2175* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2175* వ నాటి గ్రామ స్వచ్ఛ సుందరీకరణ ప్రయత్నం.

 

ఏప్రిల్ 18 (ఆదివారం) కూడ ఊరి పరిచర్యల కోసం 4.16 కే 15 మందికి తెల్లవారింది. మిగిలిన వారి రాకతో ఆ బలం 31 దాక పెరిగి, రెండు గంటల పాటు – 6.15 దాక వీధి అస్తవ్యస్తతల మీద జరిపిన స్వచ్ఛ కార్యకర్తల పోరాటం సంతృప్తికరంగా ఫలించి, బైపాస్ వీధిలో సినిమా హాలు పరిసరాలు, ఉత్తర దిశగా ఉన్న రెండు ఉప మార్గాల కశ్మల దరిద్రాలు తొలగి, ఆ రద్దీ ప్రదేశాలు చూడముచ్చటగా తయారైనవి. మరి అదంతా చెమటలు కార్చిన, 60 పని గంటలు గట్టిగా శ్రమించిన, గ్రామ బాధ్యతలు భుజాల కెత్తుకొని మోస్తున్న స్వచ్ఛ కార్యకర్తల శ్రమదాన మహిమ!

 

అసలీ కార్యకర్తల్ని శ్రేయోభిలాషులనబడే కొందరే నాడో హెచ్చరించారు హితవు పలికారు – “ఎందుకండీ! బొత్తిగా బాధ్యతే పట్టని, స్పందించని గ్రామ ప్రజల ఆరోగ్య ఆహ్లదాల కోసం మీ విలువైన కాలాన్ని, ధనాన్ని, శ్రమనూ బూడిదలో పోస్తారు....అని! మరికొందరైతే చాటుగా వెక్కిరించారు గూడ! ఐనా సరే ధృఢమనస్కులో, మొండి వాళ్ళో గాని ఈ శ్రమదాతలు మా కార్యక్రమం కాదు ఆగవలసింది మరో 2000 రోజులకైనా ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్యాలకు భంగం కలిగించే కొందరు గ్రామస్తుల అలవాట్లే...అని భీష్మించుకొని తమ దారిలో తాము పురోగమిస్తూనే ఉన్నారు!

 

దేని కోసం, దేని లోపాలు సరిదిద్ది, మెరుగుదల కోసం చిత్త శుద్ధితో ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆయా కాలాల క్రొత్త ఆలోచనాపరుల్ని (ఉదా : జీసస్ క్రీస్తు, అబ్రహం లింకన్, గాంధీ, వీరేశలింగం మొ॥) ఏ సమాజమూ పూర్తిగా అనుసరించి, నెత్తిన పెట్టుకోలేదు. 90 ఏళ్ళు సాగిన భారత స్వాతంత్ర్య సమరాన్ని కూడ వీధులకెక్కి, తెగబడి సమర్ధించింది 10% ప్రజలే! కాబట్టి ఈ పాటి చారిత్రక అవగాహన ఉన్న స్వచ్ఛకార్యకర్తలు తమ సాత్విక పోరాటాన్ని ఎందుకాపాలి?

 

నేడు 30 మంది స్వచ్చంద గ్రామ బాధ్యుల శ్రమదాన వేదికగా నిలిచింది సాగర్ టాకీస్ పరిసర 100 గజాల వీధులే. ఈ మాత్రానికే కార్యకర్తల కృషిని ఇంతగా కీర్తించాలా...అనుకోవద్దు. సినిమాహాలు ఉత్తర ద్వారం దగ్గరి 10 – 15 గజాల జాగా నుండే సగం ట్రక్కు వ్యర్ధాలను సుందరీకరణ బృందం సంపాదించిందంటే అది ఆ బృందం గొప్పతనమో, సినిమా ప్రదర్శనశాల మహిమో కాదు మన గ్రామ దురదృష్టం అంతే! ఆ కశ్మలాలలో పాత గుడ్డలు, ఖాళీ ప్లాస్టిక్ సంచులూ, రాళ్ళు రప్పలూ, మన్నుగా మారుతున్న గోనె సంచులూ... అసలక్కడ లేని పర్యావరణ హాని ఏమున్నది? మరీ ముఖ్యంగా పెరిగిపోతున్న మద్య సంస్కృతికి చిహ్నంగా డిప్పల కొద్దీ ఖాళీ మద్యం సీసాలు ఈ చల్లపల్లి ఎందులోనూ వెనకబడిపోలేదని చాటి చెప్పడం లేదూ?

 

CPM ఆఫీసు వీధి, దాని దక్షిణపు సిమెంటు బాట వీధి,ఆ రెండిటి నడుమ గతంలో తామే సృష్టించిన ఉద్యానవనమూ, పదిమంది కార్యకర్తల నిర్విరామ కృషితో శుభ్రపడిపోయినవి.

 

పోగేసిన అన్ని రకాల వ్యర్ధాలను నలుగురు చకచక డిప్పలకెత్తి, పైన ఒకరు అణగ ద్రొక్కి సర్దుతుండగా ట్రక్కులో నింపి, దూరంగా ఉన్న చెత్త కేంద్రానికి చేర్చే పని కూడ సాధారణ నిత్యకృత్యమే!

 

6.25 కు కాఫీలు ముగించి, జరిపిన సమీక్షా సమయంలో డాక్టరు డి.ఆర్. కె ప్రసాదు గారు మాతృ వియోగం తో మనసు పనిచేయక గత 3 దినాలుగా శ్రమదానంలో పాల్గొనని నిస్సహాయతను వెలిబుచ్చగా స్వచ్ఛ చల్లపల్లి మామ్మ గారి అంతిమ వీడుకోలును అందరూ స్మరించుకొన్నారు. గత కొన్ని వారాలుగా కరోనా తీవ్రతను హెచ్చరిస్తూ వస్తున్న డాక్టరు గారు మన శ్రమదాన పునర్దర్శనం తదుపరి ఆదివారమేననీ, అప్పటి సమీక్షతో నిర్ణయించుకొందామనీ చెప్పారు.

 

లంకే  సుభాషిణి గారి గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలతోనూ, నందేటి శ్రీనివాసుని ఉత్తేజకర గానంతోను నేటి మన గ్రామ మెరుగుదల ప్రయత్నం ముగిసింది.

 

25.04.2021 – ఆదివారం వేకువ 4.20 కి సాగర్ సినిమాహాలు వీధిలో మళ్ళీ మన పునర్దర్శనం.

 

                  దాసరి స్వర్ణలత వలె....

 

విచ్చల విడిగా వికటముగనో- వెర్రి మొర్రిగ బ్రతుక వచ్చున?

అందరికి తలనొప్పిగానూ వ్యర్ధముగనూ మిగల వచ్చున?

హ్లాదముగనే తోటి జనులకు హాయి పంచుచు మెలగలేమా!

స్వర్ణలత వలె సక్రముగ త్యాగ నిరతిని చూపలేమా!

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

18.04.2021.