2161* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వగ్రామ మెరుగుదలే ధ్యేయంగా 2161* వ నాటి కార్యకర్తల శ్రమ.

 

          పాతకాలపు “చందమామ” మాస పత్రికలో – “అలుపెరగని, పట్టు వదలని” విక్రమార్కుడు ప్రతి రోజూ చెట్టు మీద నుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని నడిచినట్లే ఉన్నది - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల విసుగులేని శ్రమదానం! శవంలోని భేతాళుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆ పాత కల్పిత కధ! కాలుష్యాల నుండి, వీధుల ఆక్రమణ నుండి, అస్వస్తతల నుండి, అసౌకర్యాల నుండి తమ ఊరిని రక్షించుకొని మన సోదర గ్రామస్తులకు ఆహ్లాదాన్ని, సౌకర్యాన్ని, ఆనందాన్ని కలిగించే 2161* దినాల నిర్విరామ ప్రయత్నాల యధార్ధకధే ఈ స్వచ్ఛ సైనికులది. అందుకని, కార్యకర్తలు 1 వ వార్డులోని బాలికల వసతి గృహం మలుపు వద్ద 4.20 కే చేరుకొని, రెండు వైపులకూ విస్తరించిన శ్రమదానంతో ఇటు బందరు మార్గం నుండి అటు వడ్లమర వీధి దాక, కొసరుగా శ్మశానం బాటలో కొంత దాక కూడ – చల్లని వేళలో సైతం చెమట చిందిస్తూ శుభ్రపరిచారు! అట్టి నేటి ధన్యులు 30 మంది!

 

          స్వాతంత్ర్య పోరాట కాలపు క్రితపు తరం వారి స్ఫూర్తి ఏమైపోయిందో తెలియదు; గాంధీజీ, పింగళి వెంకయ్యల దేశభక్తి ఎలా మాయమైపోయిందో చెప్పలేం! ఇప్పుడు సమాజంలో అత్యధికుల్లో కనీస అవగాహనారాహిత్యం, స్వార్ధం, అసహనం, అహం పెరిగిపోతున్నాయి. లేదంటే – 25 – 30 వేలమంది గ్రామస్తుల్లో ఊరి మేలుకు ఉచిత శ్రమదాతలు కేవలం 30 మందా? గురజాడ కవి చెప్పినట్లు – మంది మేలుకు కాక, సొంత లాభం కోసం మాత్రమే ఆలోచిస్తారా? (జాతీయ – దేశభక్తి కోసం సంకేతమైన మువ్వన్నెల జెండాను 100 ఏళ్ళు నాడు ఆవిష్కరించిన శుభదినమిది)

 

తమ కృషితో గ్రామస్తులు కలిసి వస్తే సంతోషిస్తూ, కలిసిరానపుడు విచారించక, ముందుకుపోతున్న స్వచ్చంద కార్యకర్తల నేటి ప్రయత్న ఫలితాలు :

 

- ఈ నడుమ కొద్ది నెలలుగా శ్రమదానం జరుగక మురికి, దుమ్ము, చెత్త, పిచ్చిమొక్కలు పెరిగిపోయిన ఈ బైపాస్ మార్గంలో – బందరు రహదారి నుండి – బాలికల వసతి గృహం దాక అన్ని కశ్మలాలు తొలగిపోయి, మరోమారు చూడదగినదిగా మారడానికి 10 మంది కార్యకర్తలు పాటుపడ్డారు. కాని – సర్పంచ్, ఆమె పెనిమిటి తప్ప, ఒకే ఒక స్థానిక మహిళ తప్ప ఎవరు కలిసి వచ్చారు గనుక?

 

- వసతి గృహం పడమటి మురుగు కాల్వ వ్యర్ధాలను, రోడ్డు రెండు ప్రక్కల పిచ్చి మొక్కల్ని, ప్లాస్టిక్ సంచుల్ని, కప్పుల్ని, రకరకాల సీసాలను ఏడెనిమిది మంది నరికి, ఏరి – ఊడ్చి జమ్మిలంకమ్మ గుడి దాక శుభ్రపరుస్తున్నా వసతి గృహం నుండి ఒక్కరూ పాల్గొనలేదు.

