2609* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

విజయవంతమైన రహదారి పారిశుద్ధ్యం - @2609*

          ఆ కృషి శుక్రవారం (2.12.22) వేకువ సమయానిది! కాలం 4.206.10 నడుమ! స్థలం నడకుదురు బాటలో! అందుకు కారణమైన వాళ్లు 26 మంది! వారిలో వైద్యులు, వైద్య సిబ్బంది, రైతులు, గృహిణులు, ప్రస్తుత & విశ్రాంత బడిపంతుళ్లు వగైరా. ఈ పాతిక మంది 2 - 3 కి.మీ దూరంగా వీధికెక్కింది వేకువ వేళ 3.30 తర్వాత నిద్రపట్టక, తోచక కాదు. కేవలం ఒక కనీస సామాజిక బాధ్యత కోసమే!

          ఎవరు కనిపెంచితే, ఏ గురువులు విద్యాబుద్ధులు నేర్పితే, ఏ సమాజం తమ వ్యక్తిత్వాన్ని తీరిదిద్దితే - కనిపించిన, కనిపించని ఎందరి ప్రత్యక్ష పరోక్ష సహకారాలందితే - తామిప్పుడీ స్థితికి చేరారో ఈ పాతిక మందికీ బాగా ఎరుకే! పాక్షికంగానైనా సదరు ఋణాల నుండి విముక్తులయ్యే ప్రయత్నమే వీళ్ల స్వచ్ఛ - సుందరోద్యమ మూలకారణ మయిందేమో!

          ఇలాంటి ఆలోచనల పునాదులున్న కార్యకర్తలకు తమ పనుల జయాపజయాల ప్రసక్తే ముంటుంది? తాము నిన్నా - మొన్నా బాగు చేసిన చోటనే - తమ గ్రామస్తులే వంటింటి వ్యర్థాలైన రొయ్యల - పీతల - చేపల కూరల - వ్యర్థాలు తెచ్చి పడేస్తే కూడ ఈ శ్రమదాతల సహనం చెక్కు చెదరలేదు! చచ్చిన దూడల్ని, కుక్కల్ని ఈడ్చుకొచ్చి పడేసినా కోపగించలేదు!

నేటి 100 గజాల రహదారి బాధ్యతలుగా:

1) ఊరి వైపు నుండి ఆరేడుగురు కత్తుల వారు గడ్డినీ, పనికిరాని మొక్కల్నీ తొలగించి, తాము నాటి పెంచే వాటి పాదుల్ని మాత్రం తేటపరచి, వారిలో ఒకరు దంతెతో వ్యర్థాల్ని గుట్టలు పెట్టారు.

2) ముగ్గురు నలుగురు బలంగా దూడ, కుక్కల మృత కళేబరాల్ని ట్రాక్టరులోకి ఎక్కించారు.

3) ఏడెనిమిది మందికి దొరికిన పనేమంటే - కరెంటు సంస్థ వారు కోసి పడేసిన పెద్దకొమ్మల్ని - ముక్కలుగా కోసి, నరికి, ట్రక్కులో పేర్చడం.

4) వీళ్లకి 50 గజాల దూరాన ఐదుగురు సుందరీకర్తలకు కరెంటు తీగల్ని తాకబోతున్న పూల చెట్ల కొమ్మల్ని నిచ్చెన పైకెక్కి కత్తిరించడం, పనిలో పనిగా సుందరాకృతులుగా మలచడం వంటి పనులు చేతి నిండా దొరికినవి.

5)  చీకట్లో సాధ్యమైనంత మౌనంగా వస్తున్న ఇసుక బళ్లనూ, చతుశ్చక్ర వాహనాల్నీ తప్పించుకొంటూ బాటనూ, రెండు అంచుల్నీ ఊడ్చి శుభ్రం చేసిన సత్కార్యం ఇంకొందరిది!

          దూరంగా ఉండి విలాసంగా చూసేవాళ్లకీ, స్వచ్ఛ సుందరీకరణం జోలికెన్నడూ రాని గ్రామస్తులకూ పైన చెప్పిన పనులు తేలికగా అనిపిస్తాయి గాని, స్వయంగా దిగితే గాని వాటి కష్టమూ - సార్థక్యమూ తెలియవు!

          తాము శుభ్రపరచిన చోటనే వీళ్లంతా సమావేశమై, కస్తూరి విజయుడు దద్దరిల్లేట్లు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్ఛ సౌందర్య సాధనా నిశ్చయాన్ని పునరుద్ఘాటించి, 6.45 - 7.00 కు ఇళ్లకు చేరారు!

          రేపటి స్వచ్ఛ సుందరోద్యమ ఘట్టాన్ని సన్ ఫ్లవర్ కాలనీలోని పాఠశాల దక్షిణ భాగానికి మార్చడమైనది.

   చేస్తున్నాం ప్రణామాలు - 173

ఆవేశం కావేశం అణగి మణగి ఉండునట్లు

రాగద్వేషం లేక ప్రజాభ్యుదయ మార్గంలో

ఎవరు మోయుచున్నారో స్వచ్ఛోద్యమ జయ పతాక

వారికె మా ఆహ్వానం - వారికె మా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   02.12.2022.