2442* వ రోజు.......

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పటికీ వాడవద్దు!

2442* వ నాటి మరొక స్మరణీయ శ్రమదాన వేడుక!

          వేడుక జరిగింది విజయవాడ రోడ్డులో - కోట ములుపు నుండి పెట్రోలు బంకు దాకా! చేసే పనేదైనా బుర్ర కేంద్రీకరించి, ఇష్టపడి చేస్తేనే వేడుకవుతుంది. ఈ ఆదివారం (22.5.22) వేకువ గంటన్నరకు పైగా తమ శ్రమను గ్రామ పరం చేస్తూ వేడుక నిర్వహించింది 25 నుండి 37 మంది! శక్తి వంచన లేని వాళ్ల ప్రయత్నంతో మెరుగుపడింది ½ కిలోమీటరు మేర ఒక ప్రధాన వీధి - దానికి సంబంధించిన 4 రహదారి ఉద్యానాలు!

ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే:

- నాలుగైదు రోజుల క్రిందట స్వచ్చ కార్యకర్తలు శ్రమించిన కోట మలుపు - శివాలయం నడిమి భాగాన్ని నలుగురు సుందరీకర్తలు ఈ ఉదయం ఇంకాస్త మెరుగుపరిచారు. మెకానిక్ షెడ్లు, రెస్టారెంటు, రద్దీగా ఉండే టీకొట్టు, ఒక మురుగు కాల్వ ఇవాల్టి వీళ్లవంతన్న మాట!

- ఏడెనిమిది మంది కష్టం - అది మామూలుది కాదు పలుగు, పారల పని - విజయవాడ దారికి చెందిన - గతంలో స్వచ్చ కార్యకర్తలే నాటి, పెంచిన పచ్చని, పూల వనాల్లో గడ్డి పీకడం, పాదులు సరిదిద్దడం, నేలను కూడ త్రవ్వి, చెక్కి తిరగెయ్యడం - ఎంత పట్టుదల లేకపోతే - ఈ పనులు సాధ్యమేనా?

- గోకుడు పారల్తో రోడ్డు మీద అంటుకుపోయిన ఇసుక - మట్టిని చెక్కిన వాళ్లు, ½ కిలో మీటరు బారునా చీపుళ్లతో రోడ్డును ఉడ్చినవారూ, మటన్ అంగళ్ల, చేపల దుకాణాల, కిళ్ళీకొట్ల ఎదుట ప్రతి ప్లాస్టిక్ సంచినీ, కాగితపు ముక్కల్నీ ఏరిన కార్యకర్తలు ప్రశంసార్హులే గాని, ఎనిమిదేళ్ల స్వచ్ఛ - సుందర చల్లపల్లి రోడ్లను ఇంకా ఇలా చెరుస్తున్న చిరు వ్యాపారులు, పట్టించుకోని గ్రామ పౌరులూ ఏ దాని కర్హులు?

- ఏ కార్యకర్త శుభ్ర సుందరీకరణ కృషి ప్రత్యేకత వారిదే గాని, నా దృష్టికి వచ్చిన ఒకానొక జంట సంగతి శ్రీమంతుక్లబ్ దగ్గరి 2 ఉద్యానాలను సొంతం చేసుకొని తీర్చిదిద్దడం!

- అలాగే - వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదుట గడ్డిని పారతో చెక్కిన, ఊడ్చి మెరుగు పరచిన గురు శిష్య కార్యకర్తలు! (గురువు సాదాసీదా శిష్యుడు మాత్రం భారీ ఆజానుబాహుడు!)

          ఇలా ఈ ఆదివారం శ్రమదానోత్సవాన్ని ఎంతైనా వివరించవచ్చు గాని ఆ వర్ణన పూర్వ రాజుల, రాణుల ప్రేమ కథలాగో, వెండి తెర మీద మనం డబ్బులు పెట్టి టికెట్లు కొని చూసే సినిమాలానో రసవత్తరంగా ఉండకపోవచ్చు గాని ఈ స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కళ్లెదుటి కఠోర వాస్తవం!

          37 మంది కార్యకర్తల కృషి సమీక్షా కాలానికి ముందే - స్వచ్చ సుందర చల్లపల్లి ప్రత్యేకత మీద నేను వ్రాసిన పాటను నందేటి శ్రీను పాడడమే కాదు - స్వయం విరచిత గీతాన్ని కూడ వినిపించాడు.

          SBI విశ్రాంత ఉద్యోగీ, స్వచ్చోద్యమ సంచాలకుడూ - ఇద్దరు ప్రసాదుల విశ్లేషణ, ప్రశంసలూ జరిగి, నిన్నటి దేసు వారి హరిత విందు భోజనాలు ప్రస్తావన కొచ్చి, సోమ - మంగళ - బుధవారాల్లో స్వచ్ఛ కార్యకర్తల ప్రాయోజిత మజ్జిగ పంపకం ప్రకటింపబడి.... నేటి శ్రమదాన వేడుక అలా ముగిసెను!

          కోమలా నగర్‌లో నిన్న అర్థాంతరంగా ఆగిన వీధి శుభ్ర - సుందరీకరణ కోసం బుధవారం వేకువ మనం అక్కడే కలుసుకోవాలి!

           సమర్పిస్తున్నాం ప్రణామం 123

స్వార్థ చింతన లణగ ద్రొక్కిన - త్యాగముల కర్ధాలు చెప్పిన

స్వచ్ఛతా పాఠాలు నేర్పిన - భావితరముల బ్రతుకు పెంచిన

రెండు వేల దినాలపైగా గుండె నిబ్బర మెంతొ చూపిన

చల్లపల్లి స్వచ్ఛ - సుందర సాహసికులకు మా ప్రణామం!

- నల్లూరి రామారావు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

 22.05.2022.