2440* వ రోజు....

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

అవిరళ స్వచ్చోద్యమ చల్లపల్లిలో 2440* వ నాడు!

            శుభకృత్ నామ సంవత్సరే శుక్రవారే - పంచమదివసే కోమలా నగర్ నామ ప్రముఖ వీధిః (20.5.2022) - బ్రహ్మ ముహూర్త కాలః (వేకువ 4.19) వ్యష్టి శ్రేయోభావన నధిగమించి, గ్రామ సమష్టి సౌఖ్యాన్ని ఆకాంక్షిస్తూ 31 మంది కాయకష్టానికి సంసిద్ధులైన అపూర్వదృశ్యం!

            వీరిలో 25 మంది సుదీర్ఘకాలంగా నిత్య శ్రమదాతలైతే - క్రొత్తగా వచ్చిన స్థానికులు ఆరుగురు. (వీరిలో ఒకాయనది ప్రత్యక్షంగా లయన్స్ క్లబ్బుకూ, పరోక్షంగా ప్రజలకో ఎడతెగని దాతృత్వ వ్యసనం! మరొకరిది సమీప గ్రామంలో - గతంలో సర్పంచిగిరీ!

            కోమలా నగర్ లో ఒక ప్రధాన వీధిలోను, ఒకటి రెండు ఉపవీధుల్లోను ఈ 30 మంది - 100 నిముషాల శ్రమదానంతో ఏమి సాధించినట్లు? ఊళ్ళోని 18 వార్డుల - 25 వేలకు పైగా ప్రజలకు ఏం సందేశమిచ్చినట్లు?.....అంటే - ఈ కాస్తమందే ఊరు ఊరంతటినీ శుభ్రం చేశారని చెప్పలేం గాని, ఇందరు మహిళలు, వృద్ధులు, విద్యాధికులు, ఇంత వేకువ సమయంలో ఒక చోట ఒక స్వార్ధం కోసం కాక, ఊరి మేలు కోసం కలిసి, శ్రమించడమే ఈ రోజుల్లో పెద్ద విశేషం!

            6.00 సమయానికల్లా కోమలా నగర్ లో ఒక వీధిని 200 గజాలకు పైగా పరిశుభ్ర సుందరీకరించడమే ఒక అరుదైన దృశ్యం!

            ప్రజల్ని బురిడీ కొట్టించే వాళ్ల - అందిన కాడికి భూకబ్జాదారుల ముఖాల్లో సంతృప్తికీ, రోజూ గంటన్నరకు పైగా గ్రామ సామాజిక సుఖానికి ప్రయత్నించే  వాళ్ళు పొందే సంతోషానికీ చాలా తేడా ఉంటుంది!

            2440* పని దినాలుగా నిబద్ధతతో శ్రమిస్తున్న ఈ సాదాసీదా మనుషులు తమ శ్రమదాన ఔన్నత్యాన్ని పట్టించుకోరు గాని, మనసున్న మారాజులూ, పాత్రికేయులు, సామాజిక పరిశీలకులూ దాని ప్రత్యేకతను అంచనా వేస్తూనే ఉంటారు!

            మరి ఇన్నేళ్ల చల్లపల్లి గ్రామ శ్రమదానాన్ని గమనించిన ప్రతి పౌరుడూ ఆ పరిష్కారాన్ని ఒప్పుకొంటే - ఆచరణలో పెట్టే పట్టుదలే ఉంటే రేపు కూడ కోమలా నగర్‌లోనే - మరిందరు స్థానికులు చొరవ ప్రదర్శించే - శనివారం నాటి శ్రమదానంలో తప్పక పాల్గొనాలి!

            నేటి స్వచ్చ కార్యకర్తల వీధి పారిశుద్ధ్య కృషి వివరాల కోసం చల్లపల్లి గ్రామస్తులెవరైనా జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ ను పరిశీలించవచ్చు ఆ ప్రాంతంలో నిన్నటి - నేటి వీధి స్వరూపమెలా ఉన్నదో గుర్తించవచ్చు. ఏ కార్యకర్తలెంత చెమటలు చిందించారో కూడ గమనించనూవచ్చు!

            6.25 వేళ నేటి కాఫీ కబుర్ల కృషి సమీక్షా కాలానికి ముందుగా నర్రా శాయి బాబు గారు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలూ, డాక్టరు DRK గారు ప్రస్తావించిన కొన్ని సూచనలూ కూడ వీడియోలుగా వీక్షించండి!

            గంగులవారిపాలెం వీధి "గస్తీ గది" దగ్గర నిన్నటి కమ్మటి మజ్జిగ పంపిణీదారులిద్దరూ (శాస్త్రీజీ, పశు వైద్యుల వారు) 750 మందికి పంచడంలో సహకరించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

            రేపటి వేకువ కూడ మన గ్రామ మెరుగుదల బాధ్యత కోమలా నగర్ ముఖ్య వీధిలోనే!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం – 121

స్వచ్ఛ ధన్య స్వగ్రామపు సంచాలక సాహసులకు

స్వస్త మాన్య చల్లపల్లి సాధకులకు, శోధకులకు

నిర్నిబంధ - నిర్విరామ శ్రమపాఠం బోధకులకు

సాత్వికులకు - తాత్త్వికులకు జయ మంగళ ప్రణామాలు!

- నల్లూరి రామారావు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

 20.05.2022.