2166* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

24 మంది - నాలుగైదు వీధుల పరిశుభ్రత - 2166* వ నాటి ప్రయత్నం!

 

ఈ బుధవారం (7.4.21) నాటి వేకువ సమయం - 4.20. విజయ్ నగర్ - బైపాస్ మార్గంలో తొలుత డజను మంది, కాస్త వెనుక – ముందుగా మరొక డజను మంది చేరికతో బలం పెంచుకున్న చల్లపల్లి స్వచ్ఛ సైన్యం ఒక నిర్ధిష్ట ప్రణాళికతో కాలుష్యంపై జరిపిన సమైక్య పోరాటంతో ప్రధానంగా బైపాస్ వీధి ఎంతగా మెరుగులుదిద్దుకొన్నదో మాతృ గ్రామాబిమానులు వాట్సాప్ చిత్రంలో చిత్తగించగలరు.

          సామాజిక మాధ్యమ నిపుణులైన డాక్టరు డి. ఆర్. కె., ప్రాతూరి గార్ల వాట్సాప్ ఛాయా చిత్రాలతోను, సుమారు వెయ్యి రోజులుగా నా వ్రాతలతోను, చల్లపల్లిలో కొందరు, దేశవిదేశాలలో మరికొందరు ఈ గ్రామ భౌతిక – ఆత్మిక మార్పుల్ని సహర్షంగా గమనిస్తున్నారు; స్వచ్ఛ కార్యకర్తల కఠినాతి కఠినమైన శ్రమదానాన్ని మ్రాన్పడి చూస్తునారు; ప్రోత్సహిస్తునారు! సహృదయులగు ఆ దూర ప్రవాసులకూ, తమ ఊరి వీధి పారిశుద్ధ్యం కోసం ఏ పనికైనా తెగించే ఈ స్వచ్ఛసైనికులకూ వినమ్రకృతజ్ఞతాంజలి.

 

గతంలో వాసిరెడ్డి కోటేశ్వరరావు, మాలెంపాటి గోపాలకృష్ణయ్యలు స్థానికుల్ని ప్రభావితుల్ని చేసిన నాలుగేళ్లపాటు ఈ విజయ్ నగర్ పరిసరాల స్వచ్ఛ – శుభ్రతలతో కళకళలాడుతూ ఉండేవి. చెట్ల పచ్చదనంతోను, రహదారి వనాల పూల సోయగాలతోను, వాసిరెడ్డి వారు ఒక్కరే నిర్మించిన వడ్లమర బాటలోని హరితవనంతోను ఈ ప్రాంతం మన గ్రామానికే కీర్తి శిఖరంగా కనపడేది. ఆ వన్ మాన్ ఆర్మీకి దీటుగా, అతని స్మృతికి అంకితంగా కార్యకర్తల శ్రమదానంతో ఈ దారులన్నీ ఈ నాడు ఇంత ఆహ్లాద కరంగా కనిపించడం సముచితంగా అనిపిస్తున్నది!

 

ఈ బుధవారం స్వచ్ఛ కార్యకర్తల వీర విహారంతో లాభించిన స్వచ్ఛ – సౌందర్య వివరాలు :

 

- విజయ్ నగర్ 1,2 అడ్డ రోడ్ల కశ్మలాలు చాల వరకు అదృశ్యమై, అంత మేరకు అవి శుభ్రంగా, ఆహ్లాదకరంగా మారిపోయాయి.

 

- సజ్జా వారి వీధి, వాసిరెడ్డి వారి బాటల్లోని పిచ్చి – ముళ్ళ మొక్కలు, దుమ్ము – ధూళి ఈ ఉదయం 6.30 తరువాత కనిపిస్తున్నాయేమో పరీక్షించండి.

 

- ముగ్గురు, నలుగురు చొప్పున బైపాస్ కు ఉత్తర దిశలోని రహదారి ఉద్యానాలలోకి ప్రవేశించిన కార్యకర్తలు అక్కడి ఎండుటాకులు, ప్లాస్టిక్ పదార్ధాలు (సంచులు, సారా మరియి నీటి సీసాలు, కప్పులు, ప్లేటులు వైగైరాలు), అందాలకు అడ్డొచ్చే కొమ్మలు, పూడిపోతున్న కుదుళ్ల వంటి వన్నీ బాగు పరిచి, గంటన్నర తర్వాత బైటకొచ్చారు! ఈ పనుల కోసం కత్తులు, దంతెలు, పారలు, చీపుర్లు వంటి అన్నిటినీ సమయానుకూలంగా ప్రయోగించారు.

 

- బైపాస్ ఉభయదరుల చెట్ల కొమ్మల్ని, మురుగు కాల్వల వ్యర్ధాలను, ఆకులు – పుడకల్ని ఐదారుగురు నెలపైనే మునికాళ్ళమీద కూర్చొని, ముందుకు జరుగుతూ, గడ్డి చెక్కుతూపోతున్న దృశ్యం ఎంతగా చూసినా తనివితీరదు!

 

          నేను చెపుతున్నవేమీ అభూతకల్పనలు కావు – తమ ఊరి మేలు కోసం ప్రతి రోజూ స్వచ్ఛ కార్యకర్తల యధార్ధ శ్రమజీవన దృశ్యాలు మాత్రమే!

 

          నేటి శ్రమ సమీక్షా సందర్భంలో ముందుగా సావధానంగా, శ్రావ్యంగా ముమ్మారు ఊరి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను వినిపించిన వారు డాక్టర్ తరిగోపుల పద్మావతి. (గత ఐదు రోజులుగా చెవులు దిమ్మెత్తేట్లుగా మైకుల మ్రోత బదులు గ్రామ ప్రయోజనకర వాక్యాలు వినటం హాయిగా ఉన్నది!)

 

          ‘మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీకి 3,000/- కార్యకర్తల టోపీలకు, తన నెలవారీ చందా 520/-    మొత్తం 3,520 /- సమర్పించిన వారు వృద్ధ – భారీ కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావు గారు.    

 

          నిన్నటి దాకా తమ సహకార్యకర్త కైలా నాంచారయ్య అకాల మృతిని గుర్తు చేసుకొని, కార్యకర్తల మనసులు బరువెక్కడం ఆ సమయంలోనే జరిగింది. నాంచారయ్య స్వచ్చంద శ్రమదానాన్ని, నగదు దానాన్ని అందరూ గుర్తించి, నివాళులర్పించారు.

 

రేపటి మన ఊరి మెరుగుదల ప్రయత్నం కోసం ఇదే బైపాస్ మార్గంలో – వాసిరెడ్డి కోటేశ్వరరావు గారి వీధి దగ్గర కలుసుకొందాం.

 

      పని సమయపు సన్నద్ధత  

 

ఎవరినైన కదల్చండి – ఎంతైన పరీక్షించుడు

కనులలోన ఒక తీక్ష్ణత – కరములందు ఒక సత్తువ

చేసే పనిలో వ్యగ్రత – చిత్తములో ఒక మెలకువ

తన – త్యాగంతో ఊరి నెల్ల ధన్యంగా మార్చు తెగువ!

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

07.04.2021.