2466* వ రోజు.......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

స్వచ్చ సుందర ఉద్యమంలో 2466*వ నాటి ప్రయత్నం!

          ఈ శుక్రవారం (17.06.2022) వేకువ సమయంలో 31 మంది కార్యశూరుల రంగస్థలం బందరు మార్గంలోని 6 వ నెంబరు పంట కాలువ మొదలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దాక. చీపుళ్లతో, గొర్రులతో శ్రావ్య ఆసుపత్రి, రాజకోశాగారం SBI, చల్లపల్లి రాజు గారి కళాశాల వగైరాలన్నీ మరొకమారు కాలుష్యాలు గుట్టలు పడి, ట్రాక్టర్ లో కెక్కి, చెత్త కేంద్రానికి తరలిపోయినవి.

          రెండు చోట్ల వేగ నిరోధకాల దగ్గర పోగుపడిన ఇసుక – దుమ్ము – రాతి ముక్కలు ఊడ్చి తొలగించడమే ఏడెనిమిది మంది కార్యకర్తలకు సరిపడా పని దొరికింది. ఇక అక్కడి తాత్కాలిక రకరకాల దుకాణాల రోజువారీ వ్యర్ధాలు, పండ్ల దుకాణాల – టిఫిన్ బళ్ళ ఆగాలు సంగతి చెప్పేదేముంది గనుక?

          రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట మెకానిక్ షెడ్ల, కొబ్బరి బొండాల అంగళ్ళ కశ్మలాలు కూడా ఏమీ తక్కువ తినలేదు! ఇంకానయం – కార్యకర్తల కన్ను ప్రక్కనున్న ఖాళీ స్తలం మీద పడలేదు.

          రోడ్ల మార్జిన్లలోని పిచ్చి మొక్కలూ, పండ్ల కొట్ల కాగితం వ్యర్ధాలు, ప్లాస్టిక్ సంచులు వగైరాలే ఐదారుగురికి గంటకు పైగా ఉద్యోగం చూపెట్టినవి గదా!

          ఎవరెన్ని రకాల దిక్కుమాలిన కశ్మలాలతో ఈ స్వచ్చ సుందర చల్లపల్లి ప్రధాన వీధిని ఇంతగా భ్రష్టు పట్టించారో వాళ్ళెవరూ ఈ కార్యకర్తలతో కలిసి శ్రమించనే లేదు; కళాశాలలోనికి నడక నిమిత్తం వెళ్ళే – వచ్చే వారు సైతం పట్టించుకోలేదు.

          కార్యకర్తలు మాత్రం యధావిధిగా దీక్షతో, శ్రద్దతో తమ పని తాము 6 గంటల 6 నిముషాలకు ముగించారు. నేటి పని ముగింపు సమావేశంలో జాస్తి జ్ఞాన ప్రసాద్ గారు ముమ్మారు ప్రవచించిన గ్రామ స్వచ్చ - శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలతో నేటి శ్రమదానానికి ముగింపు.

          రేపటి మన వీధి పారిశుద్ధ్య కృషి సైతం వర్షం లేకుంటే ఇదే బందరు మార్గంలోను వర్షం ఉంటే గనుక విజయవాడ బాటలోని విజయా కాన్వెంటు వద్దనూ ఉండగలదు!

 

       సమర్పిస్తున్నాం ప్రణామం 145

స్వచ్చోద్యమ చల్లపల్లె చరితార్ధము – చారిత్రక

మిది అనుసరణీయం మనకిదె  ఆచరణీయం ఇదె

హితకరమూ – శుభకరమూ – ప్రతి ఊరికి ఫలప్రదమూ!

స్వచ్చోద్యమ కార్యశూరులందరికిదే ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  17.06.2022.