2170* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

వినూత్న స్వచ్చోద్యమం- విశిష్ట గ్రామ వైఖరి @ 2170 * రోజులు.

 

         షరా! మామూలుగానే  వేకువ 4.30 నుండి గంటన్నర పాటు వీధి పారిశుద్ధ్య నిర్వహణగా నిశ్చయించుకొని 4.18 కే 15 మంది  ఆత్రుత చెందడం, మరి కొద్ది నిముషాలకే 20 మంది వచ్చి చేరి సకలాయుధ సన్నద్ధులై-35 మంది తమ వంతుగా గ్రామ సమాజ మేలిమికై 70 కి పైగా పని గంటల సమయాన్ని, శక్తి యుక్తుల్ని 6.20 దాకా వెచ్చించడం- తామిచ్చిన దానికి ప్రతి ఫలంగా కొంత ఆత్మ సంతృప్తిని, మరి కాస్త ఆరోగ్యాన్ని, అంతకు మించిన ఒక ఆదర్శ సంఘీబావాన్ని అనుభవించడం....

ఇది 2170 * దినాలుగా జరుగుతున్న యదార్థమే.

 

ఈ ఆదివారం(12.04.2021) స్వచ్చోద్యమ సంఘటనా స్థలం భారత లక్ష్మి వడ్ల మర వీధి. ఇంకొకటి కూడ (ఒకటి రెండు మినహాయింపులతో) ఏడేళ్లుగా జరుగుతున్నదే- తమ ఇళ్ల ముందు, వాకిళ్లలో ఒక అద్భుత ప్రయోగం జరుగుతున్నా, ఇందరు మహిళలు- చిన్నలు-పెద్దలు శుభ్ర పరుస్తున్నా- తమకు దాంతో ఏ సంబంధమూ లేనట్లే అక్కడి గృహస్తులు, విభాగ భవన (అపార్ట్మెంట్లు) వాసులూ ప్రవర్తించడం! అన్ని దరిద్రాలలోకి పెద్దది భావ దరిద్రమంటారు!

 

కార్యకర్తలు మాత్రం రాగ ద్వేషాల పరిధి దాటి, అక్కడి రెండు ప్రధాన వీధుల ధూళి దూసరిత దుర్గంధాలను తొలగించారు, ఊడ్చి, స్వయం పోషిత వృక్షాలను మరింత సౌందర్యమయం చేసి, పూల మొక్కలకు ఆసరా కల్పించి, పాదుల్ని సరిదిద్ది ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరి.... ఈ జాబితాకు అంతుండదు! అపార్టుమెంట్ ల నుండి పుట్టుకొచ్చిన అన్ని రకాల చెత్తలు చేరగూడని మురుగు కాల్వలోకి చేరితే- వాటిని శుభ్ర పరచడం పంచాయితీకి శక్తికి మించిన పనైపోతే – స్వచ్చ కార్యకర్తలెంత శ్రమపడి బాగు చేస్తున్నారని కూడ గృహాల వారు పట్టించుకోక దూరదూరంగా ఉండిపోవడం ఏ నాగరికతకు చిహ్నం?  

 

బైపాస్ బాటకు ఉత్తర గట్టు మీద పెరిగిన పిచ్చి-ముళ్ల మొక్కల గుబుళ్లను, ఎవరో విసిరిన ప్లాస్టిక్ సంచుల్ని, త్రాగి అవలీలగా మురుగు కాల్వలోకి విసిరేసిన మంచినీళ్ల, మద్యం సీసాలను, మురుగు నుండి ఏపుగా పెరిగిన తామర, గడ్డి తదితర అవాంఛిత వ్యర్థాలను ఆ వేకువ సమయంలో నరికి-ఏరి-బయిటకు లాగడమెంత కష్ట సాధ్యమో గ్రామస్తులు గ్రహించాలి. నేటి కాలంలో మనిషి వెయ్యి ఇచ్చినా – ఇంత బాధ్యతగా, దీక్షగా ఈ మురికి పనులెవరు చేస్తారో లేదో ఆలోచించిన సోదర గ్రామస్తులు వీధిని గాని మురుగు కాల్వను గాని ఇంతగా కశ్మలమయం చేస్తారా? గ్రామం కోసం అంకితులైన 35 మంది బాధ్యతా దీక్ష, ఎక్కడ ఏమి జరిగినా పట్టని బాధ్యతా రాహిత్యం ప్రక్కప్రక్కనే కొలువు తీరడం విచిత్రంగా లేదూ?

 

         ఇందరి కష్టార్జిత వీధి సొగసులూ, వడ్ల మర వీధి స్వచ్చ-శుభ్ర-సౌందర్యాలూ, బాగుపడి ముందుకు కదులుతున్న మురుగు నడకల్నీ గ్రామస్తులు ప్రత్యక్షంగాను, వాట్సాప్ వీక్షకులు పరోక్షంగాను పరిశీలించవచ్చు. రెండు వారాలకు పైగా తమ ఖర్చుతో, శ్రమతో, ప్రణాళికతో, క్రమశిక్షణతో స్వచ్చ శ్రమదాతలు బైపాసు రహదారిలో సగాన్ని, ఆరేడు ఉప మార్గాల్ని మొత్తంగానూ తమ అంచనా మేరకు తీర్చిదిద్దారు.

 

         కాఫీ కబుర్ల అనంతరం 6.45 కు మార్చి నెల స్వచ్చోద్యమ ఆదాయ వ్యయ పట్టికను డాక్టరు డి.ఆర్.కె. గారు చదివారు. గ్రామ మెరుగుదల కృషి సఫల- వైఫల్యాలను, కార్యకర్తల సూచనలను పరిశీలించారు. మరీ ముఖ్యం గా కోవిడ్ ద్వితీయ తరంగ తీవ్రతను, టీకా ఆవశ్యకతను, పాటించదగిన అన్ని జాగ్రత్తలను సీరియస్ గా హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో 7 వ తరగతి విద్యార్థి జగదీష్ ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప ప్రతిజ్ఞను అందరూ హర్షించారు. యార్లగడ్డ గ్రామ కృషి కంకితుడైన తూము వేంకటేశ్వర రావు గారి అనుభవాలను విన్నారు!

 

         బుధవారం నాటి బైపాస్ రహదారి స్వచ్చ-సుందరీకరణ కర్తవ్య పరిపూర్తి కోసం పాత కస్తూర్బా ఆసుపత్రి వద్ద కలుసుకొందాం.

 

    ఎవరు శాశ్వతమేది ధన్యత!

స్వార్థ చింతన పొంగి పొరలే జన్మ కర్థం ఉండబోదోయ్

పరుల క్షేమం సరకు చేయని నరుల బ్రతుకులు వ్యర్థమేనోయ్

ఎంతలెంతటి మహా మహులూ ఇచట శాశ్వతమని భ్రమించకు

మనం చేసే మంచి చెడ్డలె చిర స్థాయిగ నిలువగలవోయ్!        

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

11.04.2021.