2237* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

పరిసర రహదార్ల మెరుగుదల ప్రయత్నంలో2237* రోజులు.

 

ఈ శనివారం వేకువనే పాగోలు మార్గంలోని మహాబోధి NTR పాఠశాల సమీపంలో 4.22 సమయంలో వేచి ఉన్న 14 మందీ, తదుపరి మరి నల్గురూ- వెరసి అష్టాదశ కార్యకర్తల కృషి పాక్షికంగా ఫలించింది. నిన్నటి నుండి హెచ్చరికలు పంపుతున్న ప్రకృతి ఈ వేకువ నిరంతర వర్ష రూపంలో వీళ్ల శ్రమదానానికి కొంత ఆటంకం కల్గించింది.

 

          పొరుగూరి రహదారి సుందరాకృతి కోసం నేటి వర్షంలోనే-పాక్షికంగానైనా నెరవేరిన ప్రయత్న వివరాలు:

 

- పాఠశాల ఎదురుగా – ప్రవేశ ద్వారానికి ఉత్తరంగా రోడ్డు పార్శ్వాల సుందరీకరణలో భాగంగా రెండు మూడు నిరర్ధక తాళ (తాడి)మొక్కల్ని నరికే పని. అంతలోనే దబదబా వర్షం – ఒక కార్యకర్తైతే –నరికిన తాటాకుల్నే తలమీద కప్పుకున్న వైనం.

- గడ్డి చెక్కుడు, పిచ్చి మొక్కల పీకుడు, ముళ్ల మొక్కల నరుకుడు సైతం అసంపూర్ణంగానే ముగిశాయి.

 

ఎక్కడో బంగాళాఖాతంలో వచ్చిన ప్రకృతి అలజడి నేటి కార్యకర్తల వీధి పరిశుభ్రతా చర్యల కడ్డు పడింది! ఈ చీకటి సమయంలో-విద్యుత్ ప్రసారం నిలిచిన పరిస్థితిలో –కురుస్తున్న చినుకుల, ఉరుముతున్న మబ్బుల నేపధ్యంలో- నమ్మిన ఒక లక్ష్య సాధన కోసం, స్వార్థ రహితంగాను, విశాల గ్రామ ప్రయోజన కరంగాను, సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని అభినందించకుండా ఉండలేను.

 

అదే సమయంలో – ఎవరి హితం కోసం ఈ కార్యక్రమం జరుగుతున్నదో- వాళ్ళిటు తొంగి చూడని చైతన్య రాహిత్యాన్ని గమనించకుండా ఉండలేను!

            ఏదేమైనా ఈ శనివారం వేకువ స్వచ్చ సైనికులతో వాన దోబూచులు, సయ్యాటలు చాలా కాలం దాకా గుర్తొచ్చే సన్నివేశమే!

 

రోజుటి కన్న భిన్నంగా 6.00 కాకుండానే ముగిసిన నేటి కృషి సమీక్షా సమావేశంలో పాగోలు దుర్గా ప్రసాదు నినదించిన త్రిగుణాత్మక గ్రామ  స్వచ్చ – పరిశుభ్ర-సౌందర్య సాధనా ప్రతిజ్ఞతో నేటి ప్రయత్నాన్ని రేపటికి వాయిదా వేసి శ్రమదాతలు గృహోన్ముఖులయ్యారు.

 

          రేపటి స్వచ్చోద్యమ విస్తరణ పాగోలు మార్గంలోనే- మహాబోధి పాఠశాల ఎదురుగానే కలిసి, కొనసాగిద్దాం!

 

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం 13

బాహ్య మల సర్జనలు మానిపి, మరుగు దొడ్లకు నాంది పలికి,

వీధి కుఢ్యము లందగించీ, దేవళాలను బాగుపరచీ,

సత్ప్రవర్తన-సచ్చరిత్ర తొ జనుల మనసులు మార్చి గెలిచి, సు

దీర్ఘ కాలం ఉద్యమించిన ధీరులందరికీ ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

25.09.2021.