొస్తున్నదా? ...” అనిపిస్తున్నది.

 

ఈ వేకువ 4.30 కాకముందే – కార్యకర్తలు 3 రోజులుగా స్వచ్ఛ – సుందరీకరిస్తున్న చోటేఒక అనర్ధం జరిగింది. ఈ గ్రామస్తులే తమకొక బస్సు మాట్లాడుకొని ఎన్ని రోజులు - ఎన్నెన్ని తీర్ధయాత్రలో చేసి, ఎంతెంతో పుణ్యం మూటకట్టుకొని వచ్చి, తమ ఇన్నాళ్ళ వినియోగ వ్యర్ధాలను – ప్లాస్టిక్ సీసాల వంటివి నడి రోడ్డుపై దిమ్మరించడం వారి ఏ బాధ్యతకు సూచన? ఈ వెర్రి కార్యకర్తలెంతకాలమైనా తమ బాధ్యతగా ఇలానే చేస్తూనే ఉంటే – శుభ్రమైన ఈ రహదారి మీద వ్యర్ధాలను మనం విసరివచ్చు” అనే బాధ్యతారాహిత్యమనుకోవాలి. (ఐతే  స్వచ్ఛ కార్యకర్తలు వాళ్లను వెంబడించి, అడ్డగించి, ఆ వ్యర్ధాలను వాళ్ళకే అప్పగించి, కాస్తంత సామాజిక బాధ్యతను కూడా వివరించి వచ్చారు!)

అసలు ఏ కాస్త అవగాహన, బాధ్యత ఉన్నా నిన్న ఎంతగానో శ్రమించి, శుభ్రపరచిన ట్రాన్స్ఫార్మర్ల్ దగ్గర తెల్లవారే సరికే, ఇన్ని వ్యర్ధాలు పోగుబడతాయా?

 

మరొక వింత చూడండి : ఇన్ని నేపధ్యాల - ఇందరు కార్యకర్తలు – సకుటుంబంగా గ్రామ సర్పంచితో సహా – ప్రతి రోజూ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాలను గూర్చి మధన పడతారు, వేల కొద్దీ మొక్కలు నాటి పెంచుతారు. తమ శ్రమను, కాలాన్నీ, డబ్బునూ వెచ్చించి కంటికి రెప్పలా ఊరిని కనిపెడుతుంటారు. బాధ్యత పట్టని కొందరు గ్రామస్తులేమో ఒడ్డున నిలబడి తాము ఆచరించని సలహాలిస్తారు, మళ్ళీ అందులో కొందరు డ్రైన్లలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, పాత్రలు, సీసాలు కూడ విసరుతారు – ఏ హక్కైనా మాదే, ఏ బాధ్యత మాది కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. మరి ఈ ఆలోచనలు ఎప్పుడు తిరగబడి, పరిస్థితులెలా మారి, గ్రామాలు ఎంత కాలానికి బాగుపడతాయో!

 

ఈ దిక్కుమాలిన అలవాట్లకీ, అనాలోచిత ప్రవర్తనలకీ చెక్కు చెదరని మనోబల సంపన్నులైన స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం యధాప్రకారం నెరవేర్చిన నేటి బాధ్యతలిలా ఉన్నవి :

 

- 1 వ వార్డు ముఖ ద్వారంలో అంగుళం మందాన పేరుకుపోయిన దుమ్ము – ధూళి – ఇసుకలను ఒంటి చేత్తో ఒక మహిళా సర్పంచి/ కార్యకర్త ఊడ్చి గుట్టలు చేసి, ట్రాక్టర్ లోకి మోయడం.

 

- మూల్పూరి రహదారి వనమే ఈ దినం 12 మంది కార్యకర్తలకు గట్టి సవాలు విసిరింది. కత్తులు, దంతెలు, పారలు, డిప్పలు వంటి ఆయుధాలన్నీ గంటన్నరకు పైగా ఆక్కరకు వచ్చి, సుమారొక చిన్న ట్రక్కు వ్యర్ధాలు బైటకు లాగి డంపింగ్ కేంద్రానికి తరలిపోయినవి.

 

- ముగ్గురు మహిళలు నిన్నటి చోటు నుండి జూనియర్ కళాశాల దాక ఊడ్చి, శుభ్రపరిచారు.

 

- సగం సమయం తమ సుందరీకరణలో గడిపిన సుందరీకర్తలు మిగతాకాలం ట్రక్కుల్లోకి వ్యర్ధాలను ఎగుమతి చేస్తూ గడిపారు.

 

- గత ఎన్నికల కాలపు అభ్యర్ధుల ప్రకటన కాగితాలను తడిపి, గోకి, ఊడదీసి, ఇద్దరు మహిళలు గోడల్ని, కరెంటు స్తంభాలనీ కశ్మల విముక్తం చేశారు.

 

- వాహన ప్రమాదంతో చనిపోయిన కుక్కను ఒకరిద్దరు కార్యకర్తలు బందరు రహదారి నుండి తరలించారు.       

        6.30 కి మన ఊరి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాల పూనికను ముమ్మారు నినదించిన దేసు మాధురికి గ్రామస్తులు ఎప్పటికి తగురీతిలో బదులిస్తారో చూడాలి.

 

        రేపటి మన ఆచరణ ఇదే బందరు మార్గంలో – ఇదే చోట ఉండగలదు.

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 24

 

ఈ మార్గం స్వచ్ఛతకై – ఏడెనిమిది ఏళ్ల క్రితం

తపించారు – శ్రమించారు దార్శనికులు అహర్నిశం

ఇప్పుడదే బాట మీద ఏ వందలొ, వేల మంది

 

నల్లూరి రామారావురిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

26.03.2021.