2472* వ రోజు....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

చల్లపల్లి స్వచ్చ సుందరీకరణ శ్రమదానం - @2472*

            ఇది 24.06.22శుక్రవారం - ముహూర్తం 4.20! వాళ్ళంతా కలిపి 24 మంది! స్థలం విజయవాడ రహదారిలోని కోమలా నగర్ దగ్గర 6 వ నంబరు పంట కాల్వల మధ్యస్థం! పని కాలం 6.08 దాక!

ఇదే చోట మూడవ రోజు కూడ ఇందరు కార్యకర్తలేమి ఉద్ధరిస్తున్నారని ఆరా తీస్తే:

1) అక్కడొక సిమెంటు/ ఇనుము గోడౌను! మరియు రాతి ఇసుక మిశ్రం! అది కాస్తా ఇటీవలి వానలకు రెండు గజాల వెడల్పున, 2530 అడుగుల బారున నాలుగైదు అంగుళాల మందాన గట్టిగా అంటుకుపోయింది! రోడ్డు నుండి సదరు మిశ్రాన్ని ఊడ గొట్టేందుకు 15 మంది కార్యకర్తలు గోకుడు పారల్తో, గునపాలతో, పారలు, రైల్వే పారల్తో గంటకు పైగా పోరాడవలసి వచ్చింది!

2) ఇక రెండో ముచ్చట అదొక శుభ్ర సుందరీకరణ లోకం! ఆ నలుగురూ గంటల కొద్దీ కాలం రోడ్ల ప్రక్క చెట్ల కొమ్మలు కత్తిరిస్తారు, పాదులు సరిదిద్దుతారు, ఎత్తు పల్లాలు సమం చేస్తారు - 6.00 తరువాత చూస్తే వాళ్ళున్న జాగా మొత్తం రూపు రేకలు మారిపోయి, పరిశుభ్రం - సౌందర్యం సంతరించుకుని - ఏ మాత్రం స్వచ్చ స్పృహ ఉన్న వాళ్ళకైనా కనులకింపితంగా తయారౌతుంది!

3) మరో ఇద్దరికి మాత్రం పెద్ద పెన్నిధులే దొరికాయి - రెండు మూటల గాజు మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, పనిలో పనిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు పోగేయగలిగారు!

4) ఇక ఇద్దరు నర్సులున్నారు చీపుళ్లతో రహదారిని, మార్జిన్లను ఊడ్చి, ఇసుక లేని, దుమ్ము లేని, కాలుష్యరహితమైన బాటను సిద్ధం చేశారు!

5) మరి ఈ ఊడ్చిన దుమ్ము, ధూళి, ఇసుక - రాతి ముక్కలు ఏమైనట్లు? అవి కాస్తా ట్రాక్టర్ లోకి ఎగుమతై, బైపాస్ వీధిలోని ప్రాత ప్రభుత్వాసుపత్రి దగ్గర గుంటల్లోకి చేరింది!

            షరా! అసలీ బాధ్యతలన్నీ ఎవరివి? రోడ్ల - భవనాల, పంచాయతీలవి కావా? వాళ్లకు డబ్బు తీసుకొనో - తీసుకోకనో ఓట్లేసి గెలిపించిన గ్రామస్తులవి కావా? ప్రభుత్వాలు, శాఖలు చేయలేక మిగిలిపోతే స్వచ్చ కార్యకర్తలతో బాటు అధికారుల, పరిపాలకుల శ్రమదాన కర్తవ్యాలు కావా?

            ఇలా మాటాడితే ఎవరినో నిందించడం కాదు. ఎందరెందరివో - ఎప్పటెప్పటివో బరువు బాధ్యతల్ని ఏడెనిమిదేళ్లుగా స్వచ్చ కార్యకర్తలు మోయగలిగినంత మేరకు మోస్తున్నారనే యదార్ధాన్ని చెప్పడం మాత్రమే సుమా!

            6.15 పిదప - కాఫీ ముచ్చట్లు ముగిశాక - ఇంకొకరి నిమ్మ పళ్ల పంపకం తర్వాత - మాలెంపాటి డాక్టరు గారి బిస్కత్తుల పందేరం పూర్తయ్యాక - ఆయనే తన గ్రామ - శుభ్ర సౌందర్య సంకల్పాన్ని ముమ్మారు నినదించిన పిదప నేటి శ్రమదాన వైభవం ముగిసింది!

            రేపటి బాధ్యతల కోసం కూడ మనం కలుసుకోదగిన చోటు విజయవాడ దారిలోని గాంధీ స్మృతి వనం దగ్గరే!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం - 51

మురుగు నెత్తి పోయడమో - రోడ్ల గుంట పూడ్చడమో -

ప్రతి ఇంటికి తిరిగి గ్రామ స్వచ్చ భిక్ష అడగడమో -

ఇది నిత్యం నడిచే కధ! తొలగి పోని వీధుల వ్యధ!

విసుగెరగని వీళ్ళ సొదకె వినయ పూర్వక ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  24.06.2022.