2235* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం!

 

N.H.216 వ జాతీయ రహదారి శుభ్ర-సుందరీకరణ లక్ష్య పరిపూర్తి @2235*.

 

ఈ గురువారం నాటి 25 మంది స్వచ్చ దీక్షా పరుల మూడు వారాల శ్రమ ఫలించి, 2 ½ కిలో మీటర్ల జాతీయ రహదారిలో-అటు చల్లపల్లి మొదలు ఇటు కప్తాన్ పాలెం మలుపుదాక స్వచ్చంగాను, చూసేందుకు రెండు కళ్ళు చాలవనేంత అందంగాను రూపొందింది. ఇందుకుగాను ఈ వేకువ 4.19 సమయనికే 14 మంది కాసానగర కాసారం దగ్గర దారి కశ్మల విధ్వంసానికి సంసిద్ధులైన వైనాన్ని గమనించారా?

 

ఈ సువిశాల రహదారి మనోజ్ఞత వెనుక, హరిత సుమ సుందర ఆహ్లాదకర సన్నివేశాల వెనుక గతంలో లెక్కలు కాక, మళ్ళీ ఈ నెల నుండి ఎందరి సహృదయత, అంకుఠిత దీక్ష, ఐదారు వందల పని గంటల శ్రమదానం ఉన్నవో ఇప్పుడైనా నూరుశాతం మంది గ్రామస్తులు, రహదారి పథికులూ ఆలోచిస్తారా? ఇదంతా అప్పనంగా ఆకాశం నుండి ఊడి పడ్డదేమీ కాదనీ, కార్యకర్తల శ్రమ-దమ-వ్యయ పూర్వక కృషి ఫలితమనీ గ్రహిస్తారా? గ్రహిస్తే-ఇక నుండైనా మరికొందరు సామాజిక బాధ్యులు వచ్చి పాల్గొంటారా?

 

నేటి కార్యకర్తల ప్రయత్నం ప్రధానంగా 3 విధాలుగా జరిగింది :

 

- కాసానగర సరోవర తూర్పు భాగంలో అందవిహీనంగా ఉన్న కొన్ని పెద్ద చెట్ల కొమ్మల ఖండనం,

 

- మిగిలిపోయిన నాలుగైదు పూల మొక్కలకు ఊతం నిలిపి, త్రాడు చుట్టి భద్రపరచిన విధానం.

 

- చెరువు దక్షిణ గట్టును, ఊరిలోకి పోయే దారిని, అక్కడ నివాసాల ఎదుట తెగ పెరిగిన తిక్క మొక్కల్ని, ముళ్ల చెట్లనీ అవసరాన్ని బట్టి సమూలంగా తీసేయడం, (ఈ పనే ఎక్కువమంది కార్యకర్తల శ్రమనూ, సమయాన్నీ దక్కించుకొన్నది!) వాస్తవానికి-అసలీ పని ఎవరిది? 3-4 కిలోమీటర్ల దూరం నుండి వేకువ చీకట్లో వచ్చి, వానలో తడుస్తూ పని చేయడం స్వచ్చోద్యమ కారుల బాధ్యతా? లేక కాసానగర నివాసితుల కర్తవ్యమా?

 

- నేటి నాలుగోరకం శ్రమదానం-ముఖ్యంగా ముగ్గురు మహిళా కార్యకర్తల పట్టుదలేమంటే చెరువు బారునా, స్థానిక దేవాలయం దగ్గరా, ఉప రహదారి మలుపు దాక చేతులు నొప్పి పెట్టినా విడవక ఊడ్చి శుభ్రపరచడం.

 

          ఈ నాటి ముఖ్య సంతోషకర విషయమేమంటే-కాసానగరం నుండి చెక్ పోస్టు ఉద్యోగి దాసు అనే వ్యక్తి కార్యకర్తలతో చేయి కలపడం.

 

మరొక ఆసక్తికర సమాచారమేమనగా ప్రాతూరి శంకర శాస్త్రిగారు (ఆయన పెన్షన్ లో అదనంగా డి.ఎ. కలిసిన మిషతో) పర్యావరణ హానికరం కాని, బహుకాల వాడకానికనువైన చేతి సంచుల్ని పంచడం!

 

స్వచ్చోద్యమ ప్రతీకలైన స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలను నేడు విస్పష్టంగా ప్రకటించిన వారు శివరామపురం స్వచ్ఛ కార్యకర్త లౌవ్లీ వేంకటేశ్వరరావు కాగా, ఇంత అద్భుత రహదారి రూపు రేకల్నీ,అందుకు కారణమైన కార్యకర్తల శ్రమనూ ప్రశంసించినదీ, రేపటి కృషి కేంద్రాన్ని ప్రస్తావించినదీ డాక్టరు D.R.K గారు;

 

రేపటి శుక్రవారం వేకువ మనం కలిసి పాటుబడదగిన చోటు పాగోలు రోడ్డులోని మహాబోధి స్కూలు ముఖద్వారం వద్ద!

 

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం 11

 

జీవితాన్నే ఉదాహరణగ చేసి చూపిన మహాత్ములకూ

స్వార్ధమేలని-పరుల బాగుకె ప్రబోధించిన మహాకవులకు

వారసులుగా ఊరి బాధ్యత కుద్యమించిన కార్యకర్తకు

సమర్పిస్తా నిండు మనసుతొ సవినయంబగు ఒక ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

23.09.2021.