2254*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

 2254 * వ (శనివారం) నాటి సామూహిక శ్రమదానం!

 

సంక్రాంతైతేనేమీ – దేవీ శరన్నవరాత్రులైతే నేమీ- చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శ్రమ విరాళం లో ఏ మార్పూ ఉండదు.  అలాగే అది మురుగుకాలవైనా – శ్మశానమైనా స్వచ్చ సుందరీకరణ దీక్షలో కూడ ఏ మార్పూ కనిపించదు. ఆ విధంగా ఈ వేకువ 4.21 కే 30 మందితో కొనసాగిన శ్మశాన స్థలి పరిసర పరిశుభ్రతా చర్యలు – ఏడేళ్ళ మొదలు 67 ఏళ్ల వయసున్న శ్రమదాతల అకుంఠిత సేవ ఎవరైనా చూడదగిందీ, మెచ్చదగిందీ, అనుసరించదగిందీ.

 

శ్మశానాంతర్భాగమైన దహన వాటికల దగ్గర ఇదిగో ఈ పిల్లలు, కులీన స్త్రీలూ, ఎంత నిర్భయంగా  చీకటిలోనే కత్తులతో పిచ్చి మొక్కలను నరుకుతూ నరికిన తుక్కును దంతెలతో గుట్టలుగా లాగుతూ, కొందరా గుట్టలను చెత్త కేంద్రానికి చేరుస్తూ ఎలా ఆనందిస్తున్నారో గమనించారా?

 

ఇక ఇందులోని వృద్ధులు, యువక ఉద్యోగులతో, రైతులతో పోటీ పడుతూ ఆటోనగర్ ప్రక్కన  నడుం వంచి – కూర్చొని – పిచ్చి మొక్కల్ని, కంచెమీదికెగబ్రాకుతున్న ముళ్ల తీగల్ని  తొలగిస్తూ పాటుపడుతున్న వైనాన్ని కూడ చిత్తగించండి.

 

మహిళా మూర్తులు కొందరు అదే పనిగా చీపుళ్లతో మూడు వైపులా సిమెంటు రోడ్లను ఊడుస్తున్న స్వచ్చ, శుభ్ర పరిశ్రమను వీలైతే మీమీ వీధులలో పాటించండి.

 

వాట్సాప్ చిత్రాలను చూసే వాళ్లకు, ఇతర మాధ్యమంలో చదివే వాళ్లకు ఈ స్వచ్చోద్యమ రేయింబగళ్ల ప్రయత్నం ఎంతో కష్ట సాధ్యమనిపిస్తుందేమో! ఐతే చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు ఇదంతా అలవాటైన శ్రమ వినోదం మాత్రమే!

 

          6.30 సమయంలో మన స్వచ్చ వైద్యుని సమీక్షా సమయానికి ముందు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని లంకే సుభాషిణి ముమ్మారు ముక్తాయించిన గ్రామ స్వచ్చ- శుభ్ర- సౌందర్య నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసి –

 

రేపటి మరింతమంది కార్యకర్తల శ్రమదానం కూడ శ్మశానం చుట్టుకునే జరుగుతుంది గనుక మన కలయిక  ఈ చిల్లల వాగు గట్టునే!

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

16.10.2021.