2474* వ రోజు....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! 

ఆదివారం (26.10.2022) నాటి అల్ప సంఖ్యాకుల శుభ్ర-సౌందర్య దీక్ష!

      స్వచ్చ కార్యకర్తలు నేటి వేకువ 26 మంది సుమారు 2 గంటల పాటు తమ గ్రామ సమాజ బాధ్యతకు కట్టుబడి, చెమటలు దిగ గారుస్తూ వీధి పరిశుభ్రతకు పాల్పడినా సరే-వాళ్ల సంఖ్యను ఎందుకు కించ పరచవలసి వచ్చిందంటే – ఈ ఊరి జనాభా సుమారు 26 వేలుంటుందనీ-పద్దెనిమిది వార్డులు ఉండగా స్వచ్చ కార్యకర్తలు మాత్రం ఒక శాతం కాదు – ఒక్క శాతంలో పదో వంతు (0.1%) మాత్రమే- మళ్లీ అందులోనూ ఇరుగుపొరుగూళ్ల వారితో సహా ఈ బాధ్యతలు పంచుకొంటున్నందుకు!

           తాము పుట్టి పెరిగి, వికసించిన తమ ఈ పెద్ద గ్రామంలో - మాతృ గ్రామం మేలుకు ఏది కావాలో, ఏది వద్దో, ఏది పూజ్యమో-ఏది త్యాజ్యమో ఇంత సుదీర్ఘ కాలంగా స్వచ్చ సైనికుల శ్రమదానం విలువ ఏమిటో పట్టించుకోని వారిదే అత్యధిక సంఖ్యన్నమాట!

          ఆదివారం నాటి కార్యకర్తల శ్రమదాన స్థల- కాలాల్లో మార్పు లేదు- అదే బెజవాడ రహదారిలో మరి కొంత ముందుకు- అంతే! విడివిడిగాను, వివరంగాను చెప్పాలంటే-

1) ఇద్దరు పడమటి వైపు పొలంలోకి వెళ్లి. అక్కడి ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏ ఐదారు డిప్పలకు సరిపడానో ఏరు కొచ్చారు.

 

2)కరెంటు తీగల్ని క్రమ్మేసిన చెట్టు కొమ్మల్ని నిచ్చెన మీదకెక్కి ముగ్గురు తొలగించడమూ ఒక విశేషమే!

3) పంట కాలువలో- ముఖ్యంగా వంతెన క్రింద నలుగురైదుగురు, వాళ్లకు పై నుండి సహకరించిన ఇద్దరిది నిజంగా కష్ట సాధ్యమైన పనే! బాట సారులు అలవోకగా విసిరే సంచులు, పాత గుడ్డలు, మద్యం సీసాలు సరే సరి- అవి ఎలాగూ మద్యాంధ్రప్రదేశ్ లో తప్పవు-

          టిఫిన్ బళ్ల మిగులు పదార్థాలూ, ఫ్రైడ్ రైస్ తయారీ నుండి పుట్టుకొచ్చే గ్రుడ్డు పెంకుల- అన్నం మెతుకుల- అను పానాలక్కడ ప్రోగై- ఘాటు వాసనలు పుట్టుకొస్తే-అక్కడ నిలబడి- ఊడ్చి, శుభ్రపరచడం ఎంత సాహసమో కదా!

4) ఐదో రోజు కూడ ఈ రహదారిలో ట్రాక్టరు నిండే తుక్కులు-వ్యర్థాలు ఎలా పుట్టుకొస్తాయో- స్వయంగా వచ్చి, శ్రమదానంలో పాల్గొని, గమనిస్తేనే తెలుస్తుంది!

 

ఉన్న ఊరి మేలు కోరే ఎవరైనా ఆలోచించవలసిందీ పంచాయతీ వారు తక్షణమే గట్టిగా  పూనుకోవలసిందీ, 6 వ నంబరు కాల్వ దగ్గర జాగ్రత్త పడదగిందీ- ఈ రెండు విషయాలే- పుట్ట గొడుగుల్లా వీధుల్లో- మరీ ముఖ్యంగా నడకుదురు రోడ్డు పరిసరాల్లో పుట్టుకొస్తున్న ఫ్లెక్సీలు!

 

          సినిమా హీరోల- రాజకీయ నేతల- వివిధ మత కార్యక్రమ నిర్వాహకులకు పంచాయతీ వారు సాధికారికంగా కౌన్సెలింగ్ ఇవ్వక తప్పదు! పోలీసు వారి, స్వచ్చ కార్యకర్తల సహకారము కూడా  ఎలాగూ ఉండాలి! పర్యావరణ రక్షణ దృష్ట్యా  గ్రామస్తులకు, పంచాయతీ వారికి ఇది స్వచ్చ శ్రమదాతల సంప్రార్థనం!

 

6.30 నుండి 25 నిముషాలకు పైగా, వానలోనే సాగిన సమీక్షా సమావేశంలో గోళ్ల వేంకట రత్నం పలికిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలూ, నందేటి శ్రీనివాసుని రెండు మంచి పాటలూ వినిపించాయి!

 

బుధవారం నాటి వేకువ గాంధీ స్మృతి వనాంతర్భాగమూ, మరొక మురుగు కాల్వ పనీ మిగిలినందున- విజయవాడ బాటలోనే కలుసుకొందాం!     

      సమర్పిస్తున్నాం ప్రణామం - 53

ఎవరొ వీరు- ఊరి కొరకు ఎందుకింత ఆరాటం?

ఇన్ని వేల రోజులుగా ఏమిటి ఈ శ్రమదానం?

స్వార్థం, తెలివీ బలిసిన సమాజానికా సేవలు?

సదాచరణ శూరులకే సమర్పిస్తా ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  26.06.2022.