2337* వ రోజు.......

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమంలో ఇది 2337*వ ప్రయత్నం!

          గురువారం (20-1-22) నాటి వేకువ సైతం 4.17 కే స్వచ్ఛ సైనికుల కృషి ప్రారంభం. 17 మంది సామాజిక కర్తవ్య పరాయణులతో అది 6.17 దాక. గౌతమీ టెక్స్టైల్స్ (యడ్లవారి వీధి) నుండి బందరు మార్గంలో పోలీస్ స్టేషన్‌ బజారు దాక కొనసాగింది. వారి శ్రమదాన ఫలితంగా ఒక ట్రక్కు ఇసుక - దుమ్ము, 200 ML ఖాళీ కిక్కు సీసాలనుకొంటా అవొక బుట్టెడు, కొన్ని ప్లాస్టిక్ సంచులు దొరికాయి.

          ఇసుక - దుమ్ముల మిశ్రమమేమో రహదార్ల మార్జిన్ల గుంటలకు సర్దబడి, ఇతర వ్యర్ధాలన్నీ డంపింగ్ కేంద్రానికి చేరుకొన్నాయి! ఇందుకు గాను నలుగురు చీపుళ్ల వారు, నలుగురు డిప్పల వారు, దంతెలతో ఇతరులు శ్రమించారు.

          ఇన్ని వేల దినాల - ఇన్ని లక్షల పని గంటల ఎడతెగని స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధక పరిశ్రమలో ఉత్పత్తి కావలసినవి

1) 30 కి పైగా ప్రధాన వీధుల్లో కంటికింపైన పచ్చదనాలు,

2) అన్ని ఇళ్ల పరిసరాల్లో ఆహ్లాద సానుకూలతను పెంచే పూల మొక్కలు,

3) కళకళలాడే తీరైన బాటలు,

4) పైకి కనపడని - భూగర్భ మురుగులు,

5) మాయమైపోదగిన ఈగలు - దోమలు......

          కార్యకర్తల స్వచ్ఛ పరిశ్రమతో ప్రతిరోజూ 2 గంటల పాటు ఉప ఉత్పత్తి ఔతున్నదేమో (By product) డబ్బుతో కొలవలేని ఆత్మ సంతృప్తి! ఈ ఉద్యమం నుండి రాదగిన అసలు సిసలు ఉత్పత్తులేమంటే - ఊరిలో సగంమంది కిప్పటికీ లేని సామాజిక స్పృహ, ఊరి ఉమ్మడి మేలుతోనే ఏ ఒక్కరి స్వస్తతైనా సాధ్యమనే అవగాహన....

- నేటి 100 గజాల పరిశుభ్ర - సుందరీకృత రహదారిలోనే - క్రిందా, పై అంతస్తుల్లోనూ కలిపి ఏ 30 దుకాణాలో ఉన్నాయి. ఉత్తరం దిక్కున రెండు ఇరుకు వీధులున్నాయి. ప్రధాన రహదారి క్షుణ్ణంగాను, సందుల మొదట పాక్షికం గాను ఈ కొద్దిమంది కార్యకర్తల శ్రమతోనే ఇంత శుభ్ర - సుందరంగా మారిపోయినవి!

- పై అంతస్తు వాళ్ళు ఊడ్చిన వ్యర్ధాలు క్రింద పడవేయకుంటేనూ, రోడ్డు ప్రక్క చిరు వ్యాపారులు తాము వాడుకొన్న చోటుల స్వచ్ఛ - శుభ్రతల్ని నిలుపుకొంటేనూ - స్వచ్ఛ కార్యకర్తల దైనందిన శ్రమను కాస్త తగ్గించిన వాళ్లు అవుతారు!

- ముగ్గురు శ్రమదాతలు పోలీసు స్టేషను వీధిలో కొంత భాగాన్ని బాగుచేశారు.

- ఇద్దరేమా ఆ వీధి మొదట్లో గుంటల్ని రాతి పలకల్తో, దాని మీద మట్టితో పూడ్చి రద్దీ వాహనాలకు సౌకర్యాలు సమకూర్చారు....

- ఒకామె టీ కొట్ల వాళ్లకు కౌన్సెలింగ్ చేస్తే - మరొక కార్యకర్త సంత వీధి ఎదుట దుకాణాల, టిఫిన్ బళ్ళ, టీ - కాఫీ కప్పుల్ని ఊడ్వడం కనిపించింది.

          6.45 కు గ్రామ స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలను శివరామపురం రైతు - మల్లంపాటి ప్రేమానందం వినిపించారు.

          రేపటి వేకువ మన వీధి పారిశుద్ధ్య బాధ్యతల కోసం సంత బజారు ఎదుట ఆగి, ప్రయత్నిదాం!

 

          స్వచ్చోద్యమ బాసట

ఒకరి నొకరు బాధించుట ఒకరి నొకరు దోచుకొనుట

కులమతాల కుంపట్లతొ కునారిల్లి చచ్చుట

ఇందుకు మినహాయింపే స్వచ్చోద్యమ బాసట

ద్వి సహస్ర దినాల మించి దీని గొప్ప ముచ్చట!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  20.01.2022.