2286* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

నిర్విరామ చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2286* వ నాడు.

 

          అది గ్రామ శుభ్ర- సుందరీకరణ ఉద్యమమో- వినోదమో లేక వ్యసనమోగాని, ఏడెనిమిదేళ్ల నుండి ఇదేతంతు! ఎప్పటిలాగే ఈ వేకువ సైతం 4.20 కే 33 మంది కాబోలు- విజయా కాన్వెంటు సమీపాన చీపుళ్లు, దంతెల వంటి ఆయుధాలతో మురికి వీధుల కాలుష్యం మీద యుద్ధ సంసిద్ధులైపోయారు! మళ్లీ ఇందులో 10 మందికి పైగా పూర్తిగానో- పాక్షికంగానో వైద్య శిబిరంలో వివిధ సేవలకు పాల్పడ్డారు! 

          బాధ్యతలు మోస్తున్నారనుకొంటే చాలు - ఎక్కడెక్కడి సామాజిక అవసరాలూ-మురుగు కాల్వలో, కళా కాంతీ లేని వీధులో, వైద్యశిబిరాలో, హరిత సౌందర్యాలు లోపించిన రహదారులో, లేక రెండేళ్ల నుండీ అనాథలుగా అఘోరిస్తున్న ప్రధాన వీధుల గుంటలో... అన్నీ, ఈ స్వచ్చంద శ్రమదాతల్నే చప్పట్లు కొట్టి, కేకలేసి పిలుస్తూనే ఉన్నాయి! వాళ్లు కూడ మంచి సమన్వయంతో అన్ని కర్తవ్యాలనూ చాలవరకు నెరవేరుస్తూనే ఉన్నారు!

 

          ఆ క్రమంలోనే ఈ గృహిణులు ఇలా చీపుళ్లు పట్టి రోడ్లు ఊడుస్తున్నారు; క్షణం తీరిక చిక్కని పెద్ద డాక్టర్లు డిప్పలతో వీధి వ్యర్థాలను ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారుచీకూ చింతా లేకుండా - గ్రామ స్వస్తత మాటే తలచకుండా నిద్రించే కొందరు అస్మదీయ సోదరులకు భిన్నంగా అమెరికాలో ఉంటూనే అనుక్షణం ఇక్కడి పర్యావరణ రక్షణకూ 30 వేల గ్రామ ప్రజల స్వస్తతకూ కొందరు అంకితులైపోతున్నారు! ఎవరి అలసత్వాన్ని-  బాధ్యతారాహిత్యాన్ని ఎవరు ఎంతగా భర్తీ చేస్తున్నారో- ప్రతిచర్యలో మునిగారో చూడండి!

 

          ఇంత చలి వేకువలో చాలమందిలా ముసుగు తన్ని నిద్రించక 83 ఏళ్ల ఒక డాక్టరు గ్రామ మెరుగుదల  కోసం రోడ్డెక్కి, తోచిన- చేతనైన ప్రయత్నాన్ని, వంచిన నడుమెత్తక పారలతో దంతెలతో అపరిశుభ్రత కోసం పాటుబడే 20 మంది కృషిని గ్రామస్తులెలా అర్థం చేసుకొంటున్నారో తెలియదు! అమెరికా నుండి వచ్చి, సొంత కష్టార్జితంతో  బయోడిగ్రేడబుల్ వస్తువుల ఉత్పత్తికై, వినియోగానికై ప్రయత్నిస్తున్న ఒక మండవ శేషగిరి రావును ఎవరూ  ఆదర్శంగా తీసుకోరా? సహకరించరా?

 

       ఇరవై మందికి పైగా స్వచ్ఛ సంస్కృతీ పరుల ప్రయత్నంతో- ఈ వేకువ 2 గంటల వ్యవధిలో విజయవాడ రోడ్డులో విజయా కాన్మెంట్ పరిసరాలు-వానలకు బురద కూపాలుగా మారిన గుంటల్తో సహా బాగా మెరుగు పడ్డాయి. అదే మరి ఈ శ్రమజీవన విధాతల నిత్య సంతృప్తి!

 

          6-30 వేళ సమీక్షా సమావేశానికి ముందు తన నేటి పారిశుద్ధ్య కృషితో పొందిన మహదానందాన్ని ఒక కర్షక స్వచ్చకార్య కర్త-మాలెంపాటి అంజయ్య పాటలుగా వినిపించాడు. ఆవిధంగా చల్లపల్లి స్వచ్చోద్యమానికి మరొక గాయకుడు లభించినట్లే!

 

          అమెరికానుండి వచ్చి, మొవ్వ నుండి ఈ వేకువ విచ్చేసిన మండవ శేషగిరిరావు గారి గ్రామ స్వచ్ఛ శుభ్ర- సౌందర్య సంకల్ప, నినాదాలూ, ఇక్కడి పేద విద్యార్థులకు చేయూతలో, పర్యావరణ భద్రతలో ఆయన అభిప్రాయాలూ కార్యకర్తలు హర్షించారు.

 

          బుధవారం నాటి వేకువ మన శ్రమదాన క్షేత్రం మళ్లీ ఇస్లాం నగర్ ప్రాంతమే! దాన్ని మరింతగా హరిత పుష్ప సౌందర్య సంపన్నం గావించడమే!

 

          ధన్యుల కభివందనం!

బ్రహ్మ ముహూర్తము నుండే గ్రామ బాధ్యతల భారం

సమయ-ధన-శ్రమ త్యాగ సంసిద్ధత నీ నైజం

ప్రజా స్వస్తతకు తపించు నీ వెందరి కాదర్శం?

ధన్యుడవోయ్! స్వచ్చ శ్రమ దాతా! అభివందనం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

28.11.2021.