2443* వ రోజు....

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పటికీ వాడవద్దు!

రెస్క్యూ టీం వారి ఊరి ఆపన్న హస్తాలు - @2443*

            సోమవారమంటే గ్రామ రక్షక స్వచ్చ కార్యకర్తల వారం! ఇంత పెద్ద ఊరిలో రోడ్ల గుంటలో - పెనుగాలికి కూలిన చెట్లో -  ఏ ఇతర అనుకోని అసౌకార్యాలో వస్తూనే ఉండవా? మరి, స్వచ్చ కార్యకర్తల్లోని రెస్క్యూ దళమే వాటి పరిష్కర్త! 

            ఐతే ఈ సోమవారం వేకువ 4.30  నుండి 6.30 దాక చల్లపల్లికి వచ్చిన రిస్కేమిటి? ఈ దళం దాన్నెలా పరిష్కరించింది? అంటే

            ఈ గ్రామంలో మన కార్యకర్తలు నాటి - రక్షించి - పెంచిన వేలాది మొక్కలు, కొన్ని చోట్ల వృక్షాలైపోయి, వాటి కొమ్మలు ఆశగా ఆకాశాన్ని చూస్తుంటే - కరెంటు తీగల కడ్డొస్తాయని సదరు విద్యుత్ విభాగం వాళ్లు అవసరమైనంత మేరకు సౌమ్యంగా కాక - కాస్త కఠినం గాను, క్రూరం గాను, కసి గాను, కొమ్మలకు బదులు మొత్తం చెట్టునే నరికేయడం కొన్ని మార్లు జరిగేది. వాళ్ళ కసి చల్లారేది గాని, రోడ్లు బోసి పోయి, స్వచ్చోద్యమకారుల మనసులు విలవిలలాడేవి!

            అందుకని - ముందస్తు జాగ్రత్తగా అలాంటి చెట్ల కొమ్మల్ని అవసరానికి సరిపడా అందానికీ, పచ్చదనానికి భంగకరం కానట్లుగా స్వచ్ఛ కార్యక్తలే తొలగిస్తుంటారు.

            సాగర్ టాకీసు బైపాస్ వీధిలో సజ్జా ప్రసాదు గారి ఉప వీధిలో ఈ వేకువ - ఐదుగురి రెస్క్యూ బృందమూ, మరో ఇద్దరు ముగ్గురు వాళ్ళ మద్ధతుదారులూ చేసింది ఆపనే! వీళ్ళ బిరుదు రెస్క్యూ దళమనే గాని, ఆ చెట్టు కొమ్మల్ని వీలైనంత నాజూకుగా తొలగించి, తమ సొందర్య స్పృహను చాటుకొన్నారు!

            6.30 సమయంలో తమ ఎనిమిదేళ్ల మహదాశయమైన గ్రామ స్వచ్చ - పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాల్ని సజ్జా ప్రసాదనే పెద్ద మనిషి ముమ్మారు నినదించడంతో నేటి శ్రమదానం ముగిసింది!

 

           సమర్పిస్తున్నాం ప్రణామం 124

ఏ మహోన్నత ఆశయాలను ఏ మహాత్ములు మొదలు పెట్టిరొ

పూర్వ పరములు తెలిసికొంటూ ఆచరణలో అనుసరిస్తూ

నేటి యుగమున కన్వయిస్తూ మేటి ఉద్యమ స్ఫూర్తి నింపిన

కదం త్రొక్కిన స్వచ్చ సుందర కార్యకర్తకె మా ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

  23.05.2022.