2471* వ రోజు....

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

26 మంది కార్యకర్తల, 106 నిముషాల గ్రామ బాధ్యత 2471*

తేది : 23-6-22,

కర్తవ్య నిరహణం : ఉదయం 4.20 - 6.12 నడుమ,

స్థలం : సచివాలయం పడమర గాను, గాంధి స్మృతి వనం మొదలు 6 వ నంబరు కాలువ గట్లు, వంతెన క్రింద సైతం, ప్రధానంగా బెజవాడ దారికి పడమర మురుగు కాల్వ ప్రాంతాలు, కొసరుగా రోడ్డు మార్జిన్ల సుందరీకరణమూ!

            పని జరిగింది నిన్నటి ప్రాంతమే గాని, కర్తలు పాతిక మందే గాని, ఫలితం తక్కువది కాదు; ఏరిన - ఊడ్చిన - తొలగించిన - ప్రోగేసిన - డిప్పలతో ట్రక్కులో నింపిన ప్లాస్టిక్ కప్పులు, సీసాలు, సంచులు, మద్యం గాజు బుడ్లు, పిచ్చి - ముళ్ల మొక్కలు, కొమ్మలు... అన్నీ కొలిస్తే ఒక పెద్ద ట్రాక్టరుకు సరిపడా నిండాయి - అదీ ఒకరిద్దరు సర్ది త్రొక్కితే!

            పంట కాలువ గట్టు మీద ఒకామె ఎన్నెన్ని కశ్మలాలు ప్రోగేసిందో గమనించండి! వంతెనకు పడమరగా కాల్వలో దిగిన ఇద్దరు కార్యకర్తలకైతే మరీ చేతుల్నిండా పనే! గోనె సంచిడు ప్లాస్టిక్ వ్యర్థాలు! ఐతే ఏ మాటకామాటే చెప్పుకోవాలి! ఏడెనిమిదేళ్ల నాడు ఈ వంతెన ప్రాంతం ఎంతగా కంపుకొట్టే చెత్త కేంద్రంగా ఉండెనో, దాన్ని బాగుచేస్తూ కార్యకర్తలెంతగా వాంతులు చేసుకొన్నారో గుర్తుకు తెచ్చుకొంటే ఈ రోజు వీళ్ళ శ్రమ మరీ కష్టసాధ్యమని పించదు!

            5.40 తర్వాత బాటకు పడమర డ్రైనులో 15 మంది కార్యకర్తలదే శ్రమంటే! పుల్లా పుడకా, ఎండుటాకులు, త్రాగేసిన కొబ్బరి బొండాలు, బాట సారులు విసిరిన ప్లాస్టిక్ ముదనష్టాలు, ఇప్పటికిప్పుడు కత్తుల వారు నరికిన కొమ్మ రెమ్మలు, ముళ్లమండలు, రాళ్ళు - రప్పలు ..... ఒకటేమిటి .. ఆ 6070 గజాల డ్రైనే సకల కశ్మల అరిష్టాలకు ఆటపట్టు! కాని 3040 నిముషాల కార్యకర్తల, సుందరీకర్తల శ్రమ ధాటికి 6.00 తరువాత మళ్లీ అదే డ్రైను చూడచక్కనిది!

            తక్కిన వన్నీ అలా ఉంచి, సుందరీకర్తల - అందులోనూ ముఖం చూపని వంచిన నడుం మాత్రం కనపడుతూ పారతో మట్టి చట్టును నరికి, ప్రోగులు డిప్పలకెత్తే ఒకానొక డైటింగ్ వీరుడి పని పద్ధతైతే నేను మళ్లీ మళ్ళీ చూస్తూనే ఉన్నాను!

            ఐతే చూసి సంతోషించవలసిందీ, ఈ శ్రమ జీవులతో కలిసి ముందడుగేయవలసిందీ నేనొక్కడినేనా? “ఈ చల్లపల్లి నా పుట్టిన ఊరు ఇప్పుడైతే ఇది పరమ పరిశుభ్ర సుందరం...అని చెప్పుకునే ప్రతి గ్రామస్తుడు దీని మెరుగులకు ఏ కొంచమైనా పాటుపడవద్దా?

            ఈ నాటి శ్రమదానం ముగిశాక, ఊరి ప్రస్తుత - భావికాల స్థితి గతుల్ని చర్చించాక, తలా కప్పెడు మాంచి కాఫీ సేవించాక, ముమ్మారు తన ఊరి పరిశుభ్ర - సౌందర్య సంపాదక కాంక్షను బలంగా నినదించి వినిపించిన వారు కొంత వయోవృద్ధ కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావు.

            రేపటి మన అభిమాన గ్రామ కర్తవ్యం కోసం వేకువనే మనం కలిసి శ్రమించదగిన చోటు జిల్లా పరిషత్ స్కూల్ వద్ద!    

 

      సమర్పిస్తున్నాం ప్రణామం - 150

ఇల్లు, వీధి, వార్డు, ఊరు విధిగా సుమ సుందర ముగ

శ్రమ సంస్కృతి వికసిస్తూ - ఒక స్పందన కనిపిస్తూ

ఊరంతటి కొక్కడుగా - ఒకడి కొరకు ఊరంతా

ఒకే తాటిపై నడిచే ఉద్యమానికి ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 

  23.06.2022.