2238* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్చోద్యమ యార్లగడ్డ 726 * వ నాటి ఆతిధ్యానికి -2238* వ నాడు.

 

26 సెప్టెంబరు- ఆదివారం వేకువ 5.00 కు ముందే బయల్దేరిన 30 మంది స్వచ్చ-వాలంటీర్లు యార్లగడ్డ స్వచ్చోద్యమ అతిథులుగా 8.30 దాక గడిపారు.  స్వచ్చోద్యమ చిహ్నాలైన ఏకరూప దుస్తులతో, శిరస్త్రాణాలతో, మోటారు ద్విచక్ర వాహనాలతో, మైకు నుండి దారి పొడుగునా వినిపిస్తున్న స్వచ్చ-భావ ప్రేరణా గేయాలతో, వక్కలగడ్డ,యార్లగడ్డ ప్రజల్ని ఆకర్షిస్తూ- ఆలోచింపజేస్తూ సాగిన ఈ యాత్ర  ఫల ప్రదమనే చెప్పాలి. ఎందుకంటే:

 

          ఇది చల్లపల్లి-యార్లగడ్డ ఉభయ గ్రామాల స్వచ్చంద శ్రమదాతల అనుభవాల-ఆలోచనల పరస్పర అవగాహనా యాత్ర! స్వగ్రామ స్వచ్చ-శుభ్ర – సౌందర్య సాధనలో ఎదుటి వారి మెళకువలు,సాధక బాధకాలు, సొంత లోటుపాట్లు, భవిష్యత్ కార్యాచరణలు చర్చకు వచ్చిన విలక్షణ దిక్సూచక యాత్ర!

 

ఇంకా తెల తెల్లవారక ముందే-50-60 మంది గ్రామ మెరుగుదల కార్యాచరణ శీలురు ఒక చారిత్రాత్మక గ్రామంలో వీధులూ, ఊరి బయట రహదారులూ జిజ్ఞాసతో పదే పదే తిరుగుతూ-పచ్చని పల్లె పంట పొలాలకు మరింత శోభనిస్తున్న వేల కొద్దీ పూల శోభల్ని ఆస్వాదిస్తూ- ఇంతటి స్వచ్చతా సాధకుల్ని అభినందిస్తూ.. రెండు గంటల సమయాన్ని సద్వినియోగ పరచడమంటే – ఇది ఇప్పటి దేశ- కాలాల కెంతటి మన్నన!

 

ఒకప్పటి రాజుల-రాణుల  పొరుగు రాజ్యాల సందర్శన కన్న, కోటాను కోట్ల వ్యయంతో నేటి దేశాధి నేతల విదేశ యాత్రల కన్న- ఈ మూడు గ్రామాల స్వచ్చ సైనికుల స్నేహ-గౌరవ-అభిమాన-స్ఫూర్తిదాయక అవగాహనా యాత్ర నా దృష్టిలో నిజంగా మిన్న!

 

నాగమల్లి కోటేశ్వర దేవస్థాన ఆవరణలో ఈ స్వచ్చ కార్యకర్తల క్రమ శిక్షణ గాని, గ్రామస్తుల ఆనంద- ఆరోగ్యాల కోసం వాళ్ల అభినివేశం గాని, ఊరి ఉమ్మడి మేలు కోసం త్యాగ సంసిద్ధత గాని, ఈ లక్షణాలను అభినందించి, ఎగసన దోసిన డాక్టర్ దాసరి రామకృష్ణ గారి ప్రసంగం గాని, ఘంటశాల- యార్లగడ్డ-చల్లపల్లి గ్రామాల్లోని సుదీర్ఘ శ్రమ దానోద్యమ వివరణల పట్ల 60 మంది శ్రోతల ప్రతి స్పందనలు గాని- సమీప భవిష్యత్తులో స్వచ్చ-శుభ్ర-సుందర గ్రామాల రూప కల్పనకు శుభ సూచకాలే!

 

గాంధీజీకి ప్రేమ పాత్రుడైన పింగళి వేంకయ్య స్వగ్రామం, “ ఆయుష్” మంతుడైన యార్లగడ్డ రమేష్ భూరి వితరణార్హమైన గ్రామం, బాధ్యులైన కర్తవ్య నిష్ఠులైన గ్రామ పాలక మండలి ఉన్న ఈ యార్లగడ్డ గ్రామం అచిర కాలంలోనే దేశాని కాదర్శమై, సదాలోచనాపరుల యాత్రా స్థలమై వర్థిల్లాలని కోరుకుందాం!

 

బుధవారం నాటి వేకువ మన స్వచ్చోద్యమ శ్రమదాన విడిది పాగోలు దారిలోని మహాబోధి-NTR ఉన్నత పాఠశాల  ప్రవేశ ద్వారమే!

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం 13

“ఉన్న దొకటే మూల సూత్రం-ఉత్తమోత్తమ శ్రమ విలాసం

అందరొకటిగ వీధి వీధిని అందగించే సత్ప్రయత్నం

కష్టముగ భావించి సలుపక ఇష్టపడితే అది వినోదం...”

అనే తాత్త్విక చింతనా పరులందరికి మా సత్ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

26.09.2021.