2717* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

శనివారం 25.03.2023 - నాటి సామాజిక బాధ్యత - @2717*

          సమయమెప్పుడంటే - వేకువ 4.19 - 6.16 నడుమ! స్థలమెక్కడనగా - ఊరికి 2 కి.మీ. దూరాన బెజవాడ రోడ్డులోని ఈశ్వర్ మెకానిక్స్దగ్గర! గ్రామ సేవకు పాల్పడిన దెందరంటే - 25+2 (చివరి ఇద్దరూ పైపై కార్యకర్తలు!) మంది! సుమారు 2 గంటలు - మొత్తం మీద 40 + పని గంటలు సాధించిందేమంటారా - ఒక ఖాళీ స్థలంలో కొంతా, ప్రక్క సందులో కొంతా, మిగిలింది బెజవాడ రోడ్డు పారిశుద్ధ్యం!

          బిడియ పడకుండా పాతిక మంది నిర్వహించే (కొందరి దృష్టిలో), సిగ్గుమాలిన మురికి - రొచ్చు పనులుగురించి సామాజిక మాధ్యమాల్లో వ్రాయదగినంత విషయ మేముందని ఇప్పటికీ కొందరికనిపిస్తుందట! వీధి పారిశుద్ధ్య -నవీకరణ - హరిత సుందరీకరణ - సుదీర్ఘ శ్రమదానాన్ని లోతుగా ఆలోచించకుండానే, ఒకటో - పదో కాక 2717* రోజుల్నుండీ ఈ విద్యాధికులూ, గౌరవ జీవనులూ చేసుకుపోతున్నారా?

          తగుదుమమ్మాఅంటూ గ్రామ గ్రామేతర - దేశ - దేశాంతర చింతనులు ఈ రోతపనులకు శిరసా నమస్కరిస్తారా? అసలు సంగతేమంటే - స్వచ్ఛ సైనికుల దృష్టిలో ఈ శ్రమదానం పవిత్ర బాధ్యతే తప్ప - ప్రహసనం కానే కాదు! సాధారణ ప్రజల సమగ్ర ఆరోగ్య బాధ్యతను మోసే శక్తి పంచాయితీలకు - ప్రభుత్వాలకు చాలనపుడు ఈ మాత్రం బాధ్యతలు పంచుకోవడం ఆవశ్యకం కూడ!

          ఇక – ‘గౌరవం, మర్యాద, హోదావంటి మాటలకర్థమేమిటి? ఊరి ఉమ్మడి సౌకర్యాల కోసం, ఆహ్లాదాల కోసం, ఆరోగ్యాల కోసం చల్లపల్లి - పరిసరాలకు చెందిన ఒక గుంపు తమ శక్తినీ - కాలాన్ని కష్టార్జిత ధనాన్నీ ఖర్చు చేస్తే తప్పేమిటి?

          నేటి శ్రమదానం ½ కిలోమీటరు రహదారికి విస్తరించినా - ప్రధానంగా క్రొత్త అపార్ట్మెంట్ల సమీపాన్నే కేంద్రీకృతమయింది! సుందరీకర్తల పనే - చెట్ల పాదుల్ని సవరించి, కొమ్మల్ని సంస్కరించి, వాటి రెమ్మలు కరెంటు తీగలంటు కోకుండ కత్తిరించే కృషే ఎక్కువ దూరానికి పోయింది!

          ఈ ఉదయం ఏమైనా సరే సమయ నియమం పాటించాల్సిందే - 6.00 కు పనులాపవలసిందే...అని కొందరనుకొన్నా - ఎప్పట్లాగే 6.15 కు గాని చెత్త లోడింగు ఆగలేదు!

          లోడింగుదేముందిలే 15/20 నిముషాల్లో ముగుస్తుందనుకొంటే చివరికదే బాగా ఆలస్యమయింది. కిలోమీటరు బారునా బాటకు పడమర డ్రైన్ లోని గుట్టల కొద్దీ వ్యర్దాల్ని డిప్పల కెత్తి, మోసి, ట్రాక్టర్ లో సర్డుబాటు నిపుణుడి కందించి - చివరికి చూస్తే ఆ ట్రక్కు నిండనే నిండింది!

          అసలు ఏ రోజైనా 6.00 కు పని ముగియకుండ అడ్డుపడుతున్నది వ్యర్థాల ఎత్తుడే! పోనీ - రేపు ఎత్తవచ్చు గదా అంటే ఆ సమయంలో ఆ వూపులో - పని వేడిలో- ఆ ఐదారుగురు కార్యకర్తలు ఒప్పుకోరు! ఏ మంచి పనికైనా కృత్యాద్యవస్ధఅనీ, స్టార్టింగ్ ట్రబులనీ అంటారు గాని - చల్లపల్లి కార్యకర్తలకు మాత్రం తమ శ్రమదాన వేడుకను అర్థాంతరంగా ఆపడమే కష్టమైపోతున్నది!

6.35 కు ముగిసిన నేటి పని సమీక్షా సభలో -

1) దేసు మాధురీ నామధేయ గేస్తురాలు ముమ్మారు దంచేసిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ సందేశ నినాదాలూ,

2) అడపా వాని సందర్భోచిత సూక్తులూ,

3) వాటి మీద ఒకరిద్దరి వ్యాఖ్యానాలూ, కాక -

          రేపటి వేకువ శ్రమ వేదిక క్రొత్త అపార్ట్మెంట్ల గేటు నుండేఅనెడి నిర్ణయమూ జరిగాయి!

          అమాంతముగ ఊడిపడున?

ఎవరైనా కోరదగిన విలాంటి విధులే కావా -

ఈ శుభ్రత - ఈ స్వస్తత - ఈ మనోజ్ఞతలు కావా -

ఆకాశం నుండి అన్నీ అమాంతముగ ఊడిపడున?

కష్టించక సుఖ శాంతులు కట్టకట్టుకొని వచ్చున?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.03.2023.