2171* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్చోద్యమ – సుందర చల్లపల్లి @2171* మహత్తర దినాలు.  

 

         ఈ బుధవారం (14.4.21) వేకువ 4.25 కే 15 మంది పాడుబడిన కస్తూర్బా ఆస్పత్రి దగ్గర శ్రమదాన సన్నద్ధులైన వైనం వాట్సాప్ వీక్షక – పాఠక మిత్రులు గమనించే ఉంటారు. మరొక 15 మంది వచ్చి, వీళ్లతో చేరి 6.10 దాక – ముగ్గురైతే 6.20 దాక బైపాస్ మార్గంలో కాలుష్యాల మీద చేసిన పోరాటం కూడ గమనార్హం! సూరి డాక్టరు వీధి మొదలు సినిమా హాలు దాక ఇప్పుడు స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాలతో అలరారుతున్నవి. ప్రధాన మార్గంలోని మూడు రహదారి వనాలు, కొసరుగా విజయా కాన్వెంట్ వీధి, యడ్ల వారి వీధి, కబేళా మార్గాలు కూడ పాక్షికంగా మెరుగుపడ్డవి.

 

“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్ధాన మధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్!”

(భరత ఖండంలో ధర్మానికి ఎప్పుడు ఉపద్రవం వస్తుందో అప్పుడు అధర్మమును అణచివేయుటకై నేను అవతరిస్తాను)

అని ద్వాపరయుగారంభంలో ఒక మహా మేధావి సెలవిచ్చినది – కనీసం ఈ చల్లపల్లి గ్రామ కశ్మలాలకూ, దిగజారిన దాని స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య – పర్యావరణాలకు, ఈ 30 మంది స్వచ్చోద్యమకారులకు సైతం వర్తిస్తుంది! 7 – 8 ఏళ్ల నాటి మన గ్రామ వీధుల్ని, బహిరంగ మల మూత్ర విసర్జిత బాటల్ని, శ్మశానాలనీ, గ్రామం లోపలికి వచ్చే 7 రహదారుల్నీ, వాటి గుంటల్నీ, కాలువల్లో గాక, రోడ్ల మీద సంచరించే మురుగునీ గుర్తు చేసుకొంటే – ప్రస్తుత మెరుగుదలల్ని పోల్చి చూసుకొంటే – నేను వ్రాస్తున్నది అభూత కల్పన కానే కాదని అంగీకరిస్తారు!

 

ఇక్కడ ఒక గ్రామంలో 21 వ శతాబ్దంలో 2171 రోజుల – మూడు నాలుగు లక్షల పని గంటల సార్ధక సముచిత శ్రమదానం జరిగిందనీ, అది 30 కి పైగా ఊళ్ళకు మార్గదర్శకమయిందనీ, అది తప్ప పల్లెల స్వచ్ఛ – స్వస్త – పరిశుభ్ర – హరిత – సౌందర్యాలకు మరొక హామీ లేదనీ ఇంతటి స్వార్ధమయ ప్రపంచంలో – మరొక 100 ఏళ్ల పిదప ఎవరూ నమ్మకపోవచ్చు!

 

ఈ నాటి కార్యకర్తల కృషి వివరాలకొస్తే :

 

- బాటకు ఉత్తర దిశలోని మూడు పూల వనాలలోని, నిరర్ధక మొక్కల్నీ, అక్రమంగా పెరిగి, అందహీనంగా కనిపించే చెట్ల కొమ్మల్నీ, పాదుల్నీ, అందలి గడ్డినీ డజను మంది నరికి, దంతెలతో రోడ్డు  మీదకు లాగుతూ శ్రమించారు. ఆ వెంటనే ఈ వనాల మరింత మెరుగుదల కోసం సుందరీకర్తలు ప్రయత్నించారు.

 

- పది మందికి పైగా చీపుళ్ళ వారు ప్రధాన రహదారినీ, సూరి డాక్టరు వీధిలో, దాని ఎదుట వీధిలో, కస్తూర్భా శిధిల ఆస్పత్రి పరిసరాలలో, కబేళా మార్గంలో కొంత భాగాన్ని శుభ్రపరిచారు.

 

- మూడవ దళం వారు బోలెడంత వ్యర్ధాల గుట్టల్ని డిప్పలతో ట్రాక్టర్ లో కెక్కించే పనికి పూనుకొన్నారు గాని, అది పూర్తి కాక రేపటికి మిగిలేపోయింది.

 

         సౌందర్య దృష్టి, స్వచ్ఛ – శుభ్ర స్పృహ ఉన్న వాళ్ళకు ఏ వీధి, ఏ మురుగు కాల్వను చూసినా, ఆలోపం ఇట్టే తెలిసిపోతుంది. ఆదిలోపిస్తే – ఎంత పరిశుభ్రతైనా, పచ్చదనమైనా తేడా తెలియనే తెలియదు.

 

డాక్టరు డి.ఆర్.కె. గారు నేడు వచ్చినా, అనివార్యంగా సమీక్షా సమావేశానికి రాని నేపధ్యంలో, కాఫీల  అనంతరం 6.35 కు నందేటి శ్రీనివాస్ ముమ్మారు పలికిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య ప్రతిజ్ఞలను అందరూ పునరుద్ఘాటించి, 6.45 కి నేటి తమ కార్యక్రమాన్ని ముగించారు.

 

రేపటి శ్రమదాన ప్రణాళికను వేకువనే సాగర్ సినిమా హాలు ప్రక్కన కలిసి, అమలు చేద్దాం.

 

         కపట వర్తన కాలుదువ్వే...

సజావుగ ఏ పనులు జరగని సమస్యాత్మక సామాజంలో

కపట వర్తన నిజాయితిపై కాలుదువ్వే కాలములలో

స్వచ్ఛ వీరుల వేల దినముల సాహసాత్మక గ్రామ సేవల

ఉదాహరణలు చల్లపల్లిలొ ఉండు టెంతటి అద్భుతములో!        

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

14.04.2021.