2252* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

గ్రామాభ్యుదయ చరిత్రలో 2252* వ పుట.

 

            14-10-21 వేకువ సమయాన ఊరికి దూరంగా శ్మశానాని కవతల - ఇంత పెద్ద ఊరి చెత్తంతా పోగుబడే చోట 4.22 వేళకే 19+4 = మొత్తం 23 మంది తలపెట్టిన రాచకార్యమేమంటే గ్రామ సామాజిక చైతన్య స్ఫోరకమైన, జన స్వస్తతా మూలకమైన, వేలాది దినాల చిరకాల పారంపర్యమైన శుభ్ర - సుందర ప్రయత్నమే!

 

            సాధారణంగా ఏ ఊళ్ళోనైనా ఈ దేవీ శరన్నవరాత్రుల వేకువలో - భక్తులు ఆలయాల దగ్గర ముక్తి కోసం, గృహిణులు ఇళ్ల పరిశుభ్రత కోసం, పూనుకోవడం సహజమేగాని - ఈ కార్యకర్తలు గ్రామ వీధుల మురికినీ, మురుగు కాల్వల నడకనూ, ఊళ్ళో రోడ్ల గుంటల బాగుచేతనూ, ఇదిగో ఇలా చెత్త కేంద్రాల శ్మశానాల సౌకర్యాల కోసం ప్రయత్నిస్తుంటారు. అందుకు గాను తమచెమటనూ, సమయాన్నిమేధస్సునూ నిస్సంకోచంగా ఖర్చుచేస్తుంటారు.

 

            గత ఏడెనిమిదేళ్లుగా చల్లపల్లి గ్రామస్తుల్లో కొందరి వైఖరి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఆలోచిస్తుంటే - వింతగా ఉంటుంది! ఒక ప్రక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చతో రామచంద్రా!" అని మొత్తుకుంటాయి; ఎవరిమేలుకోసం ఆ నినాదాలు మ్రోగుతుంటాయో- ఆ ప్రజలేమో వాటి నంతగా పట్టించుకోరు! కొండొకచో ఉపన్యాసాలిచ్చే నాయకులే అవి సులభంగా మరిచిపోతారు! ఆలోచనకు ఆచరణకు  అంతగా పొంతన కుదరదు! గ్రామాల్లో అంటు జబ్బులు,రుగ్మతలు పెరుగుటలో ఆశ్చర్యమేముంది?

 

తమ గ్రామోద్ధరణకు అంకితులైన ఈ కార్యకర్తలు మాత్రం  సచ్చ సుందరోద్యమ బాటలో యథావిధిగా ముందుకు పోతూనే ఉంటారు. వీధుల్లో చెత్త విరజిమ్మక-ఫ్లెక్సీలు పెట్టక - ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ వస్తువుల్ని సాధ్యమైనంతవరకు వాడక, మురుగు కాల్వల్లో ఖాళీ సీసాల్ని, ప్లాస్టిక్ సంచుల్ని విసరక, ఇతరులు విసిరితే చూస్తూ ఊరుకోక.... ఇవన్నీ వాళ్ల అలవాట్లు మరి!

 

            చిల్లల వాగు దక్షిణపు గట్టును, ఆటోనగర్ వైపు చెత్త కేంద్రం మొదట్లో ఉన్న ఖాళీని పట్టి పట్టి శుభ్రపరిచాక, అక్కడ చిందర వందరగా పడి ఉన్న కొన్ని సిమెంటు స్తంభాలను అందంగా పేర్చాక(ఒక రాతిని వేరు చేస్తుండగా ఒక రంపం విరిగిపోయి), మహిళా కార్య కర్తలు మరొకమారు మూడురోడ్లనూ ఉడ్చాక- ఉక్కపోత వాతావరణంలో చెత్త కేంద్ర దుర్గంధాన్ని భరించి, చెమటలు చిందించాక- కాఫీ- సరదా కబుర్లు కూడ ముగిశాక- ఈ 23 మందీ ఇబ్రహీం(ఈయన ఒకప్పటి నారాయణ రావు నగర్ స్వచ్చ-శుభ్రతా సాధకుడు) గారు ముమ్మారు చెప్పిన గ్రామ శుభ్ర-సౌందర్య నినాదాలు పలికి, నేటి తమ విధుల్ని ముగించారు.

 

రేపటి మన కార్యరంగస్థలం చెత్త సంపద కేంద్ర దక్షిణ భాగమే!

 

             ఈ మహాత్ములకే ప్రణామం 27

ఏపనెప్పుడు చేయవలెనో-ఏది ఫలితం ? చెడో మంచో

 కార్యకారణ పూర్వపరములు గమనమందున నిల్పుకొంటూ

దీర్ఘ స్వచ్చోద్యమం కోసం తెగువ చూపిన- నిలిచి గెలిచిన

స్వచ్ఛసుందర కార్యకర్తల జాగృతికి చేసెద ప్రణామం! -

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

14.10.2021.