2548* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

శ్రమదాన ధారావాహికలో 2548* వ ఎపిసోడ్.

         శుక్రవారం (30-9-22) నాటి సీరియల్ కర్తలు 25 మందైతే - కార్యక్షేత్రం బందరు దారిలో మునసబు వీధి నుండి భారతలక్ష్మి వడ్లమర వీధి దాక! 4.18కి తొలుత చేరుకొన్న కార్యకర్తలు 6.10 దాక గ్రామ ప్రయోజనకర శ్రమానందంతో గడిపారు. అటుపిమ్మట చిరు చినుకుల్లోనే కబుర్లో - కాఫీలో....మరో 20 నిముషాలు!

         చాలమంది స్వచ్ఛ - సుందరోద్యమాభిమానులు ఈ కార్యకర్తల్ని త్యాగధనులనీ, బొత్తిగా నిస్వార్ధపరులనీ, ఒక మంచి లక్ష్యం కోసం వేలరోజుల - లక్షల గంటల శ్రామికులనీ పొగిడితే... అది అబద్ధం కాదు గాని - దానికొక చిన్న సవరణ ఉన్నది. అదేమంటే వాళ్లకు చిన్నపాటి స్వార్ధాలున్నవి! మొదటి స్వార్ధం - ఏరోజుకారోజు ఒక మంచి పనిచేశామనే సంతృప్తి! ఆతృప్తితో - 'గంటన్నర కాయకష్టంతో హాయిగా నిద్రపోగలగడం, ఆరోగ్యంగా నిలవడమనేది రెండో స్వార్థం.

         మూడోది మరీ విచిత్రం! వీరిలో కొందరి ప్రత్యేకతేమంటే "ఇదిగో, 10 గజాల వీధి వరకు నేను సాధించిన పారిశుద్ధ్యం - ఈ పిచ్చి ముళ్ల మొక్కలన్నీ - ఈ గడ్డినంతా నేనే తొలగించాను..."అనే అదనపు సంతృప్తి!

         నాలుగు రోజుల్నాడే డాక్టర్ DRK గారు తాను లేని ఈ ఐదురోజుల్లో ఎత్తైన గడ్డిదుబ్బుల్ని - రోడ్డుకు లోతట్టు పిచ్చి మొక్కల్నీ అంటుకోవద్దనీ - పురుగూ పుట్రల ప్రమాదముంటుందనీ చేసిన హెచ్చరిక ఈ వేకువ అమలు జరగనేలేదు.

         సువిశాలమైన బందరు రహదారి ఎడ్ల బళ్ల నుండి జారిన ఇసుకతో, దుమ్ముతో, సన్న చినుకుల్తో సగభాగం వ్యాపించి అంటుకుపోయింది. 15 మంది చేతుల నొప్పి లెక్కచేయకుండా గోకుడు పారల్తో చెక్కగా, మొండి చీపుళ్ళతో గట్టిగా ఊడ్వగా, 100 గజాల దూరం ఇప్పుడు విశాలంగాను, ప్రత్యేకంగానూ కనిపిస్తున్నది!

         “శ్రమయేవ జయతే అనే చల్లపల్లి స్వచ్చోద్యమ నినాదం అమలు జరిగినంత కాలం ఈ ఊరి రోడ్లు ఇలాగే శోభించవచ్చు.

         నిన్నటి, నేటి వ్యర్ధాలు ట్రాక్టరులో నిండి, చెత్త కేంద్రానికి పయనించాక, కొద్దిమందిని బ్రతిమాలి పనిమాన్పించాక, కాఫీ సేవనం తరువాత, 6.35 కు జరిగిన సమీక్షా సభలో విస్పష్టంగా ముమ్మారు స్వచ్ఛ సంకలాన్ని నినదించినది శివరాంపుర వాస్తవ్యుడు ప్రేమానందుడు! ఒకటో రెండో ఆదర్శాలను వల్లెవేసినది గురవయ్య గురుదేవుడు! 3-10-22 వ నాడు తమ తండ్రి నాదెళ్ల ఆంజనేయుల కర్మకాండను కార్యకర్తలకు గుర్తుచేసినది బంకు పూర్ణ!

         వర్షం లేకుంటే బందరు వీధిలోను, ఉన్నచో బైపాస్ వీధిలోను రేపటి వేకువ శ్రమదానమన్నది సమష్టి అంగీకారం!

 

         ఊరితరపున ప్రసూనాంజలి

అంచనాలను మించిపోయిన - హద్దులన్నిటి చెరిపివేసిన

అడ్డులెన్నో దాటి వచ్చిన - స్వచ్ఛ సంస్కృతి పాదుకొల్పిన

నిత్య నీరాజనంతో మీ సొంత ఊరిని సమర్పించిన

యోధులారా! మీకిదే మా ఊరితరపున ప్రసూనాంజలి!

- నల్లూరి రామారావు,

30.09.2022.