2284* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడం...

2284* వ నాటి వేకువ గ్రామ వీధి స్వచ్చోద్యమ కథనం!

          శుక్రవారం - అప్పుడే మంచు ముదురుతున్న 4.19 సమయాన 15 మంది గ్రామ బాధ్యుల కాలుష్య వ్యతిరేక కదన కుతూహలాన్నీ, నాలుగైదారు నిముషాల్లో వాళ్ళకు తోడైన పదిమందినీ, ఈ తెగించిన పాతిక మంది 6.12 దాక ఇస్లాం నగర్ నుండి బండ్రేవు కోడు కాల్వ వంతెన దాక సృష్టించిన పెను కాలుష్య విధ్వంసాన్ని చూడగల్గినందుకు ఈ ఊరి సీనియర్ సిటిజన్ గా చాలా గర్విస్తున్నాను!

          ఈ వీధి పొడవునా లోతైన పెద్ద డ్రైను నిండా విద్యుత్ శాఖ కార్మికులు నరికి పడేసిన చెట్ల కొమ్మలు, ఆకులు- అవి మురిగి, చివికి విరజిమ్మే ఘాటైన దుర్గంధం, వాట్సప్ చిత్రాల్లో కనిపిస్తున్నాయా? రెండు గంటల పాటు ఈ 100 గజాల వీధిలో స్వచ్చ శ్రమదాతలు నానా దుర్భర కశ్మలాల మీద ఎంతగా తిరగబడి, ప్రయాసపడి ఒక బక్క BSNL విశ్రాంత వీరుడైతే (ఇతడు కొన్నాళ్ళ క్రితం విద్యుద్ఘాతాన్ని జయించాడు కూడ!)  చీకట్లోనే ఎత్తైన చెట్టెక్కి కొమ్మలు నరికాడో కాలుష్యం మీద ఉక్రోషంతో మహిళా కార్యకర్తలు సైతం ఎంత తెగింపుతో, కసితో మురుగు లాగి, కొమ్మల్ని ఒడ్డుకు చేర్చి శ్రమించారో నేను ప్రత్యక్షంగా చూశాను!

          “ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?

          నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...”        

అని కదా మహాకవి ప్రశ్నించాడు?

          2284* దినాల నుండి గ్రామ స్వస్తత కోసం పెనుగులాడుతున్న స్వచ్చ కార్యకర్తల్లో

          “ఏ ఒక్కరి పోరు చూసినా ఎంతెంతో గర్వ కారణం

          స్వచ్చోద్యమ చరిత్ర సమస్తం ఊరుమ్మడి సౌఖ్యం కోసం...

అని ఎలుగెత్తి అరిచి ప్రకటిస్తాను!

          ఈనాటి  స్వచ్చంద శ్రమదాతల కృషి వివరాలెందుకు గాని, వీలైన ప్రతి గ్రామస్తుడూ ఇస్లాం నగర్ నుండి కీర్తి ఆస్పత్రికి వెళ్ళే బాట నొక్కమారు చూడండి! పాతిక మంది స్వచ్చోద్యమకారులు 50 పని గంటలు లాగి, ఊడ్చి, డిప్పలకెత్తి, డంపింగ్ యార్డుకు చేర్చిన ఒక పెద్ద ట్రాక్టరు వ్యర్ధాలనూ చూడండి! పనిలో పనిగా ఆ వీధిలో నిన్నటికీ ఈ ఉదయానికీ వచ్చిన మంచి మార్పేదో అదెంత ఆహ్లదకరమో ఆరోగ్యదాయకమో అత్యవసరమో కూడ అంచనా వేయండి!

          కాఫీ తదనంతర సమీక్షా సమయంలో తొణకక బెణకక తమ ఊరి శుభ్ర స్వచ్చ- సౌందర్య సాధనా సంకల్పాన్ని నినదించిన దెవరంటే - అది 83 ఏళ్ల డాక్టర్ మాలెంపాటి గోపాల కృష్ణయ్య.

          రేపటి వేకువ వీధి పారిశుద్ధ్యం కోసం మనం మళ్ళీ కలిసి శ్రమించవలసిన చోటు సాగర్ ప్రదర్శనశాల ఉపమార్గంలోని కమ్యూనిస్ట్ వీధి దగ్గరే! 

          ఇదే చివరి అవకాశం.

అవకాశం వేల మార్లు అందరికీ రాదు సుమా!

జన్మభూమి ఋణం తీర్చు సదవ కాశమిప్పటికీ

స్వచ్చోద్యమ చల్లపల్లి కల్పిస్తుం దందరికీ

ఆదరించి తలదాల్చుడు స్వచ్ఛ సైన్య రీతులన్ని!  

  

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

26.11.2021.