2160* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

కన్న తల్లి వంటి స్వగ్రామ స్వస్తత కోసం 33 మంది శ్రమదానం @ 2160*.

 

అలుపూ సొలుపూ పట్టని స్వచ్చోద్యమ శ్రమదాతలు ఆదివారం (28.03.2021) నాటి బ్రహ్మ కాలంలో (4.21 నుండి 6.15 దాక) బందరు రహదారిలో రాజ్యద్రవ్యనిధి (SBI)  ఎదుటి వెలుగులో ఆగి, 150 గజాల మేర శ్రమించి, సంతరించిన స్వచ్ఛ శుభ్ర సౌందర్యాలను సావధానంగా గమనించే గ్రామస్తులకు ఆహ్వానం! చూసి, ఊరికే వావ్! ఆహా! ఓహో!అనే మెప్పులకంటే అనుకరిస్తే, అనుసరిస్తే, ఆచరిస్తే నే ఏదైనా స్వాగతార్హం! (నేటి కార్యకర్తల 2 గంటల నిస్వార్ధకృషిని – 6 వ నెంబరు కాలువ వంతెన గట్ల మీద కూర్చొనీ, టీ బడ్డీల ఎదుట నిల్చొనీ, కళాశాలలో నడక కోసం వచ్చి పోతూనే, వాహనదారులైతే ఒక్కో చూపు వదిలేస్తూనూ ఈ ధర్మ కర్మిష్టుల్ని మెచ్చుకోవడం మామూలే!)

 

మరొక అంశమేమంటే ఈ పావు కిలోమీటరు దూరం బాధ్యత గల దుకాణదారులు చందా వేసుకుని, ఉద్యోగిని నియమించి పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రమో, నేటి వేకువనో ఎవరు చూసినా అరె! ఈ రోడ్డు ఇంత బాగుందే!అనుకోవాలసిందే. ఐతే ఈ సూర్యోదయం తరువాత మాత్రం ఇంత అందంగానా? మరీ ఇంత స్వచ్ఛ శుభ్రంగానా...అనుకోక తప్పదు. స్వచ్ఛ కార్యకర్తల చూపుపడ్డాక పూనుకొన్నాక అందులోనూ సుందరీకరణం ముఠా పనిలో దిగాక గ్రామం లో ఏ భాగమైనా ఇలానే ఉంటుంది మరి!

 

గత నాలుగు రోజులుగా పరిశీలనగా చూస్తున్నాను కళాశాల ప్రవేశ ద్వారం రెండు వైపుల స్వచ్ఛ కార్యకర్తలే నారుపోసి, నీరుపోసి సాకిన ఉద్యానవనం శుభ్రంగా ఆహ్లాదకరంగా ఉన్నది. ఐనా ఏడెనిమిది మంది కార్యకర్తలకు మాత్రం అది రుచించక ఈ వేకువ వాటిలోని ఎండుటాకులు, పుల్లలు ఊడ్చి, ఏరి, కొన్ని పాదుల్ని కొంత సవరించి, ప్రక్కనున్న ఊరి సగం మురుగు పారే కాల్వలోని ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ సంచులు, కాగితాలు లాగితేనే వాళ్ళకు మనః తృప్తి! కళాశాల విద్యార్ధులు, ఉద్యోగులు, యాజమాన్యం, నడకల వాళ్ళందరికీ చూడచక్కగా ఉన్నా సరే ఈ రహదారి వనాలను మరింత కళకళలాడిస్తేనే కార్యకర్తల సంపూర్ణ సంతృప్తి.

 

పంట కాలువ ఉత్తర పడమర ఇటీవలే వెలసిన చిన్న రహదారి వనం దగ్గరైతే 5.30 - 6.10 నడుమ అద్భుత శ్రమదాన సందడే! అత్యంత నిపుణుడు, అనుభవజ్ఞుడూ ఐన శస్త్ర చికిత్సకారుడు చెత్త ట్రాక్టరెక్కి నడపడం, ఇంచుమించు అంతే నిపుణురాలైన డాక్టరమ్మ పలుగుతో పనిచేస్తూ చెత్త డిప్పల్ని మోసి, ట్రాక్టర్లో నింపడం, పన్నెండేళ్ళ క్రితం రిటైరైన ఒక ప్రిన్సిపాలుడు వంగి, పారతో మట్టి పని చేయడం, ఇద్దరు మహిళలు అదేదో తమ ఇల్లే అన్నంతగా స్టేటు బ్యాంకు ముందు పట్టి పట్టి ఊడ్చి, శుభ్రపరచడం ఇవన్నీ చాల మార్లు చూసే దృశ్యాలే! కాని ఈ పని పాట్లు చూసి మెచ్చడం తప్ప వందల మందిలో కనీసం ఐదారుగురైనా ఆచరణకు పూనుకోకపోవడం మాత్రం కొంత అవాంఛనీయ సందర్భమే!

 

ఇందరు గ్రామ మెరుగుదల నిబద్ధులూ 6.20 కి కాఫీలు ముగించి, ఉడత్తు రామారావు గారి బిస్కట్ పొట్లాలు స్వీకరించి, అదే పేరు గల మరొకరి నుంచి కరివేపాకును దక్కించుకొని, కళాశాల ఎదుట సమావేశమై, ఉడత్తు వారి స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను మూడు మార్లు అంది పుచ్చుకొని, స్వచ్ఛ డాక్టరు గారి నేటి కృషి సమీక్షను విని, మరింత ధృఢ సంకల్పులై గృహోన్ముఖులయ్యారు. అమెరికా అట్లాంటా నివాసి, మండవ శేషగిరిరావు గారు ఇక్కడి విద్యార్ధుల కోసం పడుతున్న శ్రమ, చేస్తున్న ఖర్చు, చల్లపల్లి ముఖ్య వీధి దత్తతల విషయంలో తాతినేని రమణ గారితో కలిసి పడుతున్న ప్రయాసలు, పోలీసు బజారు వారు ఇందుకు కలిసి వచ్చే అవకాసమో కూడ కార్యకర్తలకు తెలిసివచ్చాయి. వీరి శ్రమ అక్కరకు వచ్చి, ఊళ్ళో ఇంతకు ముందున్న గంగులపాలెం, కమ్యూనిస్ట్ వీధులు కాక మరో నాలుగైదు కూడ భూగర్భ మురుగు వ్యవస్థతోను, రంగురాళ్ళ హంగులతోను, హరిత వృక్ష సుమ సౌందరర్యాలతోను కనువిందు చేస్తే చల్లపల్లిలో మహదానంద ఆరోగ్య సౌభాగ్యాలు దినదిన ప్రవృద్ధ మానమౌతుంటే స్వచ్చోద్యమం సార్ధకమైనట్లే గదా!       

 

బుధవారం మార్చి మాసాంతపు వీధి శుభ్రతలకై మనం కలుసుకోవలసిన స్ధలం – 1 వ వార్డు బైపాస్ బాటలోని ప్రభుత్వ బాలికల వసతి గృహ ముందరి భాగమే.                   

 

మంచి చెడ్డల భేదమొక్కటె.

 

ఎవరి బాధ్యత ఎవరు మరిచిరి? ఎవరి అభిరుచులెవరు వదలిరి?

వేల దినముల ఊరి బాధ్యత స్వచ్ఛ సైన్యం వదలుకొందా?

ఊరి మనుషులలోని కొందరు వీధి కశ్మల మాపివేసిర?

ఉభయులూ కర్తవ్య నిష్టులె భేదములు మరి మంచి చెడ్డలె! 

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

28.03.2021.