2718* వ రోజు....... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

బెజవాడ రోడ్డు పారిశుద్ధ్య కృషి  2718* వ నాటిది!

          ఆదివారం (26.03.2023) వేకువ సమయాన సదరు కృషీ వలురు 24+6 మంది! (మెడికల్ క్యాంపు లోని కార్యకర్తలతో గలిపిన సంఖ్యన్న మాట). చల్లపల్లి స్వచ్చ – సుందరోద్యమ దినాల సంఖ్య గాని, లెక్కలు తీస్తే – లక్షల కొద్దీ పని గంటలు గాని, పారిశుద్ధ్య పనులు జరిగే – సమావేశాలూ గట్రా సంభవించే వేళలు గాని – క్రొత్త వాళ్లకు చూస్తే తప్ప నమ్మజాలని చిత్ర విచిత్రాలే!

          మరి – నాగరికతలు బలపడిన, కష్టించే తత్త్వం లోపించిన, బద్ధకాలు పెరిగిపోతున్న, ఎవరి పనులకు వాళ్లు పూనుకోవడమే చిన్నతనంగా అనుకొంటున్న, ఒక్క మాటలో పూర్తిగా క్రొత్త సంస్కృతి సంతరించుకొంటున్న పల్లెటూళ్ళలో;

          3 ½ కే మేల్కొని – 4.15 కే వీధుల్లో కెక్కి – ఏ వీధిలో ఏ అపరిశుభ్రతుందో వెతుక్కొని – ఏ చెట్ల పచ్చదనం, ఏ పూల మొక్కల ఉనికీ తగ్గినవో పరిశీలించి – పరిరక్షించుకొనే 30-40-50 మంది కార్యకర్తలు కనీసం ఒక చల్లపల్లి లో ఉన్నారంటే – తమ వృత్తుల్ని 2-3 గంటలు ప్రక్కన బెట్టి – సామాజిక బాధ్యతా ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నారంటే – చప్పున నమ్ముతారా?

          ఆ నమ్మిక కుదరకే – ఇక్కడి శ్రమదాన వింతని ప్రత్యక్షంగా చూసేందుకే – ఏ 100 ప్రాంతాల నుండో – విదేశస్థాంధ్రులతో సహా ఈ మారుమూల చల్లపల్లి కి వస్తుంటారు! వచ్చిన వాళ్లలో కొందరు మితిమీరిన ఉత్తేజితులై – వాళ్ల సొంతూళ్ళలో మెరుగుదల కోసం శ్రమదానాలకు పూనుకొంటారు!

          ఇంతా జేస్తే – ఈ చల్లపల్లి కార్యకర్తలది ప్రసార మాధ్యమాల్లో పతాక శీర్షికల కెక్కేంత  మహాత్కార్యమా అంటే – అదేమీ కాదు! అసలా కార్యకర్తలే తమది సేవ కాదు – కనీస సామాజిక కర్తవ్యం అనుకొంటారు!

          ఈ 2718* వ నాటి చెప్పుకోదగిన అలాంటి బాధ్యతలు 2 జరిగాయి .

1) రెండు దశాబ్దాలకు పైగా – గోపాళం శివన్నారాయణుడి 48 క్యాంపుల్లో 2 వదిగా నిర్వహింప బడుతున్న వైద్య శిబిరం! అదీ వేకువ 4.30 కే ప్రారంభం!

2) చల్లపల్లి గ్రామస్తులకు పరిమితంగానూ, గ్రామేతర – రాష్ట్రేతర – దేశాంతర వాసులకు అపరిమితంగానూ స్ఫూర్తిదాయకమైన వీధి శుభ్రతా శ్రమదానం!

          రెండూ బెజవాడ రహదారిలోనే! రెండిట్లోనూ పనిచేసేది స్వచ్చ కార్యకర్తలే! ఒక చోట 2 గంటలూ, శిబిరంలో 7-8 గంటలూ వారిదే సహకారం!

          బెజవాడ బాట – క్రొత్త అపార్ట్ మెంట్ల సమీపంలో ఊడ్చిన చీపుళ్లలో కొన్ని విజయా కాన్వెంట్ లోని వైద్య శిబిరం లోనూ శుభ్రపరిచాయి! ఆ శ్రమదానం రెండు చోట్లా ప్రవహించింది!

          6.30 కు జాస్తి జ్ఞాన ప్రసాద స్వచ్చ-సుందరోద్యమకారుని గ్రామ శ్రమదాన త్రివిధ నినాదాలను పునరుశ్చరించి, పాతిక మంది కార్యకర్తలూ ఇళ్ళదారి పట్టారు! గురవయ్య గారి కొటేషన్లూ విన్నారు!

          బుధవారం నాటి శ్రమదానం కోసం బెజవాడ బాటలోని అపార్ట్ మెంట్ల దగ్గర కలుద్దామనీ నిర్ణయించుకొన్నారు!

                కై మోడ్పులు చేస్తున్నాం!    

          ఎవరు మొదలు పెట్టినారొ ఈ శ్రమదానం చర్యను

          రోత మురుగు – దుమ్ము- ధూళిలో జరిగే దిన చర్యను

          అనుసరించి-విసుగు లేక కొనసాగిస్తున్నదెవరొ

          గ్రామ ప్రజల తరపు నుండి కై మోడ్పులు చేస్తున్నాం!     

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.03.2023.