2164* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

సొంత ఊరి సేవలో 31 మంది 2164* వ నాటి అద్భుత ప్రయత్నం.

 

మార్చి మాసపు తొలి స్ధిర వారం (3.4.21) వేకువ 4.20 సమయం! 1 వ వార్డులో బాలికల వసతి గృహం వెనుక దారి మలుపులో 11 - 12 మంది గ్రామ మెరుగుదల కృషీవలురు వీధి కాలుష్యాల మీద సమర సన్నద్దులైపోయిన వైనం వాట్సాప్ చిత్రంలో గమనించారా? సుమారు 20 మంది తొందరలోనే వీళ్ళకు తోడయ్యారు. (చల్లపల్లిలో ఈ 31 మందే కాదు, ఈ జాతి వాళ్లు వంద మంది ఉంటారు!) వీళ్ళను కృతయుగం నాటి సత్యకాలపు మనుషులనుకోవాలో, ఇంకే పేరైనా ఆలోచించాలో తెలియదు గాని, ఈ జాతి వాళ్ళలో చాలా మందికి బిరుదులు, పదవులు, ఆ పదవుల్ని ఆదాయ వనరులుగా మలుచుకోవడాలూ ఏమీ తెలియదు! ఏడు సంవత్సరాలుగా వీళ్ళ ఆలోచనలూ, ప్రణాలికలూ శక్తియుక్తులూ తమ గ్రామస్తుల సుఖ సంతోషాల చుట్టూనూ, మరి కొంత మెరుగైన సభ్య సమాజ రూపకల్పన చుట్టూనే తిరుగుతుంటాయి!

 

3 రోజులుగా ఎందుకో గాని, కార్యకర్తల 2 గంటల పని వేళలో గాలి మొహం చాటేస్తున్నది. వంగోనీ, కూర్చొనీ, ఒక్కోమారు ఎగిరీ బరువు పనుల్లో మునిగే స్వచ్ఛ శ్రమదాతలు లీటర్ల కొద్దీ నీళ్లు త్రాగుతూ, ధారలుగా చెమటలు కార్చుతూ ఎలా, ఎవరి కోసం కష్టిస్తున్నారో ఖరీదు కట్టే షరాబులుఈ నాటి వాట్సాప్ వీడియోలనూ, చిత్రాలనూ పరిశీలించాలని మనవి! ఈ శ్మశానం బాటను మొత్తం శ్మశానం వంతెన దాక ఈరోజు శుభ్ర సుందరీకరించగలమనుకొన్నారు గాని, అందులో కొద్ది భాగం రేపటికి మిగిలేపోయింది. (ఈ కాస్త మేర అయినా ఈ వీధి నివాసితులు పూర్తి చేసుకుంటే ఎంత బాగుంటుంది!)

 

ఇక ఈ  నాటి 31 మంది కార్యకర్తలు సుమారు 60 పనిగంటల్లో ఏమి సాధించారంటే అది ప్రతి రోజూ జరిగేదే! ముగింపు దొరకని కధే! శుభ్రపడిన బాట 150 గజాలే గాని పని మాత్రం 3 – 4 విధాలు :

 

- ఏడెనిమిది మందికి గతంలోతామే నాటి పెంచిన చెట్ల, పూల మొక్కల కొమ్మల్ని అందంగా మలచడమో, వంగిపోతుంటే నిటారుగా నిలిప, గుంజను పాతి త్రాళ్ళతో కట్టడమో, వాటి కుదుళ్ళ కలుపు తీసి, సరిదిద్దడమో సరిపోయింది.

 

- 15 మందికి రోడ్డు అంచుల పిచ్చి ముళ్ళ మొక్కల్ని, గడ్డిని కూర్చొనో, ఒంగోనో నరికి, పారలతో చెక్కి, ఎండు ముళ్ళను ఏరి, ప్లాస్టిక్ సీసాలు సంచులు  - కప్పుల్ని గుట్టలుగా చేయడంతో సరిపోయింది. ఈ బాటతో ఆగక వీళ్ళలో కొందరు వీధి మలుపుల్ని, కల్వర్టుల్నీ కూడా నడక కనుగుణంగా మార్చారు.

 

- చీపుళ్ళతో ఒకటికి రెండు మార్లు ఊడ్చే మహిళా కార్యకర్తల కృషినీ, చెట్ల కొమ్మల్ని ట్రిమ్ చేస్తున్న పొడవాటి స్వచ్ఛ ధీరుల్ని వారి పని సమయంలోనే చూసి తీరాలి.

 

- ఊరి మురుగులో 20 శాతం భాగాన్ని ఇముడ్చుకొన్న మురుగు కాల్వ సరిగ్గా నడవకపోతుంటే ఇద్దరు కార్యకర్తలు అందులో దిగి, తూములోని సిల్టును చేతులతో లాగి, పట్టు పట్టి, ఎట్టకేలకు నిలవ మురుగును ముందుకు నడిపిస్తున్న తీరు కూడ గమనార్హం!

 

ఈ నాటి స్వచ్చంద శ్రమదాన ప్రత్యేకంగా - ఒక విలక్షణ మహిళా కార్యకర్త పల్నాటి అన్నపూర్ణ సకుటుంబ సలక్షణ గ్రామ మెరుగుదల కృషిని పేర్కొనాలి. ఇంజనీర్లయిన కొడుకుని, కోడల్ని కూడ రోడ్డు మీదకు తెచ్చి, ఒకర్ని చెత్త బండిలో ఎక్కించి, ఇంకొక పనిమంతురాల్ని చీపురు గొర్రులతో పని చేయించి, ఆమె కాస్త తృప్తి పడింది. అదీ గాక తన చిరకాల వ్యసనం (పులిహోరో, పానకమో.... ఏదోకటి కార్యకర్తలకు పంచే అలవాటు) వదలక అందరిచేత ద్రాక్ష పళ్ళు, బాదం గింజల్ని తినిపించనే తినిపించింది.

 

డాక్టరు మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు నెలనెలా ఇచ్చే స్వచ్చోద్యమ చందా 2000/- ఈ రోజు అందించారు. 6.30 కి జరిగిన దైనందిన శ్రమదాన సమీక్షా సమయంలో రాజమండ్రికి (ఇప్పుడు చల్లపల్లి కి కూడ) చెందిన పల్నాటి (సిరిపురపు) లావణ్య తొణకకుండ ముమ్మారు చాటిన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలతో బాటు తన తొలినాటి శ్రమదాన అనుభవాన్ని కూడ చక్కగా వినిపించి, చరణ్ కూడ ఆమెను బలపరచి, నేటి శ్రమదానం ఒక వేడుకగా ముగిసింది.

 

రేపటి గ్రామ పారిశుద్ధ్య బాధ్యత కోసం వేకువనే మనం కలువ దగిన చోటు బైపాస్ మార్గంలో కమ్యూనిస్ట్ వీధి.      

 

ఔనౌనది అమాయకం

 

ఎవరో పై నుండి వచ్చి ఈ గ్రామము నుద్ధరించి

పూట పూట వీధి వీధి స్వచ్ఛ సుందరతలు మప్పి

పొవాలని స్వచ్చోద్యమ మును పూర్తిగ చూసి గూడ

భ్రమ పడితే కలగంటే పరమ అమాయకులే మరి!

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

03.04.2021.