2674* వ రోజు......... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

పెదకళ్లేపల్లి దారికి మారిన శ్రమదానం - @ 2674*.

            మంగళవారం 07.02.2023 ఉదయాన రెస్క్యూ టీమ్ కలుసుకొన్నది గంగులవారిపాలెం బాటలోని గస్తీ గది వద్ద వెళ్లింది 3 కిలో మీటర్ల దూరాన గల శివరామపురం బాటలోని కోళ్ళ చేపల దాణా ఉత్పత్తి కేంద్రం- సాగర్ ఆక్వా ఫీడ్స్వద్దకు.

            ఈ వేకువ కూడ 4.30 కే నడకలోనున్న నలుగురు కార్యకర్తలు వీడ్కోలు చెప్పగా ఆదివారం నాటి కళ్లేపల్లి వీధి పారిశుద్ధ్య కృషికి దిగారు. ఆ నలుగురికి తోడు మరొక హిందీ పంతులూ, పశు వైద్యుడూ!

            ఆ రహదారిలో 10 రోజులుగా జరుగుతున్న శ్రమదానం శివరాత్రి నాటికి ఆ 3 కిలో మీటర్ల బాటను పరిశుద్ధ సుందరీకరించేందుకే! దానికి కొనసాగింపే నేటి పరిమిత కార్యకర్తల ప్రయత్నం!

- ఎండు తాడి చెట్ల ఆకుల్ని తొలగించడమూ, కత్తితో చెక్కి, వాటిని సుందరీకరించడమూ, స్వచ్చ కార్యకర్తలకు ప్రాత హాబీ! చేట్టేమిటి – పుట్టేమిటి - పొలం గట్టేమిటి - వీధి మార్జినేమిటి - కాల్వ గట్లేమిటి - తొమ్మిదేళ్లుగా - ‘కాదేదీ తమ శ్రమకు అనర్హం!అని ఋజువు చేస్తున్న కార్యకర్తలు తిరునాళ్ళు దగ్గర పడినప్పుడు ఈ దారినెంత సుందరీకరించాలో అంతగా శ్రమిస్తున్నారు!

- ఆదివారం ప్రోగుబడిన వ్యర్థాల గుట్టల సమస్యనూ పరిష్కరించారు.

- సారా దుకాణం వద్ద డ్రైను గట్టున పెరిగిన గడ్డినీ కొంతమేర తొలగించారు ఇవన్నీ హద్దు మీరి కురుస్తున్న మంచులోనే!

            6.30 దాటాక పని ముగించి, మళ్ళీ గస్తీ గదికి చేరుకొని, మాలెంపాటి అంజయ్య మార్గదర్శకత్వంలో గ్రామ – స్వచ్చ -సుందర శ్రమదానోద్యమ స్ఫూర్తిని చాటే నినాదాలు వినిపించారు.

            రేపటి వేకువ శ్రమదానం కోసం మన రాకకై ఎదురు చూస్తున్నది శివరామపురం బాటలోని సాగర్ ఆక్వా దాణా మిల్లు - సారా దుకాణ ప్రాంతమే!

            నిర్వికారం నిశ్చలత్వం

ఒక సమున్నతమైన లక్ష్యం ఒక వినోదం ఒక ప్రమోదం

ఒక సుచిత్రం ఒక విచిత్రం బ్రహ్మ కాలపు సమయదానం

నిర్వికారం- నిశ్చలత్వం నిఖిల జగతికి మహాదర్శం

స్వచ్చ సుందర చల్లపల్లికి సాహసించిన పెను విశేషం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

  07.02.2023.