2497* వ రోజు.......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

చల్లపల్లి శ్రమదాన పరంపరలో - గమనార్హమైన 2497*వ నాడు!

            3.8.22 - మళ్లీ మరొక బుధవారం వేకువ 4.19 కే 11 మందీ, క్షణక్షణంగా అంతేమందీ - వెరసి 22 మంది నిర్వహించిన వీధి పారిశుద్ధ్య ప్రక్రియ! గంటా 45 నిముషాల పాటు - ఆటోనగర్ దగ్గరి బెజవాడ మార్గంలో తమ గ్రామ సామాజిక కర్తవ్య పరిపూర్తి!

            ఊరి పౌరుల సంఖ్యతో పోలిస్తే వీళ్ల సంఖ్యా బలం బొత్తిగా పేలవం! పంచుతున్న సామాజిక స్ఫూర్తి మాత్రం బలీయం! తమకు తామే తలపెట్టుకొన్న విధ్యుక్త కర్తవ్యంలో వాళ్లు మరీ బలిష్టులు! ఇందులో కొందరైతే అల్ప సంతోషులు గంటన్నర పాటు శ్రమించి, చెమట స్నానాలు చేసి, కప్పెడు కాఫీ త్రాగుతూ తమ కష్టంతో బాగుపడిన 40 గజాల రహదారిని కన్నారా చూసుకొంటూ తాము పెంచి పూయిస్తున్న రహదారి వనాల పూలను చూస్తూ మురిసిపోయే అత్యల్ప విలక్షణ సంతోషులు!

            ఐతే తెల్లారే సరికల్లా అక్రమం గానో, సక్రమంగానో లక్షల్లక్షలు పోగేసుకునే కలలు కనే వాళ్ళ సంతృప్తి కన్న వీళ్ల దైనందిన సంతోషం తక్కువేమీ కాదు!

            సొంత ఊరి కోసం ఈ వేకువ వీధిలో కొచ్చి, పాటుబడిన వాళ్ళు 20 మందైతే ఏమిటి? వాళ్ల ఉద్దేశం, ఆచరణ నిష్కల్మషం! డబ్బుకో, కీర్తికో, మెప్పుకో కాక - సొంత లాభం కోసం కాక తమ వాళ్ళనుకొన్న ఊరి జనం కోసం చేస్తున్న కృషి కనుక అది చాల పవిత్రం! వేమన్న కవి అనలేదా

గంగి గోవు పాలు గరిటడైనను చాలు

కడివిడైన ఏల ఖరము (గాడిద) పాలు?...

ఉన్న ఈ 20 మంది సామాజిక కర్మిష్ఠులే 3 ముఠాలుగా 3 చోట్ల పనులు చేసుకుపోయారు!

1) 4 రోజుల్నాడు శుభ్రపరచిన వెనుకటి చోట ప్లాస్టిక్ తుక్కులు ఏరి, బాటను ఊడ్చిన వారు,

2) ఆపార్ట్ మెంటుకు దూరంగా ఆటోనగర్ ప్రక్క డ్రైనూనూ, గట్టునూ శుభ్రపరిచినవారూ,

3) రహదారి పడమర భాగాన్నీ, మురుగు కాల్వనూ మరోమారు సంస్కరిచిన వాళ్లూ!

            ప్రత్యక్షంగా చూడని వాళ్లు కేవలం 40 గజాల వీధి నుండే ట్రాక్టరు నిండా వ్యర్ధాలు పుట్టుకొచ్చాయంటే నమ్మకపోవచ్చు గాని, 40 రోజులుగా బెజవాడ రోడ్డును కశ్మల రహితంగా పాటుబడే స్వచ్చ కార్యకర్తల పట్టుదలకు దీటుగా గ్రామస్తుల్లో ప్రయాణికుల్లో కొందరు అలవోకగా నింపే వ్యర్ధాలూఉంటాయి మరి!

            మరో మూడు రోజుల్లో స్వచ్చ కార్మికుల పని దినాల సంఖ్య 2500 కు చేరుతున్న విషయమూ, వచ్చే ఆదివారం మరొక శ్మశాన సంస్కరణ బృహత్ప్రణాళిక సంగతీ నేటి సరదా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి! దానికి ముందుగా నూతక్కి శివబాబు మూడు పర్యాయాలు ప్రకటించిన గ్రామ స్వచ్చ పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలూ, కార్యకర్తల ప్రతి స్పందనలూ మారుమ్రోగాయి!

            రేపటి వేకువ కూడ మరింత వీధి సుందరీకరణ నిమిత్తం మనం కలుసుకోదగిన చోటు బాలాజీ భవన సముదాయమే!

 

            *క్రమించడమూ శ్రమించడమూ*

సొంత లబ్ధికొ ఉబుసు పోకకొ ఇంతగా ఆరాట పడుదురు

కుటుంబ శ్రేయస్సు కోసం ఒక్కింతగా పోరాట ముండును

కేవలం ఒక ఊరి మేలుకు కలిసి కట్టుగ కార్యకర్తలు

క్రమించడమూ శ్రమించడమీ గ్రామ మందునె చూడవచ్చును!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  03.08.2022.