2334* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

సోమవారం నాటి రెస్క్యూదళ గ్రామ సేవలు - @2334*

            17-1-22 నాటి వేకువ సైతం స్వచ్చోద్యమ పతాకం ఎగిరింది! రెస్క్యూ టీమ్ సభ్యులు తక్కువే గాని, ట్రస్టు కార్మికులు, రాజ్యలక్ష్మి ఆస్పత్రి వీధి స్థానికులు వాళ్లతో కలిసి వచ్చి మద్దతు తెలపడంతో కనీసం రెండు చోట్ల వీధి భద్రతా కృషి సఫలమయింది!

            డంపింగ్ కేంద్రానికీ బందరు జాతీయ రహదారిలోని SBI కీ 3 ½ కిలో మీటర్ల దూరం! చిల్లలవాగు ప్రక్కన పోగేసిన తారు పెచ్చుల్నీ, రాతి ముక్కల్నీ టాటా ఏస్ లో ఎక్కించడంతో మొదలైన కార్యకర్తల ప్రయత్నం బందరు మార్గంలోని రోడ్డు గతుకుల్ని సరిచేయడంతో ముగిసింది!

మీరు గనుక జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ మాధ్యమం పరిశీలిస్తే -

1) రాజ్యలక్ష్మి వైద్యశాల వీధి మొదట్లో నిన్నటి దాక కనిపించిన గుంటలు ఈ ఉదయం 6.30 తరువాత ఇక కనిపించవు!)

2) ఇదే రహదారిలో తూర్పుగా కిలోమీటరు దూరాన - జూనియర్ కళాశాల ఎదుట గల వేగ నిరోధకాల వద్ద గుంటలకు సైతం ఇప్పుడు మోక్షం వచ్చింది! గ్రామ వీధులెందుకెంత శుభ్ర - సుందరంగా ఉంటాయనే ప్రశ్నకు చల్లపల్లిలో సగానికి పైగా జనం ఠక్కున సమాధానం చెప్పేయగలరు -

స్వచ్ఛ కార్యకర్తల చలవే అది...అని!

ఎప్పటికప్పుడు ఊరి రోడ్ల గుంటలు ప్రభుత్వం వారు పూడిపించి, మరా మత్తులు చేయిస్తున్నారే...అంటే కూడ

అబ్బే - స్వచ్ఛ కార్యకర్తల్లోనే ఒక ముఠా ఉంది - ‘రెస్క్యూటీమ్అని! ఈ మరా మత్తులు వాళ్ల పనిలేఅని కూడ జనం బదులిస్తారు!

            ఇవన్నీ ఐదారేళ్లుగా జరుగుతున్న పనులే గాని, నేటి ఒక విశేషమేమంటే - చంటి హోటల్ యజమానులైన ఆలుమగలు ఈ గ్రామ భద్రతా దళానికి పూర్తి సహకారమందించి, పోటీపడి పనిచేయడం!

            ఎనిమిదేళ్ల నుండి స్వచ్చోద్యమకారులు గ్రామస్తుల్నుండి ఆశిస్తున్నది ఈ సంఘీభావాన్నే! ఇది అన్ని వీధుల - అందరు గృహస్తులకూ వర్తించాలనే కార్యకర్తల చిరకాల వాంఛ!

            6.30 కు తమ లక్ష్య సాధన తరువాత - స్వగ్రామ మెరుగుదల కృషిని స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య నినాదాలుగా ప్రకటించినది మాలెంపాటి అంజయ్య!

           

          స్వచ్ఛ బీజముల మొలకలు

విరివిగనే నాటినారు - వీధులు, రహదారులందు

హరిత వర్ణ సుందరమగు అన్ని వేల మొక్కలు

వేన వేల గ్రామస్తుల హృదయాలలొ వీరు నాటు

స్వచ్ఛ బీజముల మొక్కలు పుష్పించే దెన్నడో!

 

- నల్లూరి రామారావు

 

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  17.01.2022.