2719* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

రెస్క్యూ కార్యకర్తల 27.3.23 వ  నాటి ప్రయత్నాలు - @2719*

            అవి ఈ సోమవారం వేకువ 4.30 - 6.20 నడుమ జరిగినవి; ఆ ప్రయత్నీకులు 7+1 మంది; (చివరి ఒంటరి సంఖ్యగా నేను!)  స్థలం - బండ్రేవుకోడు మురుగు కాల్వ ఉత్తరం గట్టు!

            గత వారం చెట్ల క్రమబద్దీకరణకు కొనసాగింపుగానే నేటి 7 గురి కృషి!  ఈ ఒక్క ఉదయమే ఆరు పెద్ద చెట్ల కొమ్మల్ని -

1) రోడ్డుకు ఉత్తరాన కరెంటు తీగల కంటుకొనకుండానూ,

2) దక్షిణాన పెద్దకొమ్మల బరువుకు అవి చెట్టును కాల్వలోకి వంచకుండా,

3) నరికిన మొండి శాఖలకు ముందు ముందు రాబోయే పిలకలు గుమ్మటాల్లాగే పెరిగే ప్రణాళికలతోనూ

            కోశారు తప్ప - తామే నాటి బ్రతికించి - పెంచిన ఇంత పచ్చని చెట్లను నిష్కారణంగా, నిర్దయగా వాళ్లు తొలగించలేదు!

            నేను ఆలస్యంగా వెళ్ళేప్పటికే ఒక శివరాంపురం కార్యకర్త వచ్చి పనిలో దిగాడు. ఒక కాంపౌండరూ, ట్రస్టు ఉద్యోగులూ, మిగిలిన చిరుద్యోగులూ తగుదుమమ్మా - అని వేకువ కాలానే ఎందుకీ పనులకు పూనుకోవలె?

            20 కి పైగా అడుగుల నిచ్చెన మెట్ల మీద నిలిచి, కొమ్మల పంగల్లో నిలబడి, క్రింది వాళ్లందించిన కత్తో- మర రంపమో వాడి, ఊరిలో ఒక వీధి సౌందర్య - సౌకర్యాల కోసం ఎందుకింత దీక్ష పట్టవలె?

            ఆలస్యంగా కాలుపెట్టిన నేను సైతం చూచ్చూసి, పనిలో వ్రేలు పెట్టి ఒక దశలో కత్తి పట్టి చెట్టు కొమ్మను నరికేంత స్ఫూర్తి ఏల కలుగవలె

            వచ్చే - పోయే కాలి నడక దారులూ, వాహన చోదకులు కొమ్మ లడ్డుగా ఉండడంతో 10 నిముషాలు ఆగినా - ఈ శ్రమదాన సంగతిని పట్టించుకోక - నిమ్మకు నీరెత్తి నట్లేల ఉండిపోవలె?

            6.35 కు ఈ ఊరి పారిశుద్ధ్య చాదస్తుడు తూములూరి లక్ష్మణుడు గట్టిగా విన్పించిన స్వచ్చ - సుందరోద్యమ సంకల్ప నినాదాలను పునరుద్ఘాటించి - నేటి తమ గ్రామ బాధ్యతను పూర్తి చేసుకొన్నారు!

       తప్పక వెలుగొంద గలవు!

గొప్ప గొప్ప వాళ్లెన్నడు ఘోషించరు తమ ఘనతలు

నిప్పులాంటి నిజాలన్ని నివురు గప్పియే ఉండును

స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతైన అంతే గద!

దాని తెగువ - దాని విలువ తప్పక వెలుగొంద గలవు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.03.2023.