2282* వ రోజు.......

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

పునర్నవోత్సాహంతో 2282*వ నాటి రహదారి పారిశుద్ధ్యం.

 

          ఐదుగురు మహిళల్తో సహా - 22 మంది దృఢ దీక్షా సమన్వితులు 2 గంటలపాటు - అనగా సుమారు 40 పని గంటలు నిర్వహించిన వీధి పరిశుభ్ర - సౌందర్య పూజతో నడకుదురు బాటలోని శ్రీనగర్‌ నుండి కోమలా ధియేటర్ దాక మరొకమారు బాగుపడింది. రోడ్డుమీది, ప్రక్కల పేరుకొన్న దుమ్ము – ఇసుక – ఎంగిలాకులు - ప్లాస్టిక్ తుక్కులు - ఆకులలములన్నిటికీ శనిపట్టించారు.

 

          వందలాది చిన్నా పెద్ద రోడ్లతో ఈ ఊరెంత పెద్దది? ఏడెనిమిదేళ్ల నుండి ఈ పాతిక ముప్పైవేల + పొరుగూళ్ల నుండి వచ్చిపోయే ఆరేడువేల మందిలో బాధ్యత పట్టక కాలుష్యాలు విరజిమ్మే అసంఖ్యాకుల దుశ్చర్యకు సమాధానం చెప్పుతున్న 25 - 40 - 50 మంది కార్యకర్తల దైనందిన ప్రతిచర్యకు లక్షల ధన్యవాదాలు!

 

          మంచులు – ఎండలు - వానలు - వడగాలులు... ఎన్ని వచ్చిపోతున్నా చల్లపల్లిలో మోహరిస్తున్న రెండు వర్గాలు - అటు కాలుష్యం వెదజల్లేవారు, ఇటు కశ్మలాలను తుదముట్టించి, పరిశుభ్ర – సౌందర్యారాధన చేసేవాళ్ళు - ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. పురాణాల్ని, చరిత్రల్ని, సంప్రదాయాల్ని పరిశీలిస్తే మాత్రం అంతిమ విజయం ఎవరిదో తెలుస్తూనే ఉంటుంది - ఏనాటికైనా ఈ 3 లక్షల పనిగంటల శ్రమదాతలదే పై చేయి కాక తప్పదు! కాస్త ఆలస్యమైతే అవుతుంది గాని - న్యాయానికి గెలుపు నిశ్చయమే!

 

          అననుకూల పరిస్థితుల్లో సైతం - ఇందరు కార్యకర్తలు తమవీధుల్లో, తమ నివాస పరిసరాల్లో ఇన్నాళ్లుగా - ఇన్నేళ్లుగా ఉమ్మడి సంక్షేమం కోసం, స్వస్తత కోసం ఎందుకు శ్రమిస్తున్నారో - అసలు వాళ్లది పాపమో, పుణ్యమో కోమలానగర్ నివాసులు, దుకాణదారులు ఆలోచించడమూ - చర్చించడమే నేను కోరుకొనేది! చల్లపల్లి స్వచ్చోద్యమం ఒక తమాషాకాదనీ, ముదురుతున్న వెర్రి కానేకాదనీ, పనికిమాలిన - తోచీతోచని ఫార్సు కూడ అసలే కాదనీ మా సోదర గ్రామస్తులు 100% నమ్మే రోజుకోసమే మేం ఎదురు చూసేది!

 

          గ్రామ సుందరీకర్తలు గాని, రెస్క్యూ దళం కాని, కత్తుల – దంతెల - చీపుళ్ల - గోకుడు పారల స్వచ్చ కర్మిష్టులు గాని... ప్రతిరోజులాగే ఎవరి ధ్యాస, నిష్ట, వాళ్లదే. అందుకే ఈ సూర్యోదయ వేళలో 150 గజాల రహదారి ఇంత సుందరంగా

కనిపిస్తున్నది.

 

          ఈ బుధవారం నాటి కృషిని సమీక్షించిన డాక్టర్ రామకృష్ణ ప్రసాదు గాని, గ్రామ స్వచ్చ - సౌందర్య భవితవ్యం ఆకాంక్షిస్తూ ముమ్మారు నినదించిన భోగాది వాసు మాస్టరు గాని.. అందరిది ఏకోన్ముఖ లక్ష్యమే! ఎక్కడో అమెరికాలో ఉంటూ తన ప్రాంత స్వస్తతను ఏ ఒక్కనాడూ మరువని మండవ శేషగిరిరావు గారి తపననే చూడండి – ప్లాస్టికేతర పర్యావరణహిత వస్తువుల్ని తెచ్చి,  ప్రచారంచేసే అతని దీక్షను గమనిద్దాం!

 

          12.00 సమయంలో కారకర్తలందరం మోపిదేవిలోని విశ్వనాధపల్లి వేంకట శేష రాజా రవివర్మ గారి ఇంటి నూతన వధూవరుల్ని ఆశీర్వదించి. – ఆతిధ్యం అందుకోవడానికి – ఏకరూప దుస్తులతో వెళ్లవలసి ఉన్నది!

 

          రేపటి వేకువ మన పాలిటి వీధి పారిశుద్ధ్య ప్రాంతం నడకుదురు రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద !

 

          ఆరుగాలం - ఎనిమిదేళ్లూ.

 

తీసుకొనుటే తప్ప ఇవ్వని తీరు మార్చిన ధన్యజీవులు

ఎనిమిదేళ్లుగ - ఆరుగాలం స్వార్థ మెరుగని స్వచ్ఛ వీరులు

వారి వలనే మేలు పొందుచు వాళ్ల నెట్టుల విస్మరింతువు?

అనుసరింపుము - అనుకరింపుము స్వచ్ఛ సైన్యం అడుగుజాడలు!

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

 

24.11.2021.

అమెరికా నుండి శేషగిరిరావు గారు తీసుకొచ్చిన భూమిలో కరిగే ప్లేట్లు, గ్లాసులు, స్ట్రాలు, క్యారీ బ్యాగ్ లు ను స్వచ్చ కార్యకర్తలకు చూపిస్తున్న వాసు మాస్టారు. ఇవి మొక్కజొన్నలతోనూ, చెరుకుపిప్పితోనూ చేసిన పర్యావరణ మిత్ర వస్తువులట!