2255*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?

 

31 మంది దాన వీరుల 2255* వ నాటి శ్రమసందేశం.

 

10 రోజులకు పైగా చెత్త కేంద్ర- అపూర్వ శ్మశాన కేంద్రాల దగ్గర కనిపించిన - శ్రమదాన వైభవమే-

 ఈ ఆదివారం(17-10-2021) వేకువ కూడ పునరావిష్కృతమైంది.

 

- విజయవాడరహదారి-చిల్లల వాగు వంతెన కేంద్రకంగాను శ్మశానాంతర్గతంగాను- ద్విముఖంగా ప్రవర్తిల్లిన స్వచ్ఛ సుందరీకరణ ప్రయత్నం( గ్రామ సరి) హద్దులు మీరి వక్కలగడ్డ పరిధిలోకి చొచ్చుకు పోయింది కూడ. (ఇలా వీళ్లు హద్దులు మీరి చల్లపల్లికి చుట్టూ 10 -15 కి.మీ. వెళ్లడం గతంలో చాలమార్లు జరిగింది!)

 

ఎంతో ప్రాచీనకాలంలో సంభవించిన- 18 పర్వాల-18 అక్షోహిణుల సైన్యాల, 18 రోజుల మహాభారత కథ ఒకటున్నది. ఇప్పుడిక మన సమకాలంలో – చల్లపల్లి లో 2255*రోజుల - 2లక్షల* పనిగంటల- వందలాది గ్రామ వీధుల- మురుగు కాల్వల – శ్మశనాల- నిస్వార్థ పారిశుద్ధ్య ప్రత్యక్ష కథ కూడ ఉన్నది. రెండు కథల్నుండి సానుకూల సందేశాన్ని స్వీకరించే - ఆచరించే సహృదయుల అవసరమే మిగిలున్నది!

 

 అదేదో సినిమా పాటలో ” ఆగట్టునుంటావా-నాగన్న ఈగట్టు కొస్తావా?... అని జోరుగా ప్రశ్నించినట్లే  స్వచ్ఛంద శ్రమదాతలు కూడ చల్లపల్లిలోని 5000 ఇళ్ల వారినీ పేరుపేరునా ప్రతిరోజూమురికిలోనె ఉందామా- ఓ సోదరా! "స్వచ్ఛ- శుభ్రతకు పూనుకొందామా!....” అని ప్రశ్నించి, ఒప్పించాల్సి ఉన్నది!  

 

30 మంది కార్యకర్తల శ్రమ ఈ ఆదివారం వేకువ ప్రత్యక్షంగానో – పరోక్షంగానో గ్రామానికి ఏమి సాధించిందని ప్రశ్నించుకొంటే:

 

- వీరిలో మహిళల్తో సహా 17 మంది 10 రోజుల్నాడు శ్మశానంలో స్వచ్ఛ-శుభ్ర- సుందరీకరించిన చోటనే – సెంటిమెంట్లనధిగమించి, భయ సంకోచాలకు స్వస్తి పలికి - గొర్రులు, పారలు, చీపుళ్లతో గడ్డి తొలగించి, చుట్టూ చెట్లకొమ్మల్ని సుందరీకరించి, కొన్ని పండ్ల మొక్కలకు పాదులు సరిదిద్ది, శ్మశాన సౌందర్యానికి న్యాయం చేశారు.

 

 - తరిగోపుల ప్రాంగణం దగ్గరి చెట్లకొమ్మల్ని నిచ్చెన సాయంతో అందగించి, చిల్లలవాగు వంతెన పరిసరాల్ని శుభ్రపరిచి, వాగుకు ఉత్తరగట్టున వికారంగా ఉండే ముళ్ల - పిచ్చి మొక్కల్ని తొలగించే కృషి 12 మందిది!

 

6.25 దాటాక-కాఫీ కాలక్షేపం ముగిశాక- నేటి స్వచ్చోద్యమ పూర్వాపరాల సమీక్షకు ముందు- విస్పష్టంగా మూడుమార్లు తన నివాస గ్రామ స్వచ్ఛ స్వస్త-సుందరీకరణల ఉద్దేశాన్ని నినదించినది - ఒక వస్త్ర వ్యాపారి - గోళ్ల వేంకటరత్నం.  మండలి బుద్ధప్రసాద్ గారి పనుపున స్వచ్ఛకార్యకర్తలను సగౌరవంగా “వేంకట్రామ్- సాయి సుప్రియ ల పరిణయ వేడుకకు ఆహ్వానించినవారు రావి చిట్టిబాబుగారు!

 

బుధవారంనాటి వేకువ మన శ్రమదాన బాధ్యతా కేంద్రం కూడ అందమైన ఈ శ్మశాన స్థలమే!

 

  ఈ మహాత్ములకే ప్రణామం  29

 

 ఎన్నాళైనా ఆగని ఈ స్వచ్ఛ శ్రమదానం

ఊరు బాగుపడేదాక ఉద్యమించి ప్రతిదినం

ఈ వినయం- ఈ సహనం – ఈ శ్రమజీవన తత్త్వం

ఎప్పటికీ ఆదర్శమే - ఈచరితకు ప్రణామం!

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

17.10.2021.