2469* వ రోజు....

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ విధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

రెస్క్యూదళం వారి మరొక వీధి శుభ్రతా/ భద్రతా కృషి - @2469*

          మంగళవారం - 21-6-22 న కూడ - సుమారైన చిరుజల్లుల సంతోషం నడుమ – ఏడెనిమిది మంది స్వచ్ఛ కార్యకర్తల శ్రమ ఒక ఇరుకు వీధికి సమర్పితమయింది! (అందులో ముగ్గురైతే – 75 - 86 ఏళ్ల ద్వితీయ బాల్యస్తులు! - అపార్థం చేసుకొనేరు - ఇళ్ల దగ్గర బొత్తిగా తోచని ముసలి ఘటాలని! పెద్దగా శరీర శ్రమ పరంగా కాకున్నా - ఈ వర్షీయసుల ఆలోచనలు, సమయమూ, డబ్బూ తమ ఊరి మేలు చుట్టూనే తిరుగుతుంటాయి!

          చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల్లో భాగమైన రెస్క్యూ వీరుల్ని చూస్తుంటే – చాలా కాలం క్రితం కారల్ మార్క్స్ ప్రపంచ కార్మికుల్ని గురించి చెప్పిన వాక్యం గుర్తొస్తుంది. అన్ని దేశాల కార్మికులారా! సంపద సృష్టికై శ్రమించండి! సామాజిక – రాజ్య వ్యవస్థల ప్రక్షాళన కోసం పోరాడండి. మీరు పోగొట్టుకొనేదేమీ లేదు – సంకెళ్ళు తప్ప!..”

          స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు ఇన్నేళ్ల – ఇన్ని వేల రోజుల శ్రమదానంతో ఏం సాధించారంటే – ఒక క్రొత్త పని సంస్కృతి నమూనా నెలకొల్పడంలో మనః తృప్తి! ఏం పోగొట్టుకొంటున్నారంటే - ముందుగా తాము విద్యాధికులూ, ఊళ్ళో పేరు ప్రతిష్ఠ కలవారూ ఐఉండీ, వీధులూడ్చడంలో సంకోచాన్ని! డ్రైనులు బాగు చేస్తున్నప్పటి బిడియాన్ని! ఇక ఆ తర్వాత తమ చిన్న చిన్న అనారోగ్యాల్ని!

          ప్రతి సోమ - మంగళవారాల్లో గ్రామ భద్రతా దళం పేరిట ఈ కొద్ది మంది పొందే ఆంతరంగిత సంతృప్తి ముందు - తాము ఊరి సమస్యల్ని ఒక్కొక్కటిగా శక్తి మేర పరిష్కరించేందుకు చేసే శ్రమ ఏ పాటిది?

          గంటన్నరకు పైగా షాబుల్ వీధిని తీర్చిదిద్దిన తరువాత, కన్నడ రాష్ట్రం నుండి తిరిగి వచ్చిన వేమూరి అర్జునరావు గారు తమ అభిమాన స్వచ్చోద్యమ చల్లపల్లికి (మనకోసం మనం ట్రస్టు) 2,000/- విరాళం సమర్పించి పలికిన

          జై స్వచ్ఛ సుందర చల్లపల్లి! – జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లి!! - -

          స్వచ్ఛ సుందర చల్లపల్లిని – సాధిస్తాం! సాధిస్తాం!!

          అనే నినాదాలు సదరు వీధిలో మారు మ్రోగి, నేటి స్వచ్చోద్యమం కథ ముగిసింది.

          రేపటి మన పారిశుద్ధ్య గమ్యం – వాన రాకడ లేకుంటే బందరు రహదారిలోని తూర్పు రామాలయం ఎదుట! వాన పడేట్లైతే – చీపుళ్లతో తడిలో - నీళ్లలో ఊడ్వడం కుదరదు గనుక – బెజవాడ దారిలోని విజయా కాన్వెంట్ దగ్గర!

         

       సమర్పిస్తున్నాం ప్రణామం 148

శ్రమ సంస్కృతి, ఋజువర్తన, సాహసిక ప్రవృత్తులు,

త్రికరణ శుద్ధిని తెలిపే దిన చర్యలు - పరిచర్యలు

సమయ – ధన - శ్రమ దానపు చాటింపులు చేపట్టిన

స్వచ్ఛ సంస్కృతీ పరులకు అందిస్తా ప్రణామములు!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  21.06.2022. 

కన్నడ రాష్ట్రం నుండి తిరిగి వచ్చిన వేమూరి అర్జునరావు గారు తమ అభిమాన స్వచ్చోద్యమ చల్లపల్లికి (మనకోసం మనం ట్రస్టు) 2,000/- విరాళం సమర్పించారు.