2162* వ రోజు ....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2162* రోజుల కాలపరీక్షకు తట్టుకొని గెలిచిన చల్లపల్లి శ్రమదానం.

 

         నేటి వేకువ కూడ యధావిధిగా 4.23 & 6.12 కాలాల నడుమ వర్ధిల్లిన (17+17) మొత్తం 34 మంది శ్రమదాన వేడుక కార్యకర్తలకు సంతృప్తి నిచ్చింది గాని, ఆ 1 వ వార్డు వారి  - ముఖ్యంగా రోడ్డు ప్రక్క ఇళ్ల వారిలోనైనా తగిన చైతన్యం తేలికపోయింది. ఆ రోడ్డు సాగర్ టాకీస్ బైపాస్ రోడ్డు ఆ ప్రాంతం గ్రామ సర్పంచ్ గారి 1  వ వార్డులో బాలికల వసతి గృహ పరిసరం – అంటే కాస్త అటూ ఇటూగా నిన్నటి కార్యకర్తల సంసేవిత ప్రదేశమే! పేరు ప్రఖ్యాతలున్న డాక్టర్లు పాల్గొన్న, గ్రామ ప్రధమ మహిళ సకుటుంబంగా చీపురో, గొర్రో, పారో పట్టి వీధి పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నా అక్కడి స్థానికుల్లో కదలికరాకపోతున్నదంటే ఈ గ్రామ పౌర సమాజాన్ని గూర్చి తీవ్రంగా ఆలోచించాల్సిందే!

 

         వసతి గృహం ముందరి రహదారి వనంలో పుల్లలు, ఆకులు, ప్లాస్టిక్ తుక్కులు ఖాళీ సీసాలు వంటివి ఏరి, ఊడ్చి, పూల మొక్కలను ట్రిమ్ చేసి, ఆ పోగుల్ని ముళ్ళ కొమ్మలతో సహా డిప్పలకెత్తి ట్రాక్టర్ లోకి, తదుపరి సుదూరాన ఉన్న చెత్త కేంద్రానికి చేర్చడం 10 మంది కార్యకర్తల వంతయింది.

 

         తామే నాటి, బాట ప్రక్కన పెంచిన చెట్ల కొమ్మలు కరెంటు తీగల కంటకూడా కత్తిరించి, మిగిలిన వాటిని అందంగా కనిపించేలా కత్తిరించి, ఇతర వ్యర్ధాలతో బాటు ట్రాక్టర్ లోకి ఎత్తే బాధ్యత సుందరీకర్తలిది. వాళ్ళ చూపు పడినంత మేర “ఈ బాట ఇంత విశాలంగా, శుభ్రంగా, అందంగా ఉందా?” అనిపించడం ఎప్పుడూ జరిగే పనే!

 

బాలికల ప్రత్యేక గృహానికి మిగిలిన రెండు ప్రక్కల్లోని మురుగు కాలువ వ్యర్ధాలను తొలగించడం, ఆ పనిలో బట్టల్నిండా మురికి – మురుగు అంటించుకోవడం, మురుగు కాలువలోని నిలిచిన మురుగులో చలనం తెచ్చి సంతోషించడం మరి కొందరి ఈ నాటి కృషి! కాలువ గట్ల మీద మొలిచి పెరిగిన ముళ్ళ – పిచ్చి మొక్కల్ని మాత్రం ఈ స్వచ్ఛ కార్యకర్తలు కాక, పంచాయితి వారు గాని, స్థానిక జనం గాని పట్టించుకొన్నారా?

 

         రాష్ట్రం మొత్తంలో – కనీసం ఈ చల్లపల్లి గ్రామంలో వేకువ 4.00 కాకముందే లేచి, 4.30 కన్న ముందే ఏ వీధిలో ఏ కాలుష్యముందో కనిపెట్టి, సకల పరికర సమాయత్తులై అక్కడికి చేరుకొని, చీపుళ్లతో ఊడ్చి, బాటల పై గుంటలుంటే పూడ్చి, ప్రమాదకర కశ్మలాలను తొలగించి, మురుగును ముందుకు కదల్చి, సర్వకాల సర్వావస్థలందూ ఊరి ఆనంద – ఆరోగ్య సంక్షేమాలనే చర్చించి  – అందుకోసం ఏ పనికైనా వెనుకాడని – మహిళలతో సహా 30 – 40 మంది శ్రమ త్యాగధనులుండడమెంత గొప్ప సంగతి! అదేమిటో గాని – ఈ దినదిన, క్షణక్షణ గ్రామ మెరుగుదల దీక్షాదక్షుల్ని, వాళ్ళ ఊరి ఉమ్మడి ప్రజాక్షేమకర నిస్వార్ధ శ్రమజీవన వైభవాన్ని చూడడమే – పాల్గొనడమే నాలాంటి కొందరికి అపూర్వంగా – అద్భుతంగా ఉంటుంది. గ్రామస్తుల్లో ఏ ఒక్క శాతం చైతన్యవంతులైనా ఇలా ఆలోచిస్తే చాలు - స్వచ్చోద్యమానికి సహకరిస్తే చాలు – ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో గదా!

 

గ్రామ ప్రధాన బాధ్యురాలు – పైడిపాముల కృష్ణకుమారి 6.25 సమయంలో తొలుత ముమ్మారు ఊరి పారిశుద్ధ్య – సౌందర్య – స్వస్తతా సంకల్ప నినాదాలను ఎలుగెత్తి, బుద్ధప్రసాదు గారి ఆధ్వర్యంలో నేడు పింగళి వేంకయ్య సంకల్పిత జాతీయపతాక శతాబ్ది ఉత్సవానికీ, 3 వ తేదీన జరిగే నూతన గ్రామపాలక వర్గ ప్రమాణ వేడుకకూ కార్యకర్తలందర్నీ సాదరంగా ఆహ్వానించారు.

 

రేపటి వేకువ శ్రమదానం కోసం ఇదే బైపాసు మార్గంలోనే కలుసుకొందాం.

 

స్వచ్చోద్యమ నినాదాలు

 

స్వచ్చోద్యమ చల్లపల్లి సంరంభం ఎట్టిదనగ....

సామాజిక ఋణవిముక్తి తాత్త్వికతే పునాదిగా...

రేబగలు తదేక దీక్ష గ్రామ సుందరీకరణతో

బొమ్మలూ నినాదాలతో స్వచ్చ స్ఫూర్తి పెంచడం! 

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 

01.04.2021.