2169* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2169* దినాల సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో - ఈ శనివారం.

 

         10.04.2021 వ నాటి వేకువలో సైతం 16 మంది గ్రామ స్వచ్చోద్యమ కారులకు 4.24 కీ, మరి కాస్త వ్యవధిలో ఇంకో పది మందికీ వీధి పారిశుద్ధ్య వేళ ఐపోయింది. ఇక అక్కడి నుండి 2 గంటల పైగా తమ సమయాన్ని- 6.20 దాక వాళ్లు గరిష్టంగా సద్వినియోగించారు. ఈ దేశంలో, ఈ గ్రామంలో ఎవరి అలవాట్లు, వ్యసనాలు, తెలివి తేటలు వాళ్లకున్నట్లే మన ఊరి స్వచ్చ కార్యకర్తలకు కూడ 2169 * దినాలుగా ఒక పెద్ద మంచి వ్యసనం తగులుకొన్నది. గురవారెడ్డి, గోపాలం శివుడు, రాష్ట్ర-దేశ-విదేశాల సహృదయులెందరో ఏ నాటి కానాడు ప్రోత్సహిస్తూ సదరు భారీ వ్యసనాన్ని మరింతగా పెంచేస్తూనే ఉన్నారు. చల్లపల్లి లో అలాంటి వ్యసనపరులు 150 మందికి పైగా ఉంటే- దాన్ని మెచ్చి, పరిశీలించి, ఆరాధించే 25-30 ఊళ్ల పిచ్చి మారాజులు, ప్రవాసులు, వందల్లో- వేలలో ఉన్నారు!

 

         “ఎవరి పిచ్చి వాళ్లకానందం” అని ఎవరు ఎందుకన్నారో గాని, 30-40 మంది స్వచ్చ కార్యకర్తలకు సైతం అది వర్తిస్తున్నట్లే ఉన్నది. లేకపోతే ఏ 15 రోజుల నుండో బైపాస్ వీధిలో సగ భాగాన్ని పట్టుకొని వదలకపోవడమేమిటి? బైపాస్ బాట ఒకటేనా-కుడి ఎడమల 6 వీధుల కాలుష్యం మీద కూడ ఇలా కసిని పెంచుకొని, ఏ అస్తవ్యస్తతను, అంద విహీనతను కూడ వదలక-ఆరేడు వందల పని గంటలైనా శ్రమిస్తూ ఆత్మ తృప్తి పొందడమేమిటి?

 

         ఐదారుగురు సుందరీకర్తల బైపాస్ వీధి సుందరీకరణం నిన్నటి కన్న మరికొంత తూర్పు దిశగా సాగింది. చెట్టును ట్రిమ్ చేయక, అలాగే వదిలేస్తే, విద్యుత్తు శాఖ కార్మికుల కంటబడితే వాటి మొదళ్లకే మోసం రావచ్చనే భయం వల్ల సుందరీకర్తలు ప్రతి చెట్టును, కొమ్మను నిశితంగా గమనించి, తగు చర్యలు తీసికోవడంతోనూ, రహదారిలో ప్రతి అంగుళం మీద తమ ముద్ర వేస్తుండడంతోను కాస్త జాప్యం జరగడం సహజమే మరి!

 

         ఎక్కువ మంది శ్రమించినదీ, ఉత్సాహ-ఉద్రేక-సందడి నెలకొన్నది మాత్రం అశోక నగరు  వీధి(నాల్గు రోడ్ల కూడలి)పరిసరాలలోనే! చాపల బోస్ అనే వ్యాపారి స్థలంలో కొంత భాగం, అక్కడి మురుగు కాలువ శుభ్రపడడమూ, మురుగు నీటి కదలిక ఆ సందడి ఫలితమే! స్వచ్ఛ మహా వీరుడైన దివంగత వాసిరెడ్డి కోటేశ్వరుల (తిరగేసి-కత్తిరిస్తే “కోవా”) వీధి అది. అతని స్మృతికి నివాళిగా ఈ దినం అది మరింత స్వచ్చ-శుభ్ర-సౌందర్యాలు సంతరించుకోవడమూ, ఆ ఒంటి చేతి కార్య సాధకుని గుర్తు చేస్తూ ఇందరు కార్యకర్తలు చెమట చిందించడమే సరైన శ్రద్ధాంజలి!

 

         నేటి మరొక విశేషం: బొట్టు పెట్టి పిలవకపోయినా, ప్రభుత్వ పాఠశాల 7 వ తరగతి విద్యార్థి తన వీధి పారిశుద్ధ్యంలో భాగస్తుడు కావడం! తన మిత్రుల్ని కూడ రేపటి బాధ్యతా నిర్వహణకు పిలుస్తాననడం చల్లపల్లి స్వచ్ఛతా ప్రయత్నానికొక శుభ సూచకం!

 

6.00 నుండి 6.20 దాక చెత్త లోడింగులో 10 మంది కార్యకర్తలు చెలరేగిపోవడమే నేటి పారిశుద్ధ్య కృషికి పతాక సన్నివేశం! అక్కడి నుండి 10 నిముషాలు కాఫీ కషాయ మధురిమల ఆస్వాదన.  గోళ్ల విజయ కృష్ణ తడబడకుండ ముమ్మారు ప్రకటించిన స్వగ్రామ స్వచ్ఛ- శుభ్ర- సౌందర్య సాధనా ప్రతిజ్ఞలు 6.40 కి.

 

         గ్రామ మెరుగుదల కోసం కార్యకర్తల నేటి నిరుపమాన కృషి సమీక్ష, నిన్న డాక్టర్ బ్రహ్మా రెడ్డి చల్లపల్లి సందర్శన, అతని నిన్న సాయంత్రపు ప్రయోజనకర ప్రసంగాల ప్రస్తావన,  బ్రహ్మారెడ్డి మాటల్లో  చల్లపల్లి స్వచ్చోద్యమపు “నభూతో- నభవిష్యతి” ప్రశంసల సంగతి డాక్టరు DRK ప్రసాదు గారు వివరిస్తే, గంగులపాలెం వీధి శుభ్రత కోసం కొండపల్లి బాబూరావు ప్రకటన చేస్తే-6.45 కు నేటి మన కర్తవ్య విరమణ.

 

         రేపటి స్వచ్చంద-స్వచ్చ దినచర్య భారత లక్ష్మి వడ్లమర సమీపంలో ఉండగలదని మనవి!

 

          నేటి మన సమాజంలో....

ప్రతి పౌరుడు ఇతరులకే ప్రవచనాలు చెప్పగలడు

స్వచ్ఛ-శుభ్ర-సౌందర్యపు పాఠములను నేర్పగలడు

ఆచరణకు దిగాలన్న ఆసలెవ్వడు కనిపించడు!

అందుకు మినహాయింపే స్వచ్చోద్యమ సైనికుడు!

 

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

10.04.2021.