2473* వ రోజు....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

చల్లపల్లిలో శ్రమదానోద్యమం – 2473*

          ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం, ఒక సంయమనం, ఒక పని వేగం వీటన్నిటితో బాటు ఒకానొక సందేహం - మరొక ఆందోళనం - ఇదీ ఈ శనివారం (25.6.22) వేకువ 4.20 6.10 సమయాల నడుమ - 27 మంది గ్రామ బాధ్యతాయుతుల శ్రమదానం! శ్రమించిన ప్రదేశమైతే – నాల్గవ నాడు కూడ సారా బాట్లింగ్/సచివాలయ/ పంటకాలువలున్న విజయవాడ రహదారే!

పై విశేషణాలను టూకీగా వివరించబూనుకొంటే :

- సిమెంటు/ ఉక్కు/ చిప్స్ గోడౌను దగ్గరి రోడ్డే ఈరోజు మరి కొంత వెడల్పయింది. వానలకూ, వచ్చేపోయే వాహనాల త్రొక్కిడికీ పెద్దలారీల నుండి, దిగుమతి వేళ, మళ్ళీ చిన్న వాహనాలను నింపుకొనేప్పుడూ జారిన-కారిన రాతి ముక్కలు, సిమెంటు, దుమ్ము, ఇసుక భలేగా కలిసి చట్టుగా మారి - నిన్న - ఈవేళ కార్యకర్తలకు బలపరీక్షైపోతున్నది!

 - ఒకనాటి సారా కంపెనీ పడమర డ్రైను గట్టును, అక్కడి ఎండిన బురద మట్టి గుట్టల్ని త్రవ్వి, సమం చేయడమూ, ఆ సమతలం కాస్తా మళ్లీ కారిపోనట్లూ - అందంగా కనిపించేట్లూ పొడవాటి తాటి బొందుల్ని అమర్చిన ఆరేడుగురి శ్రమనూ, కార్చిన చెమటనూ చూసిన అదృష్టం నాది!

- నారాయణ రావు నగర్ కు వెళ్లే వంతెన ప్రక్క రోడ్డు కాస్తా డ్రైను వైపు కోసుకు పోతే - ప్రక్కనుండి డిప్పలతో మట్టి - రాతి ముక్కలు మోసుకొచ్చి గుంట పూడ్చి, భద్రత కల్పించిన 10 మంది శ్రమదాతలూ శ్లాఘనీయులే!

 - కొందరు కత్తులకు పని చెప్పి, నీళ్ల టాంకుల ఉత్తరం డ్రైనులో పిచ్చి - ముళ్ల చెట్ల పనిబట్టారు- అందులో ఒకాయన జోడుకత్తుల జోదు!

- వంతెన మీది చిత్తు కాగితాల్ని మట్టీ ఇసుక మిశ్రాన్ని గోకుడు పారల్తో, చీపుళ్లతో కొందరు మళ్లీ శుభ్రపరిచారు.

ఇక ఈ మట్టి- రాతి మిశ్రం ట్రాక్టర్లో  కొలువై – ప్రభుత్వాసుపత్రి వీధిలోని గుంటల్లోకి దిగింది - ఆ పని నలుగురుది!

  -నాల్గు రోజులు శ్రమిస్తున్నా - అదేచోట మళ్లీ కశ్మలాలు అక్కడ నింపడం పట్ల కార్యకర్తలది అపురూప సహనం!

 - ఇంత శ్రమించి, రోడ్డు మార్జిన్లను ఇలా సుందరీకరిస్తే - ఏ కబ్జాదారులు ఏ రాత్రి వేళ వచ్చి, బడ్డీ కొట్టో - పండ్ల కొట్టో లేపుతారనే ఆందోళనలో ఈ స్వచ్చ కార్యకర్తలు!

          ఈ నిస్వార్థ శ్రమదాతల భయ - సందేహాల్ని నివారించడం అటు పంచాయతీ - రెవిన్యూ, ఇటు రాజకీయ నేతల, గ్రామ పెద్దల కనీస బాధ్యత కాదా?

          6.25 వేళ జోడు కత్తుల వీరుడు - అడపాగురవయ్య గ్రామ స్వచ్చ, శుభ్ర - సౌందర్య సంపాదక దీక్షను గర్జా సదృశంగా నినదించి, వివేకానంద వాణిని విన్పించి నేటి శ్రమ వేడుకను ముగించారు!

          రేపటి వేకువ సైతం ఈ 6 వ నంబరు పంటకాలువ (బెజవాడ రోడ్డులో) దగ్గరే మన శ్రమదాన కేంద్రం!

      సమర్పిస్తున్నాం ప్రణామం - 52

స్వచ్చోద్యమ  మొక కొందరి శ్రమదానపు ప్రమోదం

సామాజిక చింతన గల జనులక దొక ఉత్తేజం

వీరిలోన మరి కొందరి కిది లేనిదే పెను లోపం

సదసత్ జ్ఞానం కలిగిన సాహసులకె ప్రణామం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  25.06.2022.