2335* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

మంగళవారం నాటి మరొక రోడ్ల మరమ్మతు కార్యక్రమం! @2335*.

            18-1-2022 వ నాటి ఉషోదయాన రెండు ముఖ్య రహదార్లలో మళ్లీ అదే దృశ్యం! అది నిన్నటి వలెనే 4.30 కే చిల్లలవాగు గట్టు మీది డింపింగ్ యార్డు దగ్గర మొదలయింది! రెస్క్యూ దళ త్రిమూర్తులు ఒక ట్రస్టు కార్మిక సోదరుని సాయంతో తారు పెచ్చుల సేకరణతో ప్రారంభం!

            ఈ టీమ్ గురించి మనం అర్థం చేసుకోవలసిందేమంటే ఊరి మురుగు కాలవేదైనా కట్టు తప్పి, గతి మార్చు కొంటేనో రోడ్ల మీద ఆక్రమణల భాగోతం జరుగుతుంటేనో ఏ రోడ్డు మీదైనా కొత్తగా గుంటలు పడి ప్రయాణాలకు ప్రమాదమనిపిస్తేనో - వాళ్లు సహించలేరు! అవసరమైతే వాటిని ట్రస్టు ఖర్చుతోనో సొంత ఖర్చుతోనో చక్కబెట్టే దాక మనశ్శాంతి ఉండదు. మరి, ఈ బండ పనులు చేయక తప్పేదేముంది?

            రాజమండ్రికి చెందిన - ప్రస్తుత భాగ్యనగర నివాసి రోడ్ల డాక్టర్ గా పేరొందిన (తిలక్) ఒకాయనా ఇంతే! 70 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ జీతం భత్యం లేని తన ఈ ఉద్యోగాన్ని వదలుకోవడం లేదట! ఆయన 3 ఏళ్ల క్రితం చల్లపల్లి కూడ వచ్చి, స్వచ్చ కార్యకర్తలకు ఆ క్రొత్త జబ్బును అంటించి వెళ్లాడు! సారా బాబుల - పేకాట వాళ్ల - సామాజిక చైతన్యరహితుల దృష్టిలో బహుశా పై పనులు చేసే వాళ్లు పాత కాలపు వెర్రివాళ్లేమో!

            NTR పార్కు ఎదుట రహదార్ల కూడలిలో ఏర్పడి, వాహన చోదకులకు పంటి క్రింద రాయిలా మారిన గుంట సంగతినే ఈ రెస్క్యూ టీమ్ ముందుగా ఈ వేకువ రిపేరు చేసింది.

            RTC ప్రాంగణ ప్రవేశ మార్గంలోని మరొక గుంట కూడ ఆ పిదప బాగుపడింది!

            నేటి వీళ్ల మూడవ ప్రయత్నం అవనిగడ్డ మలుపులోని పోతురాజు గుడి ఎదుటి పొడవాటి గొయ్యి!

            పై మూడు చోట్ల కూడ ఏ స్థానికులైనా సానుకూల స్పందనతో వచ్చి సహకరిస్తే ఒట్టు!

            తమ నేటి లక్ష్యం నెరవేరాక - గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర - సౌందర్య నినాదాలను ప్రకటించినది కస్తూరి శ్రీనివాస్!

            రేపటి బందరు రహదారి పారిశుద్ధ్యం కోసం వేకువనే కార్యకర్తలందరం కలువవలసిన చోటు - రాజ్యలక్ష్మి వైద్యశాల వీధి మొదట (చంటి హోటల్ వద్ద)!

 

           ఎందులోన ఆత్మ తృప్తి?

ఈ జీవన పోరాటము లెప్పటికీ ఉండునవే

ఆదర్శ శ్రమదానం అది రోజుకు ఒక గంటే

స్వచ్ఛ మాన్య చల్లపల్లి సాధించగవచ్చునే!

అనురక్తి - ఆత్మ తృప్తి అందులో లభించునే!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  18.01.2022.