2468* వ రోజు.......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ విధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

          2468* - ఆదివారం(19.06.2022) నాటి వీధి పారిశుద్ధ్యం.

 

          మరి అందుకు పాల్పడిన వాళ్లు 33 మంది! కొందరు గృహిణుల – నలుగురు ముసలోళ్ల – ఏడెనిమిది మంది ఉద్యోగుల-ఇంకొందరు వ్యాపారుల- ఇద్దరో, ముగ్గురో ట్రస్టు పని వారల- నలుగురు నర్సుల... 100 నిముషాల (4.20 to 6.05) పారిశుద్ధ్య పరిచర్యలందుకొన్న గ్రామ వీధేమో బందరు రహదారి లోని ½ కిలో మీటరు భాగం!

 

          30-40 ఏళ్ల నాడు NTR తన సభల కొచ్చే జనాన్ని “నేల ఈ నిందా- ఆకాశం చిల్లు పడిందా- సముద్ర కెరటం ఉవెత్తున ఎగసిందా...” అంటూ నాటకీయంగా వర్ణించినంతటి సీను ఇక్కడ లేదు. స్వచ్చ కార్యకర్తలందరూ లెక్కిస్తే 150-200 మంది! పాతిక వేల జనాభా బ్రతుకున్న ఊరి నుండి- తమ సొంతానికి కాక- గ్రామ సమాజ శ్రేయోభావంతో వీధుల్లోకి వచ్చేదీ, శ్రమించేదీ ఈ 30-40-50...మందే!

 

          అది వాళ్ల ప్రారబ్దమో- సంతృప్తి దాయకమో-బాధ్యతో-సేవో-ఏదైతేనేంగాని, 8 ఏళ్లుగా- సుమారు 4 లక్షల పని గంటలుగా – ఒక వ్యసనంగా- నిరంతరంగా చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం నడిచి పోతూనే ఉంది- తీసుకోగలిగిన వ్యక్తులకూ, ఇతర ఊళ్లకూ స్ఫూర్తిని పంచుతూనే ఉంది!

 

          ఊరి ప్రధాన వీధుల్లో దుమ్మో-ప్లాస్టిక్ వ్యర్థాలో – అంద విహీనమైన గోడలో- పచ్చదనం లోపమో- కుంటడం కూడ మాని చతికిలబడిన మురుగు కాల్వలో- బోసిపోతున్న రహదారులో- గుంటలు పడి ప్రయాణికులకు ప్రామాదికంగా ఉండే రోడ్లో-వసతులు లేని బస్టాండులో-శ్మశానాలో....  చూసి, సహించలేని - తక్షణం కార్యాచరణకు దిగుతున్న ఈ స్వచ్చ సైనికులది బలహీనతను కోవాలా?

 

          అసలు వీళ్లను గ్రామ సమాజాన్నుద్ధరించే మన సమకాలపు మహానుభావులనాలా? లేక ఆ సమాజం నుండి తాము తీసుకొన్న అప్పును వడ్డీతో సహా తీరుస్తున్న సాధారణ వ్యక్తులనాలా?

 

          వాక్ స్వాతంత్ర్యం లాంటి హక్కులూ, బాధ్యతలూ ఉన్న దేశమట ఇది! ఖాళీ రోడ్ల మార్జిన్ల కబ్జాలకూ, కాల్వగట్ల కశ్మల భూయిష్టాలకూ, పదేపదే ప్రభుత్వాలూ, కోర్టులూ, స్వచ్చంద సంస్థలూ, స్వచ్చ కార్యకర్తలూ ఘోషిస్తున్నా నిత్యం జరుగుతున్న పర్యావరణ ధ్వంసాలకూ కాబోలు సదరు స్వాతంత్ర్యం!

 

          నేటి శ్రమదానంతో శుభ్ర పడిన గోడలు కాక, రోడ్డెక్కిన ఇసుక దిబ్బల్ని సర్దింది కాక, రహదారి మార్జిన్ల పిచ్చి-ముళ్ల మొక్కల తొలగింపు కాక, పింగళి డాక్టర్ల ఆస్పత్రి నుండి భారత లక్ష్మి ధాన్యం మర వీధి దాక చూడ చక్కగా మారింది కాక - మరి రెండు విశేషాలేమనగా:

 

          ఎప్పట్లాగే ఒకాయన పంచిన నిమ్మ పళ్లూ- కరివేపాకులూ, మరొక రాజు గారి అసలు తిరుపతి లడ్డు ముక్కల పంపకమూ,

 

          ఒకప్పటి చురుకైన యువ కార్యకర్తలిద్దరి శ్రమదాన పునః ప్రారంభమూ!

 

          6.30 కి హీరో హోండా విక్రేత దాసరి శ్రీనివాసు ముమ్మార్లు నినదించిన స్వగ్రామ స్వచ్చ-పరిశుభ్ర- సౌందర్య సంకల్పంతో నేటి కృషి పరిసమాప్తి!

 

          బుధవారం వేకువ సైతం సాధారణ వాతావరణమైతే - మనం కలిసి శ్రమించదగిన చోటు తూర్పు రామాలయం ఎదుటనే!    

  

    సమర్పిస్తున్నాం ప్రణామం 147

 

వినతులెన్నొ చేసి ఊరి స్వచ్చతకై కదలాలని-

ప్రణతులెన్నొ ఊరుమ్మడి స్వస్తత పెంపొందాలని-

ఎంతెంతో చేసి చేసి ఊరు నీ మాత్రం తీర్చిదిద్ది

అలుపెరుగని కార్యకర్త కర్పిస్తాం ప్రణామం!  

       

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  19.06.2022. 

మెయిన్ రోడ్ మునసబు గారి వీధి వద్ద