2248*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

2248* నాళ్ళ స్వచ్చోద్యమ గమనంలో నేటి క్లిష్టమైన అడుగులు.

 

ఈ వేకువ 4.30 కాకముందే 3 – 4 కిలోమీటర్లు ప్రయాణించి, వాట్సాప్ తొలి చిత్రంలో కనిపిస్తున్న 19 మంది ఎక్కడ నిలబడ్డారో గమనించారా? ఈ పెద్ద ఊరి తడి పొడి చెత్తల కుళ్ళు కంపుల కేంద్రమైన డంపింగ్ యార్డులో! స్వల్ప వ్యవధిలోనే వాళ్ళతో కలిసిన 14 మంది వెరసి ఈ 33 మంది 100 నిముషాల పాటు ఏం సంపాదించారు? (సారీ – ఏం సాధించారు) అని ప్రశ్నిస్తే కాస్తంత సామాజిక చైతన్యం, ఉన్న ఊరి పట్ల కొంతైనా శ్రద్ద - బాధ్యత ఉన్న వాళ్ళకే అది పూర్తిగా అర్ధమౌతుంది!

 

            పుట్టుకతో చల్లపల్లి వాళ్ళు కాక, ఉద్యోగ రీత్యా, గ్రామ స్ధుతి పట్ల ఆసక్తి దృష్ట్యా రోజూ వేకువనే ప్రక్క గ్రామాల నుండి వచ్చి మరీ ఇంతటి భీభత్స దుర్గంధం  నడుమ అక్కడి కుళ్ళు చెత్తను పెళ్లగిస్తున్న గ్రామ సింహాల ఊర పందుల సరసన ఈ డాక్టర్ల, ఉద్యోగుల, గృహిణుల, ట్రస్టు ఉద్యోగుల, వయోవృద్ధుల స్వచ్చ శుభ్ర సౌందర్య చర్యలెందుకో బాధ్యతగా, సానుభూతిగా ఆలోచించే కొద్దిమందికి తప్ప ఇప్పుడున్న అనాలోచిత, అయోమయ స్వార్ధ సహిత సమాజానికి అర్ధం కాకపోవచ్చు!

 

            ఇలా ప్రశ్నిస్తే వక్కాణిస్తే చాల మందికి వింతగా, కొందరికభ్యంతరకరంగా ఉండవచ్చు గాని, 365 రోజులూ 24 గంటలూ సొంత బ్రతుకు లాభం వెంట పరుగులెత్తడం తప్ప, గంటసేపైనా ఊరి కోసం పాటుపడని అధిక సంఖ్యాకుల నడుమ ఎడారుల్లో ఒయాసిస్ లాగా మండు వేసవిలో చిరుజల్లులాగా ఈ చల్లపల్లిలో నడుస్తున్న స్వచ్చోద్యమాన్నీ, తత్కార్యకర్తల నిరంతర బాధ్యతాయుత శ్రమదానాన్ని గుర్తించి, ప్రస్తుతించడం మాత్రమే నా ఉద్దేశం!

 

            మన గ్రామ స్వచోద్యమ నాటకంలో ప్రతి రోజూ జరిగే అంకం వేరు, నేటి కథ వేరు. మురుగు కంపులకీ, కశ్మల దౌర్భాగ్యానికీ అలవాటు పడిన ఈ కార్యకర్తలు కాక, కొత్తవాళ్లే గనుక ఈ పనిలో దిగితే- ముక్కులు మూసుకుని, కళ్ళు తిరిగి, వాంతులు చేసుకుని, దూరంగా పరుగెత్తే కథ ఇది!(తొలి నాళ్లలో ఇదే ప్రాంతంలో అలాంటి దృశ్యాలు బాగానే కనిపించాయి!) అందుకు మినహాయింపు తణుకు నుండి వచ్చి, గత రెండు మూడు నాళ్ళుగా వెనకడుగు వేయని-వెరవని పశు సంవర్థక శాఖ ఉద్యోగి సాయిబాబు. ఈనాటి భీకర భీభత్స చెత్త కేంద్ర పారిశుద్ధ్య సేవల్లో నన్ను బాగా కదిలించిన కొన్ని సన్నివేశాలు:

 

- నలుగురు స్త్రీ కార్యకర్తలు చీకట్లో శ్మశానం ప్రక్కన చీపుళ్లతో, గోకుడు పారల్తో డంపింగ్ రోడ్డునుఊడ్చి, గోకి, ఇదొక సిమెంటు రోడ్డేఅని నిరూపించడం.

 

- ఇంత వేకువ వేళ, ఇంతటి గాఢ దుర్గంధ వాతావరణంలో ఒకరితో ఒకరు పోటీ పడి, పరస్పరం ప్రోత్సహించుకొని 100 గజాల సిమెంటు దారిని బాగుచేయడం.

 

- ఐదారుగురైతే - పెద్దపెద్ద చెత్త గోనె సంచుల్ని సైతం అవలీలగా రోడ్డుకు దూరంగా దక్షిణానికి జరపడం.

 

            గంటన్నర కు పైగా కుళ్ళు చెత్తల, ఛండాలపు కంపుల మీద పోరాడినా సరే- తమ విజయానికి గుర్తుగానో, స్థైర్యానికి ప్రతీకగానో- పూల మొక్కల నడుమ గాక, తమ పోరాట క్షేత్రంలోనే సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు- ఈనాటి స్వచ్చోద్యమ చారిత్రక ఘట్టాన్ని వర్ణించడానికి డాక్టరు DRK గారికి సరైన మాటలే దొరక లేదు. మాలెంపాటి అంజయ్య మాత్రం ఆ నాలుగైదెకరాల ప్రదేశం మారుమ్రోగేంతగా ముమ్మారు స్వగ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సాధక సంకల్పాన్ని నినదించి, నేటి కార్యక్రమాన్ని ముగించారు!

 

            రేపటి వేకువ మన పారిశుద్ధ్య పోరాట ప్రదేశం- శ్మశానం దక్షిణపు ఎదుట.

 

         ఈ మహాత్ములకే ప్రణామం – 23

 

కశ్మలాలతొ భయోద్విగ్నత - అంటు జబ్బుల అధిక రుగ్మత

ఆహ్లాద లుప్తత తో అస్వస్తత - పారిశుద్ధ్యం లోప భ్రష్టత

క్రమ్ము కొచ్చిన సొంత ఊరిని కాపు గాసిన సాహసాత్మక

కార్యకర్తల ఉద్యమానికి ఘన నివాళులతో ప్రణామం!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

08.10.2021.