2546* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

నిన్నటి చోటనే రెస్క్యూ టీం వారి అభినందనీయ కృషి - @2546*

            మంగళవారం వేకువ సమయంలో కూడ ఆరుగురు కర్మవీరుల  స్వచ్ఛ - శుభ్ర – భద్ర – సౌందర్య తపస్సు పోలీసు కార్యాలయంలోనే; దాన్ని ఇంకా ఇంకా రమణీయంగా - హరితమయంగా - ఆహ్లాదకరంగా ఎందుకు చేయలేమనే పంతమే!

            కొంత క్లిష్టమైన – కఠినతరమైన విధులు నిర్వహించే రక్షక భటులకు వారి ఆవరణలో ఈపాటి ఆహ్లాద - ఆనందదాయక వాతావరణం కల్పించే స్వచ్ఛ కార్యకర్తల స్వచ్ఛంద శ్రమదానం నా దృష్టిలో హర్షణీయము, అభివందనీయమూ! ప్రత్యేకించి ప్రతి నిముషాన్నీ - ప్రతి చిన్న పనినీ డబ్బుతో కొలిచే నేటి స్వార్ధ ప్రపంచంలో - ఆరేడుగురు ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో ఈ మాత్రం సామాజిక ప్రయోజనం కోసం ప్రయత్నించడం – అదీ నా చల్లపల్లి గ్రామంలోను సుదీర్ఘకాలం జరుగుతుండడం!

            నేనక్కడికి ఆలస్యంగా వెళ్లే సరికే ఈ షష్ట కర్మిష్టుల చేతిలో ఆ కార్యాలయం మూడు ప్రక్కలా ఒక్క పుల్లా లేని, ఎండుటాకులు, గడ్డీ, గోనె సంచిడు ప్లాస్టిక్ గ్లాసులూ, కప్పులూ లేని మంచి దృశ్యం కనిపించింది!

            వీళ్లు కాక - 66 ఏళ్ల లబ్ద ప్రతిష్టుడైన స్వచ్ఛవైద్యుడొకాయన చీపురుతో ఆవరణను ఊడుస్తుండడం కూడ చూశాను. (ఇక్కడి నుండి ఈ వారమంతా ఈయన – మరికొందరితో గలిసి కేరళ పర్యటనకు వెళ్తుండడంతో ఆయనకిదొక తృప్తి!)

            పూల కుండీలు అందంగా అమరిన - కలుపులేని - కశ్మలాలు లేని – స్వచ్ఛ కార్యకర్తల శ్రమతో వందలాది పోలీస్ కార్యాలయాలలో ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తున్న చల్లపల్లి రక్షకభట నిలయాన్ని గ్రామస్తులు తప్పక చూడాలని నా మనవి!

            (28.9.22) రేపటి వేకువ మన విస్తృత కార్యకర్తలు కలిసి, శ్రమించదగినది బందరు రహదారిలోని ‘రాజా’ వారి కాలేజి ప్రాంతమే!

          ఇప్పటి మన చల్లపల్లి

రంగురంగుల పూల తీగలు – ఈ మనోహర కుడ్య చిత్రం

శుభం పలికే పూర్ణ కలశం - పురులు విప్పిన నెమలి నృత్యం

అణువణువు - ప్రతి అంగుళంలో ఆరబోసిన ప్రకృతి అందం

“అందమే ఆనందదాయక” మనిన ‘కీట్స్’ కవి అంతరంగం!

- నల్లూరి రామారావు,

27.09.2022.