 

- అక్కడికి పడమరగా బైపాస్ బాటను అన్ని విధాలా స్వచ్ఛ – సుందరంగా ఏడెనిమిది మంది తీర్చిదిద్దుతున్నా – పాతవారికి తప్ప – స్థానికులకు – ఎవరికీ పట్టలేదు. “భిక్షు వర్షీయసి” అనే మహా ప్రస్థాన గీతంలో

 

          “ఒక ఈగను పడవేసుక తొందరగా తొలగె తొండ...”

అని శ్రీశ్రీ చెప్పినట్లు తమకోసం, ఊరి బాగు కోసం కార్యకర్తలు తమ ఇళ్ల ముందరే పాటుబడుతున్నా స్థానికుల్లో ఎవరి హడావుడీ వాళ్ళదే!

 

          ఇద్దరు డ్రైవర్లూ, ముగ్గురు డిప్పల కార్యకర్తలూ నానావిధ వీధి వ్యర్ధాలను ట్రక్కుల్లో నింపి, డంపింగ్ కేంద్రానికి తోలడంతో సరిపోయింది!

 

నేడిక్కడ శ్రమిస్తున్న కార్యకర్తల మనసులు 6 ½ ఏళ్ళ క్రితం ఈ చోటంతా చిట్టడివిగానూ, బాహ్య మలమూత్ర విసర్జన కేంద్రం గానూ, ముక్కు మూసుకోక ఎవరూ భరించలేని నరకంగానూ ఉన్న చరిత్రనూ, తామెంతగా శ్రమిస్తే అదంతా ఇంత శుభ్రపడిన ఘట్టాలనూ గుర్తు తెచ్చుకున్నాయి. అందుకే మనం సదా

 

          “శ్రమయేవ పూజ్యతే” అనే క్రొత్త సామెతను గుర్తుంచుకోవాలి!

 

          మోపిదేవికి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, వర్మ మాష్టరు గారు తమ తండ్రి విశ్వనాథపల్లి వేంకటేశ్వర్లు గారి గౌరవార్ధం స్వచ్ఛ సుందర చల్లపల్లి నిర్మాణ నిమిత్తం నెలకు 1000/- చొప్పున వెరసి 12000/- రూపాయలు ట్రస్టు అకౌంట్ కు జమచేశారు. (గతంలో కూడా ఈ సామాజిక బాధ్యుడు మొత్తం మీద 55,000/- విరాళంగా చెల్లించారు. ఇప్పటివరకు ఇచ్చిన విరాళం మొత్తం 67,000/-)

 

          మొన్న 28.03.2021 వ తేదీ నాగాయతిప్ప కు చెందిన వేములపల్లి విజయరాం ప్రసాదు గారు మన స్వచ్చోద్యమ చల్లపల్లి కి లక్ష రూపాయల భూరి విరాళం ఇచ్చిన విషయం కూడా ప్రశంసనీయం.    

 

6.30 సమయంలో డి.ఆర్.కె. గారు నేటి శ్రమదాన విశిష్టతను విశ్లేషించే ముందు 83 ఏళ్ళ వృద్ధ సింహం (మాలెంపాటి గోపాలకృష్ణయ్య) ముమ్మార్లు గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను గర్జించింది!

 

          మన రేపటి తరువాయి శ్రమదాన వైభవం కూడ ఈ బైపాస్ మార్గంలోనే అని గమనిక!

 

ఈ‌ గుప్పెడు మంది చాలు!

 

ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి కేమిలోటు జరిగిందని!

శతాబ్దాల కాలుష్యపు శని తలపై కూర్చున్నా

సగం మంది కాదు – ఒక్క శాతం పాల్గొనకున్నా

గుప్పెడు మంది త్యాగాల తొ గొప్పగ రాణిస్తున్నది!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

31.03.2021.